పంటలు ఎండుతున్నాయంటూ .. పాలేరు పాత కాలువ గేట్లెత్తిన రైతులు

  • పంటలు ఎండుతున్నాయంటూ .. పాలేరు పాత కాలువ గేట్లెత్తిన రైతులు
  • 150 క్యూసెక్కులు విడుదల  
  • డెడ్​స్టోరీజీలో ఉందంటూ 
  •  రైతు నాయకులతో చర్చించిన ఆఫీసర్లు 
  • ఎట్టకేలకు గేట్లు మూసేసిన అధికారులు

కూసుమంచి, వెలుగు: తమ పంటలు ఎండుతున్నాయంటూ ఖమ్మం జిల్లా కూసుమంచి మండలంలోని పాలేరు పాత కాలువ ఆయకట్టు పరిధిలో కూసుమంచి, నేలకొండపల్లి రైతులు ఆదివారం కాలువ గేట్లను ఎత్తారు. అంతకుముందు ఎండిన వరి పైరుతో పాలేరు పాత కాలువ వద్దకు వచ్చి ఖమ్మం–సూర్యాపేట రాష్ట్ర రహదారిపై రాస్తారోకో చేశారు. సుమారు 20వేల ఎకరాల్లో వరి, చెరుకు ఇతర పంటలు సాగు చేశామని, నీళ్లు లేక ఎండిపోతున్నాయని వాపోయారు. వెంటనే నీటిని విడుదల చేయాలని అధికారులను కోరగా పాలేరు జలాశయం డెడ్​స్టోరెజ్​లో ఉన్న కారణంగా సాగునీటిని విడుదల చేయడం కుదరదని చెప్పారు.

ప్రస్తుతం సాగర్​ నుంచి 3వేల క్యూసెక్కులు వస్తుండగా జలాశయ నీటిమట్టం16 అడుగులకు చేరుకుందని, దీంతో తాగునీటి అవసరాలకే మాత్రమే నీటిని ఉపయోగించుకోవాలని ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలున్నాయన్నారు. అయినా రైతులు వినకుండా బలవంతంగా పాత కాలువ గేట్లను ఎత్తి 150 క్యూసెక్కులను విడుదల చేసుకున్నారు. అధికారుల చెప్పినా వినిపించుకోలేదు.

ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో ఖమ్మం ఆర్డీవో గణేశ్​, ఖమ్మం రూరల్​ఏసీపీ బస్వారెడ్డి, సీఐ కంది జితేందర్​రెడ్డి, ఐబీ ఈఈ మంగళంపూడి వెంకటేశ్వర్లు అక్కడకు చేరుకున్నారు. రైతు నాయకులతో చర్చలు జరిపి కాలువ గేట్లను బంద్​ చేయించారు. డీఈలు అననీయ, రత్నకుమారి, ఎస్సైలు రమేశ్​కుమార్, వరాల శ్రీనివాసరావు, సతీశ్, రైతు నాయకులు జూకూరి గోపాల్​రావు, రాజు ఉన్నారు.