కూసుమంచి, వెలుగు : ఖమ్మం, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్ జిల్లాలకు మిషన్ భగీరథ ద్వారా తాగునీటిని అందించే పాలేరు రిజర్వాయర్ డెడ్ స్టోరేజీకి చేరుకుంది. రిజర్వాయర్ పూర్తిస్థాయి నీటిమట్టం 23 అడుగులు కాగా శనివారం నాటికి 12 అడుగులకు చేరుకుంది. రిజర్వాయర్ డెడ్ స్టోరేజీ 11 అడుగులు కావడంతో మరో 6 నుంచి 10 రోజుల వరకే తాగునీటి సరఫరా జరిగే అవకాశం ఉంది. రిజర్వాయర్ నీటిమట్టం డెడ్ స్టోరీకి చేరితే మిషన్ భగీరథ మోటార్లకు నీరు అందదు. దీంతో సరఫరా నిలిచిపోనుంది.
నాగార్జునసాగర్, ఎస్సారెస్సీ నుంచి కూడా ఇన్ఫ్లో రాకపోవడంతో ప్రజలకు తాగునీటి ఇబ్బందులు తప్పేలా లేవు. జూన్ వరకు తాగునీటి సరఫరా చేయాలంటే మరో 2 టీఎంసీల నీరు అవసరం.