- ఇజ్రాయెల్ దాడులకు భయపడం: పాలస్తీనా రాయబారి అద్నాన్ మహ్మద్
- ఆ దేశానికి మా మద్దతు: సీపీఐ
హైదరాబాద్, వెలుగు: ఇజ్రాయెల్ ఎన్ని దాడులు చేసినా.. తామంతా పాలస్తీనా భూభాగంలోనే జీవిస్తామని, అక్కడే మరణిస్తామని ఇండియాలో పాలస్తీనా రాయబారి అద్నాన్ మహ్మద్ జుబేర్ అబుల్ హయెజా అన్నారు. గతేడాది అక్టోబర్ 7న ఇజ్రాయెల్‌పై హమాస్ చేసిన దాడిని టెర్రర్ అటాక్ అంటున్నారని, కానీ అంతకుముందు గాజాపై ఇజ్రాయెల్ దాడులు చేసిందన్నారు. హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సీపీఐ ఆధ్వర్యంలో ‘పాలస్తీనా సంఘీభావ సభ’ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అద్నాన్ మహ్మద్ జుబేర్ పాల్గొని మాట్లాడారు. ఆక్రమణకు గురైనవారు టెర్రరిస్టులు కారని, ఆక్రమణదారులే అసలైన టెర్రరిస్టులని పేర్కొన్నారు. గాజా స్ట్రిప్‌లో 23 లక్షల మంది నివసిస్తున్నారని, అందులో 75 శాతం ప్రజలు పేదరికంలో ఉన్నారని చెప్పారు.
హమాస్ దాడి జరిగిన అక్టోబర్ 7కు ముందు గాజా స్ట్రిప్‌లో 260 మంది పాలస్తీనీయులను ఇజ్రాయెల్ చంపేసిందని, 11,700 మందిని ఖైదు చేసిందన్నారు. కాల్పులు విరమించాలని ప్రపంచమంతా కోరుతున్నా ఇజ్రాయెల్ పెడచెవిన పెడుతోందన్నారు. సీపీఐ ప్రధాన కార్యదర్శి డి.రాజా మాట్లాడుతూ.. కేంద్రంలో మోదీ ప్రభుత్వం వచ్చాక సామ్రాజ్యవాద, అమెరికా అనుకూల విధానాన్ని అవలంబిస్తున్నదని ఆరోపించారు. దేశంలో ఏ ప్రభుత్వం వచ్చినా, వారు ఎలాంటి వైఖరి తీసుకున్నా సీపీఐ మాత్రం పాలస్తీనా ప్రజలకు మద్దతుగా ఉంటుందన్నారు. ఈ సందర్భంగా పాలస్తీనాకు సంఘీభావంగా సభికులు ఇచ్చిన రూ.50 వేల విరాళాన్ని జుబేర్కుఅందజేశారు. కార్యక్రమంలో సీపీఐ కార్యదర్శులు పల్లభ్ సేన్ గుప్తా, కె.నారాయణ, అజీజ్ పాషా, రామకృష్ణ పాండ్య, జాతీయ కార్యవర్గ సభ్యులు కూనంనేని సాంబశివరావు, చాడ వెంకట్ రెడ్డి పాల్గొన్నారు.