- ప్రస్తుతం రాకేశ్‌రెడ్డి తరఫున ప్రచారంలో కనిపించని టీమ్స్
- మాజీ ఎమ్మెల్యేలపైనే భారం
నల్గొండ, వెలుగు : నల్గొండ, వరంగల్, ఖమ్మం గ్రాడ్యుయేట్ నియోజకవర్గానికి 2021లో జరిగిన ఎన్నికల్లో హల్‌చల్ చేసిన పల్లారాజేశ్వర్ రెడ్డి గ్రూప్స్, అనురాగ్ టీమ్స్ ఇప్పుడు ఎక్కడా కనిపించడం లేదు. ప్రస్తుతం జరుగుతున్న ఉప ఎన్నికల్లో తన అనుచరుడు రాకేశ్‌రెడ్డికి టికెట్ ఇప్పించడమే కాకుండా గెలుపు బాధ్యతను సైతం పల్లానే తీసుకున్నాడు. కానీ తన టీమ్స్ లేకపోవడంతో మాజీ ఎమ్మెల్యేలపైనే ఆధారపడాల్సి వస్తోంది. పల్లా ఒక్కరే రాకేశ్‌రెడ్డిని వెంటేసుకొని నియోజకవర్గంలో తిరుగుతున్నారు.
2021లో అన్నీ తామై నడిపించిన పల్లా టీమ్స్
పల్లా ఎమ్మెల్సీ బరిలో నిలిచిన టైంలో ప్రభుత్వంపై వ్యతిరేకత విపరీతంగా ఉంది. అంతేగాక గ్రాడ్యుయేట్ స్థానం నుంచి అప్పటికే ఎమ్మెల్సీగా ఉన్నా నిరుద్యోగులు, ఉద్యోగుల సమస్యల గురించి పట్టించుకోలేదని, పార్టీ పనులకే పూర్తి పదవీకాలాన్ని వినియోగించారని ఆయనపై ఆరోపణలు వచ్చాయి. పైగా పల్లా పట్ల అప్పటి ఎమ్మెల్యేలు సైతం తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. దీంతో పల్లా తానే స్వయంగా టీమ్స్‌ను ఏర్పాటు చేసుకొని రంగంలోకి దిగారు. అప్పుడు ఎమ్మెల్యేలను ప్రచారం వరకే వాడుకున్నారు.
ఓటర్ల ఎన్‌రోల్‌మెంట్‌తో పాటు, తెరవెనుక ప్రలోభాలకు గురిచేసే వ్యవహారం, పోల్ మేనేజ్‌మెంట్, ఓటర్లకు దావత్‌ల ఏర్పాటు వంటి పనులన్నీ పల్లా టీమ్సే చూసుకున్నాయి. పోలింగ్ జరగడానికి నెల రోజుల ముందు నుంచే రోజుకు సుమారు 50 వేల మందికి పల్లా టీమ్స్ భోజనాలు ఏర్పాటు చేశాయి. ఎక్కడికక్కడ ఓటర్లను ప్రలోభాలకు గురి చేశారు. ఓటుకు రూ. వెయ్యి చొప్పున పంపిణీ చేశారు. ఒక్కో నియోజకవర్గానికి సుమారు రూ.50 లక్షలకుపైగానే ఖర్చు చేసినట్టు ప్రచారం జరిగింది.
కౌంటింగ్ సెంటర్లలోనూ పల్లా టీమ్స్
గతంలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ కేంద్రాల్లోనూ పల్లా టీమ్స్ హల్‌చల్ చేశాయి. ఏజెంట్లుగా పార్టీ లీడర్లను కాకుండా అనురాగ్ కాలేజీలు, పల్లా సన్నిహితుల కాలేజీల్లో పనిచేస్తున్న సిబ్బందిని పెట్టారు. కౌంటింగ్ లెక్కలన్నీ వారే పర్యవేక్షించారు. వాళ్లందరికీ నల్గొండలోని ఓ ఫంక్షన్‌హాల్‌లో నాలుగు రోజుల పాటు బస ఏర్పాటు చేశారు. ఫంక్షన్ హాల్ నుంచి కౌంటింగ్ హాల్‌కు ఏజెంట్లు రాకపోకలు సాగించేందుకు ప్రైవేట్ బస్సులు, వాహనాలు ఏర్పాటు చేశారు. షిఫ్ట్‌ల వారీగా కౌంటింగ్ డ్యూటీలు ఓట్ల లెక్కింపును ఏవిధంగా పర్యవేక్షణ చేయాలనే విషయంపై వీరందరికీ అప్పటికే ట్రైనింగ్ ఇచ్చారు.
ఇప్పుడు అంతా రివర్స్
ప్రస్తుతం జరుగుతున్న గ్రాడ్యుయేట్స్ ఎన్నికల్లో సీన్ మొత్తం రివర్స్ అయింది. రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కార్ అధికారంలో ఉండడానికి తోడు బీజేపీ సైతం గట్టి పోటీ ఇస్తోంది. దీంతో సిట్టింగ్ స్థానాన్ని తిరిగి దక్కించుకునేందుకు హైకమాండ్ పల్లాకే బాధ్యతలు అప్పగించింది. కానీ ఇప్పుడు సమ్మర్ హాలీడేస్ ఉండడంతో అనురాగ్ టీమ్స్ అందుబాటులో లేకుండా పోయాయి. ఏనుగుల రాకేశ్‌రెడ్డికి టికెట్ ఇప్పించడంలో సక్సెస్ అయిన పల్లాకు ఇప్పుడు మరో గత్యంతరం లేక మాజీ ఎమ్మెల్యేలు
మాజీ మంత్రులపైనే ఆధారపడాల్సి వస్తోంది. ప్రస్తుతం దావత్‌లు, ఓటర్లకు డబ్బు పంపిణీ వంటి పనులేవీ కనిపించడం లేదు. అయితే పల్లా రాజేశ్వర్‌రెడ్డి హైకమాండ్‌ను మెప్పించి ఎంతో కొంత పార్టీ ఫండ్ తీసుకొస్తారని, కనీసం పోలింగ్‌కు ఒక రోజు ముందైనా ఓటర్లను తృప్తి పరిచేందుకు ఏదో ఒకటి చేయాల్సిందేనని మాజీలు అంటున్నారు.
ఛాలెంజింగ్‌గా తీసుకున్న బీఆర్‌ఎస్
నల్గొండ, ఖమ్మం, వరంగల్ జిల్లాల్లో ఎంపీ ఎన్నికలను లైట్‌గా తీసుకున్న బీఆర్‌ఎస్ గ్రాడ్యుయేట్ ఎన్నికలను మాత్రం ఛాలెంజింగ్‌గా తీసుకుంది. కాంగ్రెస్ తరఫున తీన్మార్ మల్లన్న రంగంలోకి దిగడంతో సిట్టింగ్ స్థానాన్ని కాపాడుకునేందుకు కేటీఆర్, హరీశ్‌రావు ఎంట్రీ ఇచ్చారని మాజీ ఎమ్మెల్యేలు చెప్తున్నా రు. అదీగాక ఈ మూడు జిల్లాల్లో బీఆర్ఎస్‌కు పల్లా, జగదీశ్‌రెడ్డి మాత్రమే ఎమ్మెల్యేలు ఉన్నారు.
దీంతో మరో మార్గం లేక మాజీ ఎమ్మెల్యేలు, మాజీమంత్రులపైన ఎన్నికల భారం మోపారు. అయితే పార్లమెంట్ ఎన్నికల టైంలో మాదిరిగా ఈ సారి కూడా హ్యాండ్ ఇస్తారేమోనన్న అనుమానంతో పక్క జిల్లాలకు చెందిన మాజీమంత్రులు, మాజీ ఎమ్మెల్యేలను లోకల్ లీడర్లకు అటాచ్ చేశారు.