జనగామ, వెలుగు : తనను భారీ మెజార్టీతో గెలిపిస్తే బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తానని బీఆర్‌ఎస్ జనగామ క్యాండిడేట్ పల్లా రాజేశ్వర్‌రెడ్డి చెప్పారు. బుధవారం తరిగొప్పుల, ఇప్పలగడ్డ, గుంటూరుపల్లి, నర్మెటలో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రతి ఇంటికీ వెళ్లి కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి వివరించారు. అనంతరం పల్లా మాట్లాడుతూ తరిగొప్పుల పక్కన ఉన్న షోడషపల్లికి చెందిన తాను ఎలా నాన్ లోకల్ అవుతానని ప్రశ్నించారు.
కొమ్మూరి జడ్పీటీసీగా పనిచేసినప్పుడు, ఎమ్మెల్యేగా ఉన్నప్పడు తరిగొప్పుల, నర్మెట మండలాలను పట్టించుకోలేదని విమర్శించారు. సంక్షేమ పాలన కేసీఆర్‌తోనే సాధ్యమని చెప్పారు. తరిగొప్పులలో అంబేద్కర్ భవనాన్ని కట్టిస్తానని, గుడికుంట చెరువును మినీ ట్యాంక్ బండ్‌గా మారుస్తానని, నీటి సమస్య ఉన్న కాలనీల్లో మిషన్ భగీరథ నీళ్ల కోసం వాటర్ ట్యాంకులు కట్టిస్తానని, పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా మౌలిక వసతులు కల్పిస్తానని హామీ ఇచ్చారు.
మినీ, సబ్ మార్కెట్ యార్డు కట్టించడంతో పాటు, తరిగొప్పుల నుంచి చేర్యాల రోడ్డు, తరిగొప్పుల నుంచి నర్సింగాపూర్, పోతారం వరకు, జగ్గయ్యపేట భోజ్యాతండా వరకు, జీలగడ్డ వరకు రోడ్డు వేయిస్తానని చెప్పారు. 20, 30 ఎకరాల్లో చెరువు శిఖం ఉన్న దానిని ఎంజాయ్‌మెంట్ సర్వే చేయించి, జీవో 58, 59 ద్వారా ఇళ్ల పట్టాలిప్పిస్తానని చెప్పారు. పల్లా వెంట నాయకులు, ప్రజలు ఉన్నారు. అనంతరం నర్మెట మండలం ఆగపేట వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు జి.సమ్మయ్యతో పాటు పలువురు బీఆర్‌ఎస్‌లో చేరగా వారికి పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు.