మంత్రులు వర్సెస్​ పల్లా..టీఆర్ఎస్ లో డీసీసీబీ లొల్లి

  • వరంగల్, నల్గొండలో తమవారికి ఇప్పించుకునే పనిలో పల్లా
  • ఎర్రబెల్లి, జగదీశ్​రెడ్డికు చెక్ పెట్టే వ్యూహం
  • ఖమ్మంలోనూ పల్లా ప్రయత్నాలు

హైదరాబాద్, వెలుగు: టీఆర్ఎస్​లో డీసీసీబీ ఎలక్షన్ల కిరికిరి నడుస్తున్నది. చైర్మన్ పదవులను సొంత మనుషులకు ఇప్పించుకునేందుకు మంత్రులు, పార్టీ నాయకులు పోటాపోటీగా ప్రయత్నాలు చేస్తున్నారు. పార్టీ పెద్దలను ఒప్పించుకునే పనిలో నిమగ్నమయ్యారు. ఉమ్మడి వరంగల్, నల్గొండ  జిల్లాల్లో మంత్రులకు వ్యతిరేకంగా రైతు సమన్వయ సమితి చైర్మన్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి తన అనుచరులకు డీసీసీబీ చైర్మన్ పదవి ఇప్పించుకునేందుకు పావులు కదుపుతున్నట్లు ప్రచారం జరుగుతున్నది. దీంతో పల్లాపై మంత్రులు ఎర్రబెల్లి దయాకర్​రావు, జగదీశ్ రెడ్డి సీరియస్ గా ఉన్నట్టు తెలుస్తోంది. ప్రతి జిల్లాల్లో 90 శాతం పీఏసీఎస్ లను టీఆర్​ఎస్సే సొంతం చేసుకుంది. ఈ నెల 29న జరిగే డీసీసీబీ చైర్మన్ల ఎన్నిక ఏకగ్రీవమయ్చే చాన్స్ ఉంది. అయితే డీసీసీబీ చైర్మన్లుగా ఎవరిని ఎంపిక చేయాలనే అంశాన్ని పార్టీ పెద్దలు చూస్తున్నారు. జిల్లాల్లో రాజకీయ సమీకరణలు, ఉద్యమ నేపథ్యం దృష్టిలో పెట్టుకొని ఆ పదవులకు క్యాండిడేట్లను ఎంపిక చేస్తున్నారు. కొంత కాలంగా ప్రగతిభవన్ కు దగ్గరగా ఉంటున్న ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి ఉమ్మడి వరంగల్, నల్గొండ జిల్లాల్లో మంత్రులకు చెక్ పెట్టేందుకు, వారికి వ్యతిరేకులుగా ఉన్నవారిని చైర్మన్లుగా చేసే ప్రయత్నం చేస్తున్నట్లు పార్టీ వర్గాల్లో చర్చ నడుస్తున్నది. వరంగల్, నల్గొండ, ఖమ్మం జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గం నుంచి పల్లా ఎమ్మెల్సీగా ఉన్నారు. భవిష్యత్ లో ఈ మూడు జిల్లాల్లో ఏదో ఒక సెగ్మెంట్ నుంచి అసెంబ్లీలోకి రావాలనే వ్యూహంతో డీసీసీబీ చైర్మన్ల ఎన్నిక విషయంలో జోక్యం చేసుకుంటున్నారని ప్రచారంలో ఉంది.

వరంగల్​లో వెలమ వర్సెస్  రెడ్డి

ఉమ్మడి వరంగల్ జిల్లా డీసీసీబీ చైర్మన్ పదవి విషయంలో వెలమ వర్సెస్  రెడ్డి మధ్య పోటీ నెలకొంది. మార్నేని రవీందర్ రావు కోసం మంత్రి ఎర్రబెల్లి ప్రయత్నిస్తుండగా గండేటి రాజేశ్వర్ రెడ్డి కోసం ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి లాబీయింగ్ చేస్తున్నారని స్థానిక నాయకులు అంటున్నారు. స్టేషన్ ఘన్​పూర్ నియోజకవర్గానికి చెందిన గండేటికి డీసీసీబీ చైర్మన్ పదవి ఇస్తే జిల్లా పాలిటిక్స్​లో ఆయన తన వెంట ఉంటారనే ప్లాన్ లో  పల్లా ఉన్నట్లు చర్చించుకుంటున్నారు. దీంతో పల్లా తీరుపై మంత్రి ఎర్రబెల్లి గుర్రుగా ఉన్నట్టు తెలిసింది. జిల్లాకు చెందిన మరో మంత్రి సత్యవతి రాథోడ్ కూడా డీసీసీబీ చైర్మన్ గా మంత్రి ఎర్రబెల్లి ప్రతిపాదించిన అభ్యర్థిని కాదని మరో అభ్యర్థిని  సూచించడం వెనుక పల్లా ప్రోత్సాహం ఉన్నట్లు సమాచారం.

జగదీశ్​రెడ్డి ప్రయత్నాలు ఫలించేనా?

ఉమ్మడి నల్గొండ డీసీసీబీ చైర్మన్ పదవి విషయంలో మంత్రి జగదీశ్ రెడ్డికి పల్లా రాజేశ్వర్ఱెడ్డి చెక్ పెట్టేందుకు ట్రై చేస్తున్నట్లు స్థానిక నాయకులు అనుకుంటున్నారు. మంత్రి సూచించిన వ్యక్తికి ఎట్టి పరిస్థితుల్లో పదవి ఇవ్వొద్దని, అలా చేస్తే పార్టీకి నష్టమని పల్లా చెప్తున్నట్లు సమాచారం. ఉద్యమ కాలం నుంచి మంత్రి జగదీశ్​రెడ్డి టీఆర్​ఎస్​లో  ఉన్నారు. సీఎం కేసీఆర్ కు అత్యంత సన్నిహితుల్లో ఆయన ఒకరనే పేరుంది. కానీ డీసీసీబీ చైర్మన్ పదవి విషయంలో మాత్రం మంత్రికి చుక్కెదురయ్యే అవకాశం ఉందని ఓ సీనియర్  నేత అభిప్రాయపడ్డారు. ఇక్కడి డీసీసీబీ చైర్మన్​ పదవిని పల్లా ప్రవీణ్ రెడ్డికి ఇప్పించేందుకు పల్లా రాశేశ్వర్ రెడ్డి తీవ్రంగా ప్రయత్నించారని.. దీనికి సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చి ఉంటారని సదరు నాయకుడు చెప్పారు. జిల్లాల్లో చాలా కాలంగా రాజకీయాల్లో ఉన్న సుంకరి మల్లేశ్ గౌడ్​కు పదవి ఇప్పించాలని మంత్రి జగదీశ్​రెడ్డి ప్రయత్నిస్తుండగా.. అవి  ఫలించకపోవచ్చని పార్టీ వర్గాలు అంటున్నాయి. పల్లా రాజేశ్వర్​రెడ్డి విషయంలో మంత్రి జగదీశ్​రెడ్డి మొదట్నించి అసహనంగా ఉన్నారని, సమయం కోసం వెయిట్ చేస్తున్నారని ఆయనకు సన్నిహితంగా ఉండే ఓ నాయకుడు కామెంట్ చేశారు. హుజూర్​నగర్​ ఉప ఎన్నికల టైంలో మంత్రి జగదీశ్​రెడ్డిని కాదని పల్లా రాజేశ్వర్​రెడ్డికి ఎలక్షన్​ ఇన్​చార్జ్​గా బాధ్యతలు ఇచ్చారు.

ముందే జాగ్రత్త పడ్డ అజయ్

ఉమ్మడి ఖమ్మం జిల్లా డీసీసీబీ చైర్మన్ పదవి విషయంలో మంత్రి పువ్వాడ అజయ్ ముందే అలర్ట్ కావడంతో పల్లా రాజేశ్వర్​రెడ్డి వెనక్కి తగ్గినట్లు తెలిసింది. ఎన్నారై తాతా మధు కు ఇక్కడి డీసీసీబీ చైర్మన్ పదవి ఇప్పించుకునేందుకు పల్లా ప్లాన్ వేసుకొని.. తిరుమలాయపాలెం నుంచి పీఏసీఎస్  చైర్మన్ గా పోటీకి దింపే ప్రయత్నం చేశారని ప్రచారం. ఈ వ్యూహాన్ని గ్రహించిన మంత్రి అజయ్ వెంటనే కేటీఆర్ కు ఫిర్యాదు చేయడంతో పల్లా తన ప్రయత్నాన్ని విరమించుకున్నారని టీఆర్​ఎస్​ వర్గాల టాక్​.