- గ్రామ అభివృద్ధికి రూ.15 లక్షలు ఖర్చు పెడితే.. పైసా రాలే
- అప్పులోళ్ల వేధింపులు భరించలేక టీఆర్ఎస్ లీడర్ బలవాన్మరణం
- వరంగల్ జిల్లా చెన్నారావుపేట అమృతండాలో ఘటన
చెన్నారావుపేట(నెక్కొండ), వెలుగు: నిరుడు పల్లె ప్రగతిలో అప్పులు తెచ్చి రూ.15 లక్షల వరకు అభివృద్ధి పనులు చేస్తే.. సర్కారు నుంచి పైసా బిల్లు రాలేదు.అప్పులోళ్ల వేధింపులు భరించలేక ఓ లీడర్ పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు.ఈ విషాద ఘటన వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలంలో జరిగింది.పోలీసులు,మృతుడి బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని అమృతండాకు చెందిన బోడ వెంకన్న(29) గ్రామంలో టీఆర్‍ఎస్ పార్టీ లీడర్.రిజర్వేషన్ కలిసిరావడంతో తన చిన్నమ్మ శాంతిని సర్పంచ్ బరిలో నిలిపి గెలిపించుకున్నాడు.ఆమెకు చదువు రాకపోవడంతో అన్ని వ్యవహారాలు వెంకన్నే చూసుకునేవాడు.నిరుడు ఉన్నతాధికారుల సూచనల మేరకు పల్లెప్రగతి కింద గ్రామంలో సీసీ రోడ్లు,శ్మశాన వాటిక,డంపింగ్ యార్డు నిర్మించాడు.ఇందుకోసం రూ.15 లక్షల దాకా బయట అప్పు చేశాడు.ఈ బిల్లులను సర్కారు పెండింగ్పెట్టింది. అప్పులు ఇచ్చినోళ్ల నుంచి వేధింపులు తీవ్రమయ్యాయి.ఆదివారం కూడా వారు ఇంటిమీదికి రావడంతో వెంకన్న తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు.సోమవారం ఉదయం తన వ్యవసాయ బావి వద్ద పురుగుల మందు తాగాడు.గమనించిన కుటుంబ సభ్యులు చికిత్స కోసం హాస్పిటల్ కు తరలిస్తుండగా మధ్యలో చనిపోయాడు.మృతుడి భార్య వినోద ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ మహేందర్ తెలిపారు.నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‍రెడ్డి బాధిత కుటుంబాన్ని పరామర్శించి,తక్షణ సాయంగా రూ.50 వేలు అందజేశారు.
ఊరి అప్పుల కోసం పానం తీసుకున్నడు
నా కొడుకు ఊర్లె సర్పంచితనం చేస్తండు. రూ.15 లక్షలు అప్పు తెచ్చి పనులు చేసిండు.టైంకు బిల్లులు రాలేదు.కొద్దిరోజులుగా అప్పులోళ్లు ఎంటబడుతున్నరు.ఇంటి మీదికి వస్తున్నరు.ఇయ్యాల రేపు అంటూ ఇన్నిరోజులు చెప్పుకుంటూ వచ్చిండు.ఊరు కోసం చేసిన అప్పులు జేయబట్టి నా కొడుకు పానం తీసుకున్నడు.