ఆదిలాబాద్, వెలుగు : జిల్లా ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కల్పించాలనే ఉద్దేశంతో పల్లెలు, పట్టణాల్లో ప్రభుత్వం ప్రకృతి వనాలు ఏర్పాటు చేసింది. కానీ క్షేత్రస్థాయిలో పల్లె,పట్టణ ప్రకృతి వనాల పరిస్థితి అధ్వానంగా కనిపిస్తోంది. సరైన నిర్వహణ, అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో ప్రకృతి వనాలు ఏడారిని తలపిస్తున్నాయి. మొక్కలు దెబ్బతినకుండా కంచెలు, బోర్డులు ఏర్పాటు చేశారే తప్ప ఆ మొక్కలను బతికించాలంటే నీళ్లు మాత్రం పోయడం లేదు. కనీసం ఎండిపోయిన మొక్కల స్థానాల్లో వేరే మొక్కలు నాటడం లేదు. దీనికి తోడు అధికారులు ఈ వనాల వైపు చూడడమే లేదు.
లక్షలు పెట్టి.. కట్టి వదిలేశారు..
జిల్లాలో 468 గ్రామ పంచాయతీల పరిధిలో మొత్తం 912 పల్లె ప్రకృతి వనాలను ఏర్పాటు చేశారు. చాలా గ్రామల్లో ప్రకృతి వనాలకు స్థలం లేకపోవడంతో అటవీ ప్రాంతాల్లో ఏర్పాటు చేశారు. ఉపాధి హామీ నిధుల కింద ఒక్కో పల్లె ప్రకృతి వనానికి రూ.6లక్షల నిధులు మంజూరు చేశారు. లక్షలు పెట్టి ఏర్పాటు చేసినప్పటికీ నిర్వహణగాలికొదిలేయడంతో నిధులు వృథా అయ్యాయి. కొన్నిచోట్ల పల్లె ప్రకృతి వనాలకు చుట్టు కంచె ఏర్పాటు చేయక పోవడంతో పశువులు, గొర్లు, మేకల సంచారం పెరిగి పోతోంది. వేసవి సమీపించడంతో కొన్ని గ్రామల్లో వారాల తరబడి మొక్కలకు నీరందడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. గ్రామ పంచాయతీ పరిధిలో నర్సరీని ఏర్పాటు చేసుకుని అందులో పెంచిన మొక్కలనే పల్లె ప్రకృతి వనాల్లో నాటాల్సి ఉంటుంది. అయితే పల్లె వనాలు ఏర్పాటు చేసినప్పటికీ చాలా చోట్ల అసలు గ్రామ ప్రజలు మాత్రం వాటివైపు చూసిన దాఖలాలు కనిపించడం లేదు. పల్లె ప్రకృతి వనాలను ప్రతిష్ఠాత్మకంగా చేపట్టాలని గ్రామ పంచాయతీ కి ట్రాక్టర్, నీటి ట్యాంకర్ అందించినా నిరుపయోగంగానే కనిపిస్తున్నాయి. రోజుల తరబడి నీటిని సరఫరా చేయక పోవడంతో ఉన్న కాస్త మొక్కలు ఎండిపోతున్నాయి.
బల్దియాలోనే అదే పరిస్థితి..
ఆదిలాబాద్ మున్సిపాలిటీ పరిధిలో 33 పట్టణ ప్రకృతి వనాలు ఏర్పాటు చేశారు. దాదాపు ప్రతి ప్రకృతి వనానికి రూ. 2 లక్షల నుంచి రూ. 5 లక్షల వరకు ఖర్చు చేశారు. దాదాపు 25 వేల మొక్కలను నాటారు. అయితే ఏడాది నుంచి పట్టణ ప్రకృతి వనాలపై మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. సగం వనాల్లో 70 శాతం మొక్కలు ఎండిపోయాయి. కేవలం కర్రలు మాత్రమే దర్శనమిస్తున్నాయి. అసలే వేసవి కాలంలో వాటి నిర్వహణ కోసం నిత్యం నీరు పోయాల్సి ఉన్నప్పటికీ అధికారులు మాత్రం ఆ వైపు చర్యలు తీసుకోవడం లేదు. పట్టణంలో అన్ని వార్డుల్లో ప్రకృతి వనాలు ఏర్పాటు చేయాల్సి ఉన్నప్పటికీ స్థలాల కొరత వల్ల కొన్ని గవర్నమెంట్ ఆఫీసుల్లో ఈ ప్రకృతి వనాలు ఏర్పాటు చేశారు.
వారానికి మూడు సార్లు నీళ్లిస్తాం..
పల్లె ప్రకృతి వనాల సంరక్షణకు చర్యలు తీసుకుంటున్నాం. వేసవి కాలం దృష్టిలో ఉంచుకొని వారానికి మూడుసార్లు నీళ్లు అందించాలని పంచాయతీ కార్యదర్శులకు ఆదేశాలు జారీ చేశాం. ఇప్పటికే అన్ని గ్రామాలకు ట్యాంకర్లను అందుబాటులో ఉంచాం. వీటి ద్వారా సర్పంచ్ లు ప్రకృతి వనాలకు నీటి సరఫరా చేయాలి.
- శ్రీనివాస్, డీపీఓ ఆదిలాబాద్