- పాలమూరులో మళ్లీ ఆందోళనకు దిగిన పల్లి రైతులు
మహబూబ్‌నగర్, వెలుగు: మహబూబ్‌నగర్ మార్కెట్ యార్డులో పల్లి రైతులు మళ్లీ ఆందోళనకు దిగారు. ప్రస్తుతం చెల్లిస్తున్న ధరకు అదనంగా రూ.200 చెల్లిస్తామని వ్యాపారులు తమను నమ్మించి మోసం చేశారని బుధవారం మార్కెట్ యార్డు వద్ద నిరసనకు దిగారు.సీజన్ కావడంతో మహబూబ్‌నగర్ మార్కెట్‌కు పెద్ద మొత్తంలో పల్లి వస్తోంది. క్వింటాల్ పంటకు మార్కెట్ రేట్ ప్రకారం రూ.6,190 చెల్లించాల్సి ఉండగా.. వ్యాపారులు రూ.4,500 నుంచి రూ.5,500 మాత్రమే చెల్లిస్తున్నారు. దీంతో మంగళవారం సాయంత్రం రైతులు ధర్నాకు దిగారు.
రైల్వే ట్రాక్‌పై బైఠాయించే ప్రయత్నం చేయడంతో పోలీసులు అడ్డుకున్నారు. దిగివచ్చిన వ్యాపారులు ప్రస్తుతం చెల్లిస్తున్న ధరకు అదనంగా రూ.200 ఇస్తామని హామీ ఇచ్చారు. ఇందుకు ఒప్పుకున్న రైతుల పంటను కాంటా చేయడానికి ఒప్పుకున్నారు. అయితే బుధవారం ఉదయం వ్యాపారులు మాట మార్చారు. అదనంగా ఇస్తామన్న రూ.200 ఇవ్వమని స్పష్టం చేశారు. దీంతో ఆగ్రహించిన రైతులు మార్కెట్ యార్డును ముట్టడించారు. తమకు గిట్టుబాటు ధర చెల్లించాలని డిమాండ్ చేశారు. కొందరు తెచ్చిన పంటను వాపస్ తీసుకుపోయారు.
నేడు యార్డుకు సెలవు
మహబూబ్‌నగర్ మార్కెట్ యార్డుకు పెద్ద మొత్తంలో పల్లి వస్తోంది. ఇప్పటికే పల్లి రాశులతో యార్డు నిండిపోయింది. ఇంకా పంట వస్తుండటంతో నిల్వ చేసే స్థలం లేదు. దీంతో యార్డుకు గురువారం సెలవు ప్రకటిస్తున్నట్లు చైర్పర్సన్ బెక్కరి అనిత బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. తిరిగి శుక్రవారం యార్డు కొనసాగుతుందని చెప్పారు.