యాసంగికి సబ్సిడీపై పల్లి విత్తనాలు

యాసంగికి సబ్సిడీపై పల్లి విత్తనాలు
  • 20 వేల క్వింటాళ్లు రెడీ

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో కొన్నేండ్లుగా నిలిచిపోయిన విత్తన సబ్సిడీని ఈ యాసంగి నుంచి తిరిగి కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. సబ్సిడీతో వేరుశనిగ విత్తనాలు ఇవ్వనున్నట్టు విత్తనాభివృద్ధి సంస్థ రైతులకు శుభవార్త చెప్పింది. 20 వేల క్వింటాళ్ల వేరుశనిగ విత్తనాలు రెడీ చేసింది. క్వింటాల్ సీడ్స్​పై రూ.300 సబ్సిడీగా ఇవ్వాలని నిర్ణయించింది. ఈ యాసంగి సీజన్ లో 3 లక్షల ఎకరాలకు సరిపడా విత్తనాలు ఇవ్వనుంది. వచ్చే వానాకాలం సీజన్ కోసం మరో 15 లక్షల ఎకరాలకు అవసరమయ్యే విత్తనాలనను రెడీ చేయాలని సీడ్​ డెవలప్​మెంట్ కార్పొరేషన్ చైర్మన్ అన్వేష్ రెడ్డి అధికారులను ఆదేశించారు.

ఈ యాసంగి సీజన్ లో రైతులకు అవసరమైన వేరుశనిగ రకాలు జేజీ11, జానకి సీడ్ రకాలను 20వేల క్వింటాళ్లు అందుబాటులోకి తెచ్చారు. ఈ యాసంగికి వరి విత్తనాల్లో 50వేల క్వింటాళ్లు కేఎన్​ఎం1638, ఆర్ఎన్ఆర్​15048, జేజీఎల్ 27356, ఎంటీయూ 1010, కేఎన్​ఎం 118, జేజీఎల్ 24423 రకాలు వీలైనంత త్వరగా గ్రామాల్లో రైతులకు అందుబాటులోకి తెచ్చేందుకు విత్తనాభివృద్ధి సంస్థ సన్నాహాలు చేస్తున్నది. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో విత్తన సబ్సిడీ నిలిపేశారు.

కేంద్రం ఇచ్చే సబ్సిడీ పచ్చిరొట్ట విత్తనాలు మాత్రమే ఇచ్చేవారు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం మళ్లీ సబ్సిడీపై విత్తానాలు ఇవ్వడం ప్రారంభించింది.