
పల్నాడు జిల్లాలో దారుణం జరిగింది. అప్పు తీసుకొని తిరిగి చెల్లించకుండా మకాం మార్చిన వ్యక్తిని కిడ్నాప్ చేసి హత్య చేసిన ఘటన చోటు చేసుకుంది. దీనికి సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళ్తే..
సత్తెనపల్లికి చెందిన అంజిబాబు అనే వ్యక్తి వడ్డీ వ్యాపారం చేసేవాడు. అయితే అతని వ్యాపార నిమిత్తం తనకు తెలిసిన వ్యక్తి అయిన సుభాని వద్ద రూ. 12 లక్షలు అప్పు వడ్డీకి తీసుకున్నాడు. తరువాత ఇచ్చిన బాకీ చెల్లించకుండా.. అంజిబాబు హైదరాబాద్కు వచ్చి నివసిస్తున్నాడు. ఇలా ఉండగా నాలుగు రోజుల క్రితం అంజిబాబు పిడుగురాళ్లలోని తన స్నేహితుల ఇంటికి వచ్చాడు.
అంజిబాబు పిడుగురాళ్లలో ఉన్నాడని సమాచారం అందుకున్న సుభాని .. అతని స్నేహితులతో కలిసి.. పిడుగురాళ్ల వెళ్లాడు. ఆ తరువాత మంచి .. చెడు మాట్లాడుకుంటూ.. అంజిబాబుని కారులో ఎక్కించుకుని మాచవరం మండలం నాగేశ్వరపురం తండాకి తీసుకెళ్లారు. తన వద్ద తీసుకున్న రూ. 12 లక్షలు బాకీని వడ్డీతో సహా తీర్చాలని ఆంజిబాబుకి మద్యం తాగించి దాడి చేశారు. అనంతరం నోట్లో పురుగుల మందు పోశారు. ఆ సమయంలో అటువైపునకు స్థానికులు రావడంతో సుభాని ముఠా సభ్యులు పరారయ్యారు.
గుంటూరులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ అంజిబాబు మృతి చెందాడు. హత్యకు గురైన ఆంజిబాబు స్వగ్రామం సత్తెనపల్లి మండలం పాకాలపాడు గా గుర్తించారు. ఈ ఘటనపై గురజాల డీఎస్పీ జగదీష్ విచారణకు ఆదేశించారు.