ములుగు, వెంకటాపూర్ / నర్సంపేట/నల్లబెల్లి/ వెలుగు : అన్నిరంగాలను అభివృద్ధి చేసిన ఘనత బీజేపీ ప్రభుత్వానిదేనని సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్ బాబు అన్నారు. బీజేపీ విజయ సంకల్ప యాత్ర గురువారం ములుగు, భూపాలపల్లి, వరంగల్ జిల్లాలోని పలు మండల కేంద్రాల్లో బీజేపీ విజయసంకల్ప యాత్ర నిర్వహించారు. ములుగు జిల్లా అధ్యక్షుడు సిరికొండ బలరాం ఆధ్వర్యంలో ములుగులో కార్నర్ మీటింగ్ ఏర్పాటు చేశారు.
జాతీయ కార్యవర్గ సభ్యుడు గరికపాటి మోహన్ రావు, యాత్ర ఇన్చార్జి మార్తినేని ధర్మారావులతో కలిసి ఎమ్మెల్యే హరీశ్ బాబు మాట్లాడారు. సమ్మక్క, సారలమ్మల పేరుతో జాతీయ గిరిజన విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేసి రూ.900ల కోట్లు కేటాయించడం గర్వకారణమన్నారు. 500ల ఏళ్లుగా సాధ్యంకాని అయోధ్యలో బాలరాముని నిర్మాణం పూర్తయిందని, మహిళలకు 33శాతం చట్టసభల్లో రిజర్వేషన్ కల్పించిన ఘనత మోదీదేనని స్పష్టం చేశారు. కార్యక్రమంలో యాత్ర సహ ఇన్చార్జి చాడ శ్రీనివాస్ రెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు సిరికొండ బలరాం, అసెంబ్లీ ఇన్చార్జి పి.నరోత్తంరెడ్డి, రాష్ర్ట కార్యవర్గ సభ్యురాలు అజ్మీర కృష్ణ వేణి నాయక్, బీజేపీ ఎస్టీమోర్చ రాష్ర్ట ప్రధాన కార్యదర్శి కొత్త సురేందర్, బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి నగరపు రమేశ్
పాల్గొన్నారు.