
కుమ్రంభీం జిల్లా కాగజ్‌నగర్‌లో బీజేపీ నేత పాల్వాయి హరీష్ బాబును పోలీసులు మరోసారి అరెస్ట్ చేశారు. హరీష్ బాబును సిర్పూర్-టి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఇటీవల ఆయన పోడు భూముల సమస్యలపై ఆమరణ దీక్ష చేశారు. అంతకుముందు కొండపల్లిలో ధర్నా చేపట్టిన సమయంలో.. గ్రామస్తులకు, పోలీసులకు మధ్య ఘర్షణ జరిగింది. ఆ ఘర్షణలో మహిళా పోలీసులు గాయపడటంతో.. కేసు నమోదు చేసిన పోలీసులు.. ఆదివారం హరీష్ బాబును అరెస్ట్ చేశారు.
ప్రస్తుతం హరీష్ బాబు జ్వరంతో బాధపడుతున్నారు. దీంతో కాగజ్‌నగర్‌లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు. తెల్లవారుజామున హాస్పిటల్‌కు వెళ్లిన పోలీసులు.. వీల్ చైర్ పైనే హరీష్ బాబును స్టేషన్‌కు తరలించారు. ఇవాళ మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచి రిమాండ్‌కు తరలించే అవకాశం ఉంది. హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకోవటంపై స్థానిక బీజేపీ నేతలు మండిపడుతున్నారు.