మునుగోడును దత్తత తీసుకుంటానంటూ మంత్రి కేటీఆర్ డ్రామాలు ఆడుతున్నారని టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి విమర్శించారు. గతంలో దత్తత తీసుకున్న గ్రామాల్లో ఇప్పటి వరకు ఏం ఒరగబెట్టారని ప్రశ్నించారు. ఎన్నికలు పూర్తికాగానే టీఆర్ఎస్ నేతలు పత్తా లేకుండా పోతారని రేవంత్ రెడ్డి విమర్శించారు. టీఆర్ఎస్ నేతలు ఎన్ని హామీలిచ్చినా.. నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధి జరగదనే విషయాన్ని గుర్తుంచుకోవాలని నియోజకవర్గ ప్రజలకు సూచించారు.
ఆడబిడ్డను గెలిపించండి...
మునుగోడులో 12సార్లు ఎన్నికలు జరిగితే ఇప్పటి వరకు ఒక్క ఆడబిడ్డ గెలవలేదని.. అందుకే ఈసారి పాల్వాయి స్రవంతిని గెలిపించాలని రేవంత్ పిలుపునిచ్చారు. సీతక్క సమ్మక్క అయితే.. స్రవంతి సారలక్కగా మారుతుందని అన్నారు. ఈ సందర్భంగా నియోజకవర్గ అభివృద్ధికి పాల్వాయి గోవర్ధన్ రెడ్డి చివరి శ్వాస వరకు ప్రయత్నించారని రేవంత్ అన్నారు. మునుగోడులో గెలుపు కోసం ప్రత్యర్థి పార్టీల నాయకులు సీసాలు, డబ్బుల సంచులు తీసుకొచ్చారని విమర్శించారు. 8 ఏళ్లుగా టీఆర్ఎస్ అధికారంలో ఉన్నా మునుగోడును అభివృద్ధి చేయలేదని విమర్శించారు. 2014లో ఎమ్మెల్యేగా గెలిచిన కూసుకుంట్ల నియోజకవర్గ అభివృద్ధికి ఏం చేశారో చెప్పాలని నిలదీశారు. పాల్వాయి స్రవంతిని ఓడించేందుకు టీఆర్ఎస్, బీజేపీ నేతలు ప్రయత్నిస్తున్నారని.. నియోజకవర్గ ప్రజలు ఆలోచించి సరైన నిర్ణయం తీసుకోవాలని కోరారు.