మహిళా సెంటిమెంట్​తో పాల్వాయి స్రవంతి క్యాంపెయిన్​

  • ఇంటింటికి వెళ్లి ఓట్లు అడుగుతున్న కాంగ్రెస్​ అభ్యర్థి  
  • రాహుల్​ జోడో యాత్ర నేపథ్యంలో మారిన ఇన్​చార్జిలు

నల్గొండ, వెలుగు:  ఉప ఎన్నికలో కాంగ్రెస్​ మహిళా సెంటిమెంట్​ను ప్రయోగిస్తోంది. ప్రధాన పార్టీల అభ్యర్థులతో తల పడుతున్న  పాల్వాయి స్రవంతి ఒక్కరే మహిళ కాగా, ఈ అంశాన్ని ఎన్నికల్లో అనుకూలంగా మలుచుకోవాలని చూస్తున్నారు. నియోజకవర్గంలో దాదాపు సగం మంది మహిళా ఓటర్లున్నారు. వీరిని ఆకర్శించేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది. ఈ మేరకు అభ్యర్థి పాల్వాయి స్రవంతితో పాటు మహిళానేతలు గురువారం నుంచి రంగంలోకి దిగి మహిళా ఓటర్లకు బొట్టు పెట్టి, గాజులు పంచుతున్నారు. నియోజకవర్గంలో 2.26 లక్షల మంది ఓటర్లుండగా..1,15,174 మంది పురుషులు, 1,11,292 మంది  మహిళలున్నారు.  చౌటప్పుల్, చండూరు, మునుగోడు మండలాల్లో  మహిళా ఓటర్లు ఎక్కువగా   ఉన్నారు.   కాగా శుక్రవారం స్రవంతి నామినేషన్ వేయనుండగా ఈ ప్రోగ్రామ్​కు పెద్ద ఎత్తున మహిళలను, యూత్​ను  తరలిస్తున్నారు. దీని కోసం యూత్​ కాంగ్రెస్​ లీడర్లు మునుగోడులోనే మకాం వేసి మీటింగులు పెడుతున్నారు.  పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తన ప్రచారంలో  మహిళా సెంటిమెంట్ ను అనుకూలంగా మలుచుకునే ప్రయత్నం చేశారు.   స్రవంతిని గెలిపిస్తే అసెంబ్లీలో సీతక్కతో కలిసి సమ్మక్క, సారక్క లాగా కొట్లాడుతారని ప్రచారం చేశారు.  ఇంటికి ఆడపిల్ల ఎంత ముఖ్యమో.. నియోజకవర్గానికి స్రవంతి అంత అవసరమంటూ  సీతక్క కూడా మహిళల్లో సెంటిమెంట్​ను రగిలించే ప్రయత్నం చేశారు. 

సీనియర్లకు మినహాయింపు

తెలంగాణలో ఈనెల 23 నుంచి రాహుల్​గాంధీ భారత్​ జోడో యాత్ర మొదలుకానుంది. దీంతో మునుగోడు ప్రచార బాధ్యతల నుంచి కొందరు సీనియర్​ నాయకులకు మినహాయింపునిస్తున్నారు. మునుగోడు బాధ్యతలు చూస్తున్న నేతలు   జోడో యాత్రకు పోవద్దని మొదట భావించినా కొంతమంది సీనియర్లు యాత్రలో పాల్గొనవలసిన అవసరముందని భావిస్తున్నారు. దీంతో ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి,   సీఎల్పీ నేత  మల్లుభట్టి విక్రమార్క, మాజీ మంత్రి గీతారెడ్డి   యాత్రకు వెళ్లివచ్చేలా సడలింపు ఇచ్చారు.  మండల ఇన్​చార్జీల్లో కూడా  కొద్దిపాటి మార్పులు చేశారు. నాంపల్లి   ఇన్​చార్జీలుగా ఉన్న దామోదర రాజనర్సింహా, మల్లురవి, అంజన్ కుమార్ యాదవ్  సొంత జిల్లాల్లో రాహుల్​యాత్ర ఉన్నందున  వారిని తప్పించారు.  వారికి బదులు  నాంపల్లి మండల ఇన్​చార్జీలుగా   ఎమ్మెల్యే సీతక్క, చామల కిరణ్ కుమార్ రెడ్డి, కుందూరు  రఘువీ ర్ రెడ్డిలను నియమించారు.

మీ ఆడబిడ్డగా ఆదరించండి

సంస్థాన్ నారాయణపురం: ఎన్నికల్లో ఆడబిడ్డ గా మీ ముందుకు వచ్చానని, తనను ఆదరించి గెలిపించాలని కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతి ఓటర్లను కోరారు. గురువారం యాదాద్రి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలంలోని గుజ్జ, మల్లారెడ్డిగూడెం, సర్వే లు, రాజన్న బావి , అల్లం దేవి చెరువు, కోతులాపురం గ్రామాల్లో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. మహిళలకు బొట్టు పెడుతూ, గాజులు పంచుతూ ప్రచారం చేశారు. దివంగత పాల్వాయి గోవర్ధన్ రెడ్డి ఈ ప్రాంతానికి రోడ్లు, కరెంటు, ఇండ్లు , నీటిపారుదల సౌకర్యాలను కల్పించారన్నారు. ఏ గ్రామానికి వెళ్లిన గోవర్ధన్ రెడ్డి చేసిన అభివృద్ధి పనులే కనిపిస్తున్నాయని ప్రజలు చెబుతున్నారన్నారు.