- నిజామాబాద్ ఎంపీ అర్వింద్ పై కరపత్రాలు
- తాను గ్లాసెస్ పెట్టుకుంటే మీకేం నొప్పంటూ వీడియో రిలీజ్ చేసిన అర్వింద్
జగిత్యాల, వెలుగు: నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ కు మళ్లీ టికెట్ ఇవ్వొద్దంటూ హైకమాండ్‌కు ఫిర్యాదులు పెరుగుతున్నాయి. కొందరు వ్యక్తులు ఇటీవల ఢిల్లీకి పోస్ట్‌కార్డులు రాస్తే, తాజాగా సోమవారం మెట్ పల్లి, కోరుట్ల, ఇబ్రహీంపట్నం, మల్లాపూర్ మండలాల్లో అర్వింద్‌కు వ్యతిరేకంగా కరపత్రాలు పంపిణీ చేశారు. 'కండ్ల కు పెట్టిన అద్దాలు తియ్యడు.. ప్రజలను చూడడు.. కారు నుంచి దిగడు.. ప్రజల తో మాట్లాడడు' అంటూ కరపత్రంలో పేర్కొన్నారు. ఇలాంటి వ్యక్తికి ఎట్టిపరిస్థితుల్లోనూ బీజేపీ టికెట్ ఇవ్వొద్దని కృష్ణమాచారి, గంగాధర్, శ్రీనివాస్, రమేశ్ అనే బీజేపీ లీడర్ల పేర్లతో ఉన్న కరపత్రాలను కొందరు పంపిణీ చేశారు.
నేను గ్లాసెస్ పెట్టుకుంటే మీకేం నొప్పి
‘జీవన్ రెడ్డి అంకుల్.. నేను కూలింగ్ గ్లాసెస్ పెట్టుకుంటే మీ తమ్ముడికి ఏం నొప్పి..’ అంటూ నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ ప్రశ్నించారు. తనకు వ్యతిరేకంగా కరపత్రాలు పంచిన విషయాన్ని తెలుసుకున్న అర్వింద్ ఫేస్బుక్లో వీడియో రిలీజ్ చేశారు. ‘మా తండ్రి స్నేహితుడైన మీరు ఎప్పుడు కలిసినా మీ ఆశీర్వాదం తీసుకుంటాను.. అలాంటిది నాలో మీకు అహంకారం ఎక్కడ కనబడింది ? నేను మీకు కొడుకు లాంటి వాడిని.. పాలిటిక్స్ లో హుందాగా ఉండాలి.. రాజకీయాల్లో తలపడాలి కానీ ఇలా ప్రవర్తించకూడదు’ అంటూ హితవు పలికారు. ఇవే తనకు చివరి ఎన్నికలని జీవన్ రెడ్డి 2014 నుంచి చెబుతూనే ఉన్నారన్నారు. ‘వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ఇద్దరం తలపడే పరిస్థితి వచ్చినా నేను మీ ఆశీర్వాదం తీసుకుంటాను.. కానీ చిల్లర రాజకీయాలు మానుకోవాలని మీ కుటుంబ సభ్యులకు చెప్పండి’ అని కోరారు.