బీజేపీ, బీఆర్ఎస్​ను తరిమికొట్టండి..కమిటీ పేరుతో పాంఫ్లెట్లు

  •     ప్రతిపక్షాలను నిలదీయండి
  •     మావోయిస్టు జేఎండబ్ల్యూపీ కమిటీ పేరుతో పాంఫ్లెట్లు

కొత్తగూడ, వెలుగు : బీజేపీ, బీజేపీకి మద్దతు ఇస్తున్న బీఆర్ఎస్​ను తరమికొట్టాలని, ప్రతిపక్షాలను నిలదీయాలని మావోయిస్టు జేఏండబ్ల్యూపీ పేరుతో పాంఫ్లెట్లు వెలుగులోకి వచ్చాయి. మహబూబాబాద్​ జిల్లా కొత్తగూడ మండలంలో కొత్తగూడతో పాటు పొగుళ్లపల్లి, సాధిరెడ్డిపల్లి గ్రామాల్లో రోడ్డు పై శుక్రవారం రాత్రి ఈ పాంఫ్లెట్లను పారేసినట్లు తెలుస్తోంది. బూటకపు ఎన్నికలను బహిష్కరించాలని అందులో పేర్కొన్నారు. పౌర, ప్రజాస్వామిక హక్కులకు గ్యారంటీ ఇవ్వాలని అందులో సూచించారు. ఎన్ఐఏ సోదాలు ఆపివేయాలని

ఉపా చట్టాన్ని రద్దుచేసి జైల్లో పెట్టిన ఉద్యమకారులను బేషరతుగా విడుదల చేయాలని మావోయిస్టులు డిమాండ్  చేశారు. కేసీఆర్​ కుటుంబ పాలన, అధికార దుర్వినియోగం, అవినీతిని ఓడించాలని, ప్రభుత్వ రంగ సంస్థలను ప్రభుత్వాలు ప్రైవేటీకరణ చేయడాన్ని వ్యతిరేకించాలని ఓటర్లకు పిలుపునిచ్చారు. అసంఘటిత ,వలస కార్మికుల సమస్యలను పరిష్కరించాలన్నారు. కాగా , చాలా ఏండ్ల తర్వాత కొత్తగూడ ఏజెన్సీలో మావోల కరపత్రాలు వెలుగులోకి రావడంతో ప్రజలుఉలిక్కిపడ్డారు.