
న్యూఢిల్లీ: పన్ను చెల్లింపుదారుల గుర్తింపు, భద్రతను పెంపొందించడానికి పర్మినెంట్ అకౌంట్ నెంబర్ (PAN) విధానంలో కేంద్ర ప్రభుత్వం కీలక మార్పులు చేసిన సంగతి తెలిసిందే. పాన్ 2.0 ప్రాజెక్ట్ కింద ప్రస్తుతమున్న పాన్ కార్డుల స్థానంలో డిజిటల్ పాన్ కార్డులను జారీ చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. పాన్ 2.0 ప్రాజెక్ట్ కోసం సెంట్రల్ గవర్నమెంట్ రూ. 1,435 కోట్ల బడ్జెట్ కేటాయించింది. ఆధునిక సాంకేతిక పురోగతి ద్వారా పన్ను చెల్లింపుదారుల గుర్తింపును మెరుగుపర్చడంతో పాటు భద్రతాను పెంపొందించడానికి పాన్ 2.0లో భాగంగా జారీ చేసే కార్డులపై QR కోడ్ ముద్రించనున్నారు. అలాగే.. పాన్ 2.0 యొక్క ప్రధాన ఉద్దేశం ఏకీకృత డిజిటల్ ప్లాట్‌ఫామ్.
అంటే.. పాన్ మరియు టాన్ సేవలను ఒకే కేంద్రీకృత వ్యవస్థలో అనుసంధానించడం. పాన్ 2.0ను అమలు చేయడం ద్వారా సురక్షితంగా, సమర్థవంతమైన పన్ను వ్యవస్థను సృష్టించాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. అయితే.. ఈ పాన్ 2.0 కోసం ఆన్ లైన్లో దరఖాస్తు చేసుకోవడం ఎలా..? దీనిక అర్హతలు ఏంటి..? అన్న దానిపై సరైన స్పష్టత లేకపోవడంతో కొంత గందరగోళం ఏర్పడింది. మరీ పాన్ 2.0 కార్డ్ కోసం ఎలా అప్లై చేసుకోవాలి.. అర్హతలు ఏంటి.. కావాల్సిన డాక్యుమెంట్లు ఏంటన్న విషయం ఇప్పుడు స్పష్టంగా తెలుసుకుందాం.
పాన్ 2.0 దరఖాస్తు కోసం అవసరమైన డాక్యుమెంట్స్:
- పుట్టిన తేదీ రుజువు: జనన ధృవీకరణ పత్రం, పాఠశాల వదిలి వెళ్ళే ధృవీకరణ పత్రం లేదా పాస్‌పోర్ట్
- వ్యక్తిగత గుర్తింపు ధృవీకరణ: ఆధార్ కార్డ్, పాస్‌పోర్ట్, ఓటరు ID లేదా డ్రైవింగ్ లైసెన్స్
- చిరునామా నిర్ధారణ: బ్యాంక్ స్టేట్‌మెంట్‌లు, యుటిలిటీ బిల్లులు లేదా అద్దె ఒప్పందాలు.
పాన్ 2.0కి ఎలా దరఖాస్తు చేసుకోవాలి..?
ముందుగా పాన్ కార్డు అధికారిక వెబ్ సైట్లోకి వెళ్లండి. అక్కడ పాన్ 2.0 సర్వీస్‌పై క్లిక్ చేయండి. అనంతరం అక్కడి అడిగిన వ్యక్తిగత, బ్యాంక్ లావీదేవీలకు సంబంధించిన వివరాలను సమర్పించండి. గుర్తింపు, చిరునామా, పుట్టిన తేదీ డాక్యుమెంట్స్‌ను స్కాన్ చేసిన కాపీలను అప్ లోడ్ చేయాలి. వివరాలన్ని సమర్పించిన తర్వాత తిరిగి మళ్లీ ఒకసారి క్షుణ్ణంగా చెక్ చేసుకోని అప్లై చేయండి.
ALSO READ | వరంగల్లో దేశంలోనే తొలి గోల్డ్ లోన్ ATM.. పావు గంటలో చేతికి డబ్బులు !
పాన్ 2.0 అర్హతలు:
ఇప్పటికే ఉన్న పాన్ కార్డుదారులు తిరిగి దరఖాస్తు చేసుకోకుండానే పాన్ 2.0కి అప్‌గ్రేడ్ చేసుకోవచ్చు. అయితే.. వారు కొత్త QR- ఎనేబుల్డ్ వెర్షన్‌ను కోసం దరఖాస్తు చేసుకోవాలి. ఈ అప్‌గ్రేడ్ అన్ని పన్ను చెల్లింపుదారులకు ఉచితం. ఇక.. కొత్త దరఖాస్తుదారులు అయితే కావాల్సిన వివరాలు, డాక్యుమెంట్లు సమర్పించాలి.
పాన్ 2.0 ప్రత్యేకతలు:
* పాన్ 2.0 ప్రాజెక్టులో భాగంగా ఇకపై ఇష్యూ చేయబోయే పాన్ కార్డులు ఎంబెడెడ్ క్యూఆర్ కోడ్తో వస్తాయి. పాన్ కార్డు యూజర్లకు ఈ క్యూఆర్ కోడ్ మెరుగైన సేవలు పొందడానికి ఉపయోగపడుతుంది.
* ప్రభుత్వం అందించే పలు సేవల్లో ప్రస్తుతం డిజిటల్ ఫార్మాట్ ద్వారా అప్లై చేసేందుకు, అర్హత పొందేందుకు, లబ్ది పొందేందుకు ఈ పాన్ కార్డు 2.0 ఉపయోగపడుతుంది.
* ఎకో ఫ్రెండ్లీ, సెక్యూర్, ఫాస్ట్గా పాన్ సేవలను అందించడంపై ఈ పాన్ 2.0 ప్రాజెక్టు ఫోకస్ పెట్టింది.
పాన్ 2.0 కార్డు తీసుకుంటే లాభాలేంటి..?
* ట్యాక్స్పేయర్ రిజిస్ట్రేషన్ సేవలు త్వరితగతిన, యూజర్ ఫ్రెండ్లీగా పొందొచ్చు.
* ఎలాంటి అదనపు రుసుము చెల్లించాల్సిన అవసరం లేకుండా ప్రస్తుతం ఉన్న పాన్ కార్డు యూజర్లు కూడా పాన్ 2.0కి అప్గ్రేడ్ అవ్వొచ్చు.
* పాన్ 2.0 కార్డ్ పొందడం కోసం మళ్లీ కొత్త పాన్ కార్డ్ కోసం అప్లై చేయాల్సిన అవసరం లేదు.
* క్యూఆర్ కోడ్తో కూడిన పాన్ కార్డును యూజర్లు పొందొచ్చు.