
యాదగిరిగుట్ట, వెలుగు : యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయ దివ్యవిమాన స్వర్ణగోపుర మహాకుంభాభిషేక సంప్రోక్షణ పూజలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా శుక్రవారం యాగశాలలో వానమామలై పీఠాధిపతి రామానుజ జీయర్ స్వామి పర్యవేక్షణలో ఆలయ ప్రధానార్చకులు నల్లంతీగళ్ లక్ష్మీనరసింహాచార్యులు, కాండూరి వెంకటాచార్యుల ఆధ్వర్యంలో ఉదయం ‘పంచకుండాత్మక సుదర్శన యాగం, చతుస్థానార్చనలు, విమాన దిగ్దేవతా విశేష హోమాలు, పంచ వింశతి కలశ స్నపనం’ సాయంత్రం ‘ద్వారాది కుంభార్చన, ధాన్యాధివాసం’ నిర్వహించారు.
ఆలయ గోపురంపై ఏర్పాటు చేసే స్వర్ణకలశాలు, దివ్యవిమాన స్వర్ణగోపుర అలంకార పరికరాలకు పంచ వింశతి కలశ స్నపనం కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా జరిపారు. ఇందులో భాగంగా 25 కలాశాలలో పవిత్ర జలాలను నింపి మంత్రవేష్టితం చేసిన అనంతరం కలశాలు, విమాన గోపుర అలంకార పరికరాలకు అభిషేకం చేశారు. సాయంత్రం యాగశాలలో సామూహిక విష్ణుసహస్రనామ పారాయణం, చతుస్థానార్చనలు, మూలమంత్ర, మూర్తిమంత్ర హవనాలు, ద్వారాది కుంభార్చన నిర్వహించారు. అనంతరం స్వర్ణగోపుర అలంకార పరికరాలు, స్వర్ణకలశాలకు ఆగమ శాస్త్రం ప్రకారం ధాన్యాధివాసం జరిపారు. తర్వాత యాగశాలలో నిత్య పూర్ణాహుతి, నివేదన, తీర్థప్రసాదగోష్టి జరిపి తిరువీధి సేవ ద్వారా స్వామివారిని ప్రధానాలయంలోకి చేర్చారు.
నర్సన్న సన్నిధిలో పలు సేవలు రద్దు
యాదగిరిగుట్టలో ఈ నెల 23న జరిగే మహాకుంభ సంప్రోక్షణ సందర్భంగా ఆలయంలో పలు సేవల రద్దుతో పాటు దర్శన వేళలు మారాయి. 23న ఉదయం, సాయంత్రం బ్రేక్ దర్శనాలు, నిత్యకల్యాణాలు, సువర్ణ పుష్పార్చన, బ్రహ్మోత్సవం, సుదర్శన నారసింహ హోమం, వాహన పూజలను రద్దు చేస్తున్నట్లు ఈవో భాస్కర్‌రావు చెప్పారు. అలాగే ఉదయం 9 గంటల నుంచి కొండపైకి ప్రైవేట్ వాహనాలకు అనుమతి లేదని, 10 గంటల నుంచి అన్ని రకాల దర్శనాలు నిలిపివేయన్నట్లు తెలిపారు.
కొండ కింది నుంచి పైకి చేరుకునేందుకు ఆర్టీసీ ఆధ్వర్యంలో 25 ఫ్రీ బస్సులు నడపనున్నట్లు చెప్పారు. స్వర్ణతాపడానికి విరాళాలు ఇచ్చిన దాతలు తమ వాహనాలను పోలీసులు చూపించిన ప్లేస్‌లో పార్క్ చేసి దేవస్థానం ప్రత్యేకంగా కేటాయించిన వాహనాల్లో కొండపైకి చేరుకోవాలని సూచించారు. సంప్రోక్షణ పూజలను లైవ్‌లో తిలకించేందుకు కొండపైన, కిందా భారీ ఎల్ఈడీ స్క్రీన్లను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. 23న ఉదయం 11.54 గంటలకు వానమామలై పీఠాధిపతి రామానుజ జీయర్‌స్వామి పర్యవేక్షణలో దివ్యవిమాన స్వర్ణగోపురానికి మహాకుంభ సంప్రోక్షణ పూజలు నిర్వహించనున్నామని, ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్‌రెడ్డి హాజరుకానున్నారని చెప్పారు.