యాదగిరిగుట్టలో ఫిబ్రవరీ 19 నుంచి పంచకుండాత్మక మహాకుంభ సంప్రోక్షణ

యాదగిరిగుట్టలో ఫిబ్రవరీ 19 నుంచి పంచకుండాత్మక మహాకుంభ సంప్రోక్షణ
  • స్వర్ణతాపడం, సంప్రోక్షణపై ఎండోమెంట్‌‌‌‌ కమిషనర్ రివ్యూ
  • వచ్చే నెల 19 నుంచి 23 వరకు పంచకుండాత్మక నృసింహ యాగం
  • 23న దివ్యవిమాన గోపురానికి ‘మహాకుంభ సంప్రోక్షణ’

యాదగిరిగుట్ట, వెలుగు : యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ‘పంచకుండాత్మక నృసింహయాగ మహాకుంభ సంప్రోక్షణ’కు సన్నాహాలు మొదలయ్యాయి. ఇందులో భాగంగా గురువారం ఎండోమెంట్‌‌‌‌ కమిషనర్‌‌‌‌ ఎన్.శ్రీధర్‌‌‌‌ గుట్టకు వచ్చి కలెక్టర్ హనుమంతరావు, ఈవో భాస్కర్‌‌‌‌రావు, ఆలయ సిబ్బందితో రివ్యూ నిర్వహించారు. ఫిబ్రవరి 19 నుంచి 23 వరకు ‘పంచకుండాత్మక నృసింహ యాగం’, 23న ‘మహాకుంభ సంప్రోక్షణ’ నిర్వహించనున్న నేపథ్యంలో చేయాల్సిన ఏర్పాట్లపై చర్చించారు. 

సంప్రోక్షణ వేడుకలను అంగరంగవైభవంగా నిర్వహించాలని సూచించారు. 23న జరిగే మహాకుంభ సంప్రోక్షణకు సీఎం రేవంత్‌‌‌‌రెడ్డి, మంత్రులతో పాటు ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు హాజరుకానున్న నేపథ్యంలో సామాన్య భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. కాగా మహాకుంభ సంప్రోక్షణకు దేశంలోని అన్ని నదుల నుంచి నీటిని తీసుకురావాలని నిర్ణయించడంతో పలువురు అర్చకులు, వేదపండితులు నదీ జలాల సేకరణకు బయలుదేరారు. వీరి యాత్రను కమిషనర్‌‌‌‌ శ్రీధర్ జెండా ఊపి ప్రారంభించారు. 

దేశంలోని అన్ని నదుల నుంచి నీటిని సేకరించి ఫిబ్రవరి 19 నాటికి యాదగిరిగుట్టకు రానున్నారు. కార్యక్రమంలో అడిషనల్‌‌‌‌ కలెక్టర్‌‌‌‌ వీరారెడ్డి, అడిషనల్ డిప్యూటీ కమిషనర్‌‌‌‌ లక్ష్మీకాంతారావు, ఆర్డీవో కృష్ణారెడ్డి, చైర్మన్‌‌‌‌ నరసింహమూర్తి, డిప్యూటీ ఈవో దోర్బల భాస్కర్‌‌‌‌శర్మ, ప్రధానార్చకులు నల్లంతీగళ్‌‌‌‌ లక్ష్మీనరసింహాచార్యులు, కాండూరి వెంకటాచార్యులు పాల్గొన్నారు.