- శిథిలమై నేలకూలిన స్తంభాలు
- ఆలయాన్ని కాపాడుకునేందుకు నడుంబిగించిన గ్రామస్తులు
- ఐదేండ్లలోనే టెంపుల్ నిర్మాణం పూర్తి
- రేపటి నుంచి పునఃప్రతిష్ట కార్యక్రమాలు
హనుమకొండ, వెలుగు: జిల్లాలో కాకతీయులు నిర్మించిన ఆత్మకూరు మండల కేంద్రంలోని ఐదు శివ లింగాలు, ఐదు గోపురాలతో ఉన్న అరుదైన పంచకూటాలయం ఇన్నాళ్లూ నిర్లక్ష్యానికి గురైంది. దాదాపు వెయ్యేండ్ల చరిత్ర కలిగిన ఈ ఆలయాన్ని ప్రభుత్వాలు పట్టించుకోక పూర్తిగా శిథిలావస్థకు చేరగా, గుడిని రక్షించుకునేందుకు గ్రామస్తులంతా ఒక్కటయ్యారు. విరాళాలు పోగు చేసి, ఐదేండ్లలోనే ఆలయానికి ఊపిరి పోశారు. కాకతీయుల శైలిలోనే పనులు పూర్తి చేశారు. బుధవారం నుంచి జరిగే పున:ప్రతిష్ట కార్యక్రమానికి గుడిని ముస్తాబు చేస్తున్నారు.
రూ.కోట్లలో విరాళాలు..
ఓరుగల్లు కేంద్రంగా పాలన సాగించిన కాకతీయులు ప్రస్తుత హనుమకొండ జిల్లా ఆత్మకూరులో పార్వతీ సమేత మహదేవస్వామి పంచకూటాలయాన్ని నిర్మించారు. శిలలతో చేసిన పంచ లింగాలు, పార్వతీ అమ్మవారు, ఏకశిలా నంది తదితర విగ్రహాలతో ఈ గుడిని 11వ శతాబ్ధంలో నిర్మించినట్లు చరిత్రకారులు చెబుతున్నారు. గుడి కట్టి వెయ్యేండ్లు దాటిపోగా, సరైన ఆదరణ లేక మరుగునపడింది.
గ్రామంలోని పంచకూటాలయం శిథిలమై కూలే దశకు చేరడంతో ఊరోళ్లంతా ఏకమయ్యారు. గ్రామానికి చెందిన బుచ్చిరెడ్డి అధ్యక్షతన ఒక కమిటీ ఏర్పాటు చేసుకుని, గుడిని పునర్నిర్మించేందుకు సంకల్పించారు. అన్నివర్గాల ప్రజలు కులం, మతం, పార్టీలకు అతీతంగా ఆలయ నిర్మాణంలో భాగస్వాములు అయ్యారు. తలాకొంత విరాళం ఇవ్వడంతోపాటు ఇతర ప్రాంతాల్లో సెటిలైన ఆత్మకూరు గ్రామస్తులకు విషయం చెప్పారు. వారి నుంచి కూడా విరాళాలు రాబట్టి మొత్తంగా రూ.3 కోట్ల వరకు పోగు చేశారు.
ఐదేండ్లలోనే కంప్లీట్..
ములుగు జిల్లాకు చెందిన స్థపతి తుల రఘువీర్ ను సంప్రదించి, ఆయన ద్వారా తమిళనాడు నుంచి దాదాపు 12 మంది శిల్పులను తీసుకొచ్చి ఆలయ పునర్నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. కాకతీయుల మాదిరిగానే నిర్మించేందుకు పక్కా ప్లాన్ రెడీ చేశారు. 2019 డిసెంబర్ లో నిర్మాణ పనులు చేపట్టారు. పంచభూతాలు, శివుడి ఐదు రూపాలకు నిదర్శనంగా ఐదు లింగాలు, ఐదు గోపురాలు, నంది విగ్రహం, నవ గ్రహ మండపం, ద్వారపాలకుడు, ధ్వజస్తంభం ఏర్పాటు చేసి, ఐదేండ్లలోనే పనులన్నీ పూర్తి చేశారు. దాతలందరి పేర్లు శిలాఫలకాలపై రాయించేలా ఏర్పాట్లు చేస్తున్నారు.
రేపే పున:ప్రతిష్ట..
ఇప్పటికే పనులన్నీ పూర్తి కాగా, కార్తీక శుద్ధపంచమి బుధవారం పార్వతీ సమేతా మహాదేవస్వామి పంచకూటాలయ పున:ప్రతిష్ట మహోత్సవం నిర్వహించేందుకు గ్రామస్తులు ముహూర్తం ఫిక్స్ చేశారు. మూడు రోజుల పాటు ఆలయ పున:ప్రతిష్ట కార్యక్రమాలు కొనసాగనుండగా, అందుకు తగిన ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. కాకతీయుల కాలంనాటి ఈ పంచకూటాలయాన్ని టూరిస్ట్ స్పాట్ గా డెవలప్ చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు విజ్ఞప్తి చేస్తున్నారు.
గుడి కూలుతుంటే చూడలేకపోయాం..
కాకతీయుల నాటి ప్రాచీన ఆలయం కూలుతుంటే చూస్తూ ఉండలేకపోయాం. గ్రామస్తులమంతా చర్చించుకుని గుడిని మళ్లీ నిర్మించాలని నిర్ణయించుకున్నాం. ఇందుకు సహకరించేందుకు దాతలు కూడా ముందుకు వచ్చారు. గుడి నిర్మాణ పనులన్నీ పూర్తయి ప్రారంభోత్సవానికి సిద్ధం కావడం సంతోషంగా ఉంది. బుచ్చిరెడ్డి, పంచకూటాలయ కమిటీ చైర్మన్, ఆత్మకూరు
పూర్వరూపం తీసుకొచ్చాం
మొదట్లో ఈ గుడి మొత్తం శిథిలమై కూలిపోయే దశలో ఉండేది. కాకతీయులు కట్టిన రూపం చెదిరిపోకుండా స్తంభాలకు నెంబర్లు వేసి, పక్కా ప్లాన్ ప్రకారం పనులు స్టార్ట్ చేశాం. తమిళనాడుకు చెందిన శిల్పులతో స్తంభాలను తీర్చిదిద్దాం. అవసరమైన చోట కొత్త స్తంభాలు పెట్టి ఆలయానికి పూర్వ రూపం తీసుకొచ్చాం. తుల రఘువీర్, స్థపతి