పంచాయతీ ఎన్నికలకు సర్కారు కసరత్తు.. జనవరిలో నిర్వహించేందుకు ఏర్పాట్లు

  • జనవరిలో నిర్వహించేందుకు ఏర్పాట్లు
  • ఆ లోపే ఆసరా పెంపు, రైతు భరోసా అమలు
  • కులగణన ఆధారంగా రిజర్వేషన్లు
  • స్థానిక సంస్థల్లో పాగా యే లక్ష్యంగా యాక్షన్ ప్లాన్
  • సంక్రాంతి తర్వాతే పోలింగ్ ఉండే అవకాశం

హైదరాబాద్: పంచాయతీ ఎన్నికలను జనవరిలో నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఆ లోపు ఆరు గ్యారెంటీల్లో భాగంగా హామీ ఇచ్చిన ఆసరా పింఛన్లను రూ. 4 వేలకు పెంచాలని భావిస్తోంది. అదే విధంగా రైతు భరోసాను కర్షకుల ఖాతాల్లో జమ చేయనుందని తెలుస్తోంది.  ఈ నెల 6 నుంచి ప్రారంభమైన కులగణ ఈ నెల 30తో ముగియనుంది. ఆ రిపోర్ట్ ఆధారంగా స్థానిక ఎన్నికల రిజర్వేషన్లను ఖరారు చేసి స్థానిక ఎన్నికలను నిర్వహించనుంది.  గ్రామాల్లో భూ వివాదాలకు కారణమైన ధరణి నిర్వహణ బాధ్యతను కూడా ప్రభుత్వం కేంద్ర సర్కారు సంస్థ ఎన్ ఐసీకి అప్పగించింది.

త్వరలో కొత్త ఆర్వోఆర్ చట్టాన్ని అమలు చేయనుంది. ఈ మేరకు డిసెంబర్ 9 నుంచి ప్రారంభమయ్యే శీతాకాల సమావేశాల్లో ఈ బిల్లుకు అమోదం తెలుపనుంది.  స్థానిక సంస్థల్లో పాగా వేసి రాష్ట్రంలో బలమైన శక్తిగా ఎదగాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇటీవల వరంగల్ లో  జరిగిన సభలోనూ సీఎం రేవంత్  రెడ్డి ఇదే విషయాన్ని చెప్పారు. స్థానిక సంస్థల్లో పాగావేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతామని తెలిపారు. డిసెంబర్ చివరి వారంలో షెడ్యూల్ విడుదలవుతుందనే చర్చ సాగుతోంది.

అయితే జనవరి మొదటి వారంలో నోటిఫికేషన్ ఇచ్చి సంక్రాంతి తర్వాత ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోందని సమాచారం. మూడు దశల్లో పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తారని తెలుస్తోంది. ఉదయం 7 నుంచి మధ్యాహ్నం వరకు పోలింగ్ నిర్వహించి.. అదే రోజు రాత్రి కల్లా ఫలితాలను ప్రకటించే అవకాశం ఉంది.