సీనియర్లు వర్సెస్ జూనియర్లు.. కాంగ్రెస్‌లో టికెట్‌ కోసం పోటాపోటీ

  • సీనియర్లకు దీటుగా రేవంత్ రెడ్డి వర్గం అప్లికేషన్లు  
  • గతంలో సీనియర్లను ఓడించిన జూనియర్లు
  • ఈ ఎన్నికల్లోనైనా సహకరిస్తారో లేదోనని ఆందోళన

సూర్యాపేట, వెలుగు:  సూర్యాపేట జిల్లాలో కాంగ్రెస్‌ టికెట్ల పంచాయితీ సీనియర్లు వర్సెస్ జూనియర్లుగా మారింది.  ఒక్కో అసెంబ్లీ స్థానం నుంచి అరడజను మందికి పైగా హైకమాండ్‌కు అప్లికేషన్లు పెట్టుకున్నారు. అయితే సీనియర్లకు టికెట్‌ వస్తే జూనియర్లు సహకరిస్తారో.. లేదోనని ఆందోళన చెందుతున్నట్లు తెలుస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో సూర్యాపేట, తుంగతుర్తి నియోజకవర్గాల్లో సీనియర్లు, జూనియర్ల మధ్య విభేదాల కారణంగానే పార్టీ ఓడిపోయిందని  విమర్శలు ఉన్నాయి. వచ్చే ఎన్నికల్లోనూ ఆ ప్రమాదం తప్పేలా లేదు. ఇప్పటికైతే ఎవరికి వారుగా ప్రోగ్రామ్స్‌ చేసుకుంటున్నా.. టికెట్‌ అనౌన్స్ అయ్యాక పరిస్థితి ఎలా ఉంటుందోనని ఆసక్తి నెలకొంది. 

పేటలో ఇద్దరు రెడ్ల మధ్య పోటీ

సూర్యాపేట నియోజకవర్గంలో మాజీ మంత్రి, సీనియర్ నేత రాంరెడ్డి దామోదర్ రెడ్డి, రేవంత్ రెడ్డి ముఖ్య అనుచరుడు పటేల్ రమేశ్ రెడ్డి మధ్య టికెట్ కోసం పోటీ నడుస్తోంది.  2015లో రేవంత్ రెడ్డితో పాటు పటేల్ రమేశ్ రెడ్డి టీడీపీ నుంచి కాంగ్రెస్ లో చేరారు.  2018లో సూర్యాపేట టికెట్ ఆశించినా హైకమాండ్‌ దామోదర్ రెడ్డికే అవకాశం ఇచ్చింది. అయితే ఈ ఎన్నికల్లో దామోదర్‌‌రెడ్డి మంత్రి జగదీశ్‌ రెడ్డి చేతిలో కేవలం 5 వేల ఓట్ల మెజారిటీతో ఓడిపోయారు. 

దీంతో పటేల్ రమేశ్ రెడ్డి సహకరించకపోవడంతోనే ఓడిపోయానని భావించిన దామోదర్ రెడ్డి ఆయనను దూరంగా ఉంచుతున్నారు.  రమేశ్ రెడ్డి కూడా సొంతంగానే కార్యక్రమాలు నిర్వహిస్తూ.. టికెట్‌ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు.  దామోదర్‌‌ రెడ్డి మళ్లీ అవకాశం ఇవ్వాలని కోరడమే కాదు.. గతంలో తనకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారని రమేశ్‌ రెడ్డిపై హైకమాండ్‌కు ఫిర్యాదు చేశారు. మరోపక్క పార్లమెంట్ పరిధిలో రెండు టికెట్లు బీసీలకు ఇస్తామని కాంగ్రెస్ హైకమాండ్‌ ప్రకటించడంతో బీసీలు నేతలు కూడా అప్లికేషన్లు పెట్టుకున్నారు.  బీసీ నేతల్లో తండు శ్రీనివాస్ యాదవ్, యాలగందుల రాము, ముషం రవి టికెట్ ఆశిస్తున్నారు. 

తుంగతుర్తిలో హోరాహోరీ

తుంగతుర్తి నియోజకవర్గంలో కాంగ్రెస్‌కు గట్టి క్యాడర్ ఉన్నప్పటికీ పార్టీలో అంతర్గత పోరుతో కారణంగా గత రెండు పర్యాయాలు ఓటమి తప్పలేదు.  2018 ఎన్నికల్లో  సీనియర్ లీడర్ అద్దంకి దయాకర్, వడ్డేపల్లి రవి టికెట్ కోసం ప్రయత్నించగా హైకమాండ్‌ అద్దంకి దయాకర్ కు టికెట్ కేటాయించింది.  దీంతో వడ్డేపల్లి రవి రెబల్ అభ్యర్థిగా పోటీ చేయడంతో దయాకర్ సిట్టింగ్ ఎమ్మెల్యే గాదరి కిషోర్‌‌పై సల్ప ఓట్ల తేడాతో ఓడిపోయారు. దీంతో పార్టీ వడ్డేపల్లి రవిని ఆరేండ్ల పాటు సస్పెండ్ చేసింది.  తిరిగి పార్టీలోకి వచ్చేందుకు ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ద్వారా ప్రయత్నాలు చేయగా మాజీ మంత్రి దామోదర్ రెడ్డితో పాటు అద్దంకి దయాకర్ వ్యతిరేకించారు. 

ఇటీవల దామోదర్ రెడ్డి సహకారంతో రవిపై ఉన్న సస్పెషన్ ఎత్తివేయగా.. టికెట్ కోసం ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తున్నారు.  ఈ సారి తుంగతుర్తి నియోజకవర్గంలో 23మంది అప్లికేషన్‌ పెట్టుకోగా.. అద్దంకి దయాకర్, వడ్డేపల్లి రవి, అన్నెపర్తి జ్ణాన సుందర్, నాగరిగరి ప్రీతం, గుడిపాటి నర్సయ్య మధ్య తీవ్రమైన పోటీ నెలకొంది.  వీరిలో నల్లగొండ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి,  మాజీ మంత్రి దామోదర్ రెడ్డి  ఆశీసులు ఉన్న వారికే టికెట్ వస్తుందని ప్రచారం జరుగుతోంది. కానీ, టికెట్‌ వచ్చాక ఐక్యంగా పనిచేస్తారా..? గత ఎన్నికల మాదిరిగా వ్యతిరేకంగా పనిచేస్తారోననే భయం మాత్రం సీనియర్లలో మెదులుతోంది.