పల్లె పోరుకు అంతా సిద్ధం.. నోటిఫికేషన్ ఎప్పుడొచ్చినా పోటీకి రెడీ అంటున్న ఆశావహులు

  • పోలింగ్ బూత్​ల నుంచి నోడల్ ఆఫీసర్ల వరకు నియామకం
  • రిజర్వేషన్ల కోసం ఎదురుచూపులు

సంగారెడ్డి/మెదక్/సిద్దిపేట, వెలుగు: ఉమ్మడి మెదక్ జిల్లాలో పంచాయతీ పోరుకు అధికార యంత్రాంగం అంతా సిద్ధం చేసింది. ప్రస్తుతం సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట జిల్లాలో పల్లె పోరు సందడి కనిపిస్తోంది. రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు పంచాయతీ ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగేందుకు జిల్లాకు 12 మంది చొప్పున మూడు జిల్లాలకు 36 మంది నోడల్ అధికారుల నియామకాలు పూర్తయ్యాయి. ఫిబ్రవరి రెండో వారంలోగా రిజర్వేషన్లపై ప్రకటన వెలువడుతుందన్న ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో నోటిఫికేషన్ ఎప్పుడొచ్చినా ఎన్నికలకు సిద్ధంగా ఉన్నామంటూ ఆశావహులు ఓటర్లను ఆకర్షించే పనిలో బిజీగా ఉన్నారు.

ఇప్పటి నుంచే అక్కడక్కడ తాయిలాలు పంపిణీ చేస్తున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మొత్తం 1,648 గ్రామ పంచాయతీలు, 14,340 వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి. మొత్తం ఓటర్లు 22,78,129 మంది ఉన్నారు. ఇందులో పురుషులు 11,50,987 మంది, మహిళలు 12,15,813 మంది ఉన్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మహిళా ఓటర్లు ఎక్కువగా ఉన్నారు. బ్యాలెట్ పద్దతిలో ఎన్నికలు జరుగనుండగా మూడు విడతల్లో ఎన్నికల నిర్వహణను పూర్తి చేయనున్నారు. 

సంగారెడ్డి జిల్లాలో..

సంగారెడ్డి జిల్లాలో 4 రెవెన్యూ డివిజన్లు, 26 మండలాల పరిధిలో మొత్తం 658 గ్రామ పంచాయతీలు, 5,718 వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి. మొత్తం 8,51,420 మంది ఓటర్లు ఉండగా, ఇందులో పురుషులు 4,23,62 మంది, మహిళ ఓటర్లు 4,27,739 మంది, ఇతరులు 52 మంది ఓటర్లు ఉన్నారు. వీరందరికీ మొత్తం 5,732 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయనున్నారు. ఇదిలా ఉంటే రిజర్వేషన్ల ప్రక్రియ, నోటిఫికేషన్ విడుదల కాకముందే కొందరు ఆశావాహులు రంగం సిద్ధం చేసుకుంటున్నారు.

 సంక్రాంతి సందర్భంగా కొన్ని గ్రామాల్లో ఓటర్లను ఆకర్షించేందుకు ఇంటింటికి మటన్, పతంగులు పంపిణీ చేశారు. గ్రామాల్లో జరిగే చిన్న చిన్న ఫంక్షన్లకు అటెండ్ అవుతూ దగ్గరుండి పనులు చక్కబెడుతున్నారు. గ్రామాల్లో ఎవరైనా చనిపోతే అంత్యక్రియలకు హాజరై తోచినంత సాయం చేస్తున్నారు. యువతను ఆకర్షించేందుకు స్పోర్ట్స్ కిట్స్ సరఫరా చేస్తూ ట్రోఫీలు కండక్ట్ చేస్తున్రు. పార్టీలకనుగుణంగా మద్దతు ఇవ్వాలని ముఖ్య నేతల ఇళ్ల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు.

మెదక్ జిల్లాలో..

మెదక్ జిల్లాలోని 21 మండలాల పరిధిలో మొత్తం 493 గ్రామ పంచాయతీలు ఉండగా, వాటి పరిధిలో 4,232 వార్డులు ఉన్నాయి. మొత్తం ఓటర్లు 5,19,009 మంది ఉండగా వారిలో  పురుషులు 2,49,925 మంది, మహిళలు 2,89,074 మంది, ట్రాన్స్ జెండర్లు 9 మంది ఉన్నారు.  గ్రామ పంచాయతీ ఎన్నికల కోసం జిల్లా వ్యాప్తంగా 4,210 పోలింగ్ కేంద్రాలను గుర్తించారు. బ్యాలెట్ పద్దతిలో ఎన్నికలు జరుగనుండగా మూడు విడతల్లో ఎన్నికల నిర్వహణకుగాను 2,430 బ్యాలెట్ బాక్సులను అందుబాటులో ఉంచారు. బ్యాలెట్ పేపర్ల ప్రింటింగ్ ప్రక్రియ మొదలు పెట్టారు. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు జీపీ ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగేందుకు వీలుగా 12 మంది జిల్లా అధికారులను నోడల్ అధికారులుగా నియమించారు.

ALSO READ : అర్హులందరికీ రేషన్ కార్డులు : మంత్రులు పొంగులేటి, తుమ్మల, ఉత్తమ్

సిద్దిపేట జిల్లాలో.. 

జిల్లాలోని 507 గ్రామ పంచాయతీల్లోని 4390 వార్డుల్లో ఎన్నికల నిర్వహణకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే జిల్లాలోని 26 మండలాల పరిధిలోని గ్రామ పంచాయతీల్లోని వార్డుల వారీగా ఓటర్ల లిస్టును విడుదల చేశారు. మల్లన్న సాగర్ రిజర్వాయర్ నిర్మాణంతో ముంపునకు గురైన 8, సిద్దిపేట రూరల్ మండలంలోని 15 గ్రామాలకు చెందిన ఓటరు జాబితాలను ఇప్పటికీ విడుదల చేయలేదు. 

మల్లన్న సాగర్ ముంపు గ్రామాలను గజ్వేల్ మున్సిపాలిటీలో విలీనం చేయడం కోసం ఓటరు జాబితాలను నిలిపి వేయగా, సిద్దిపేట రూరల్ మండల గ్రామ పంచాయతీల ఓట్లు జాబితాల వెల్లడిలో సాంకేతిక సమస్య ఏర్పడడంతో పెండింగ్ లో పెట్టారు. సిద్దిపేట రూరల్ మండలం బదులుగా నారాయణ రావు పేట పేరును ఆన్ లైన్ లో చూపిస్తుండడంతో 15 గ్రామ పంచాయతీల జాబితా కనిపించడంలేదు. సిద్దిపేట జిల్లాలో ప్రస్తుతం 9.77 లక్షల ఓటర్లుండగా వీరిలో 4.78 మంది పురుషులు, 4.99 లక్షల మంది మహిళా ఓటర్లు ఉన్నారు.