సంగారెడ్డి, వెలుగు : సంగారెడ్డి జిల్లాలో గ్రామకంఠం భూములను గుర్తించేందుకు సమగ్ర సర్వేకు జిల్లా పంచాయతీ శాఖ రెడీ అవుతోంది. ఇప్పటికే షురూ కావాల్సిన ఈ సర్వే ఒకసారి వాయిదా పడింది. సమగ్ర సర్వేపై ప్రభుత్వం పలు మార్పులు చేస్తూ ఇవ్వనున్న గైడ్ లైన్స్ కోసం ఆఫీసర్లు వెయిట్ చేస్తున్నట్టు తెలిసింది. జిల్లాలో 647 గ్రామ పంచాయతీల్లో గ్రామకంఠం భూముల విస్తీర్ణం 8,325 ఎకరాలు ఉన్నట్లు ఇదివరకే అధికారులు గుర్తించారు. అందులో నివాస గృహాలు ఇతరత్రా నిర్మాణాలు 6,197 ఎకరాలు, రోడ్లు వాటర్ ట్యాంకుల నిర్మాణాలు 1,058 ఎకరాల్లో ఉన్నాయి. కమ్యూనిటీ హాళ్లు, స్కూల్ బిల్డింగ్స్ 697 ఎకరాలు, క్రీడా మైదానాలు 274 ఎకరాలు ఉండగా, 99 ఎకరాల్లో ఖాళీ స్థలాలు ఉన్నట్టు జిల్లా పంచాయతీ శాఖ ప్రకటించింది.
వీటిని రెవెన్యూ రికార్డులు, గ్రామాల సేత్వార్ల ఆధారంగా గుర్తించారు. ఈ నేపథ్యంలో ఏ ఏ గ్రామాల్లో ఎన్ని గ్రామకంఠం భూములు ఉన్నాయి? వాటిలో ఎంతమంది కబ్జాల్లో ఉన్నారు? ప్రభుత్వ ఆధీనంలో ఎన్ని ఉన్నాయి? అనే దానిపై క్లారిటీ కోసం సమగ్ర సర్వే కొనసాగనున్నది. ఖాళీ స్థలాలు, పశువుల కొట్టాలు, ఇంటి పెరేడ్లు ఇలా అనేక రకాల భూములు గ్రామాలలో లెక్కల్లో లేనట్టు అధికారులు చెబుతున్నారు. అయితే సమగ్ర సర్వే తర్వాత వాటికి యాజమాన్య హక్కులు కల్పిస్తారా? లేదా? అనే విషయమై పలువురు సందేహం వ్యక్తం చేస్తున్నారు.
నందిగామతో షురూ...
పటాన్ చెరువు మండలం నందిగామ గ్రామం నుంచి ముందుగా సమగ్ర సర్వే స్టార్ట్ చేయాలని జిల్లా యంత్రాంగం నిర్ణయించింది. ఈ మేరకు సీఎంవో సెక్రటరీ స్మితా సబర్వాల్ ఈనెల 16న నందిగామ గ్రామాన్ని సందర్శించనున్నట్టు పంచాయతీ అధికారులు ఒకరోజు ముందు అఫీషియల్ గా ప్రకటించారు. కానీ అనివార్య కారణాలతో ఆమె ప్రోగ్రామ్ క్యాన్సిల్ కావడంతో మళ్లీ ఎప్పుడు వచ్చేది ప్రకటించకపోగా, ఇప్పటివరకు సర్వే స్టార్ట్ చేయలేదు. క్షేత్రస్థాయిలో సర్వే చేస్తే కలిగే ఇబ్బందులను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం కొత్త గైడ్ లైన్స్ తయారు చేస్తుందన్న విషయాన్ని అధికార పార్టీ నేతలు కొందరు చెబుతున్నారు. ఏదేమైనా గ్రామకంఠం భూముల సమగ్ర సర్వే నిర్వహణపై ప్రజల్లో ఆందోళన నెలకొన్నది.