చెత్త సమస్యకు చెక్‌‌ పెట్టేలా..ఈజీఎస్‌‌ కింద గ్రామాల్లో సేంద్రియ ఎరువు తయారీపై దృష్టి

చెత్త సమస్యకు చెక్‌‌ పెట్టేలా..ఈజీఎస్‌‌ కింద గ్రామాల్లో సేంద్రియ ఎరువు తయారీపై దృష్టి
  • ఇప్పటికే గ్రామాల్లో నిర్మించిన సెగ్రిగేషన్‌‌ షెడ్లను వినియోగించుకోవాలని ప్లాన్‌‌
  • డీఆర్డీవోలు, డీపీవోలు, గ్రామీణాభివృద్ధి శాఖ ఆఫీసర్లతో వారం రోజుల్లో మీటింగ్‌‌
  • సేంద్రియ ఎరువులను రైతులకు  అమ్మేలా ప్రయత్నాలు

హైదరాబాద్, వెలుగు : గ్రామాల్లో పాలకవర్గాలు లేకపోవడంతో అస్తవ్యస్తంగా మారిన చెత్త సేకరణ ప్రక్రియను గాడిలో పెట్టడంతో పాటు గ్రామాలకు అదనపు ఆదాయం సమకూరేలా పంచాయతీరాజ్‌‌ శాఖ ఆఫీసర్లు చర్యలు చేపట్టారు. గ్రామాల్లో ఇంటింటా సేకరించిన చెత్తను వృథాగా కాల్చేస్తున్నట్లు గుర్తించిన ఆఫీసర్లు... ఆ చెత్తతో ఉపాధి హామీ కింద సేంద్రియ ఎరువు తయారు చేయాలని భావిస్తున్నారు. ఇందుకోసం గ్రామాల్లో గతంలో నిర్మించిన డంప్‌‌యార్డులు, సెగ్రిగేషన్‌‌ షెడ్లను వినియోగించుకోవాలని ప్లాన్‌‌ చేస్తున్నారు. గ్రామాల్లో కంపోస్ట్‌‌ ఎరువు తయారు చేసేలా, దీనిపై మండల స్థాయి ఆఫీసర్లు ఫోకస్‌‌ చేసేలా కార్యాచరణ రూపొందిస్తున్నారు. 

చెత్త సేకరణ ప్రక్రియపై ఆరా..

గ్రామాల్లో చెత్త సేకరణ ప్రక్రియపై పంచాయతీ రాజ్‌‌శాఖ ఆఫీసర్లు ఆరా తీస్తున్నారు. చెత్త సేకరణ ఎలా సాగుతోంది ? తడి, పొడి చెత్త వేర్వేరుగా సేకరిస్తున్నారా ? అసలు చెత్త సేకరణ బండ్లు గ్రామాల్లో తిరుగుతున్నాయా ? సేకరించిన చెత్తను ఏం చేస్తున్నారు ? డంప్‌‌ యార్డుల నిర్వహణ ఎలా ఉంది ? చెత్తను సెగ్రిగేషన్‌‌ షెడ్లకు తరలిస్తున్నారా ? లేక తగులబెడుతున్నారా ? అన్న వివరాలు తెలుసుకుంటున్నారు. దీంతో పాటు ఎన్ని గ్రామ పంచాయతీల్లో డంప్‌‌ యార్డులు, సెగ్రిగేషన్‌‌ షెడ్లు ఉన్నాయన్న వివరాలు తెప్పించుకుంటున్నారు.

కాగా కొన్ని గ్రామాల్లో గతంలో నిర్మించిన సెగ్రిగేషన్‌‌ షెడ్లలో కొన్ని రోజులు సేంద్రీయ ఎరువులను తయారు చేశారు. కానీ క్రమక్రమంగా ఈ ప్రక్రియ అటకెక్కింది. ప్రస్తుతం ఈజీఎస్‌‌ పథకంలో భాగంగా ఉపాధి కూలీలను భాగస్వాములను చేసి చెత్త సేకరణ, సేంద్రియ ఎరువు తయారు చేయాలని ప్రయత్నాలు చేస్తున్నారు.

వారం రోజుల్లో  ప్రత్యేక సమావేశం

రాష్ట్రంలో మొత్తం 12,769 గ్రామ పంచాయతీల ఉన్నాయి. పల్లె ప్రగతిలో భాగంగా గత ప్రభుత్వం గ్రామాల్లో డంప్‌‌ యార్డులు, సెగ్రిగేషన్‌‌ షెడ్లు నిర్మించింది. ఒక్కో గ్రామ పంచాయతీ కోసం రూ.2.50 లక్షలు ఖర్చు చేశారు. మొదట్లో అన్ని గ్రామాల్లో సేంద్రియ ఎరువులను తయారు చేసి విక్రయించారు. కొన్ని రోజుల తర్వాత వాటిని పట్టించుకోకపోవడం.. నిర్వహణ భారంగా మారడంతో ఎరువు తయారీని నిలిపివేశారు. దీంతో అవన్నీ నిరుపయోగంగా మారాయి.

అంతేకాకుండా తడి, పొడి చెత్తను వేరు చేయకుండానే గ్రామ శివార్లలోకి తీసుకెళ్లి తగులబెడుతున్నారు. దీంతో గ్రామాల్లో నిర్మించిన సెగ్రిగేషన్‌‌ షెడ్లను తిరిగి వినియోగంలోకి తీసుకురావాలని భావించిన రాష్ట్ర ప్రభుత్వం తడి, పొడి చెత్తను వేరు చేసి సేంద్రియ ఎరువు తయారీపై దృష్టి సారించింది. ఈ మేరకు డీపీవోలు, డీఆర్డీవోలు, గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులతో వారం రోజుల్లో మీటింగ్‌‌ నిర్వహించేందుకు పీఆర్‌‌, ఆర్డీ డైరెక్టర్‌‌ సృజన చర్యలు చేపట్టారు.

ఇందులో గ్రామాల్లో చెత్త సేకరణ, సేంద్రియ ఎరువు తయారీకి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించనున్నట్లు సమాచారం. సేంద్రియ ఎరువు తయారీతో పంచాయతీలకు అదనపు ఆదాయం సమకూర్చేలా ప్లాన్‌‌ చేస్తున్నారు. ఎస్‌‌బీఎం భాగస్వామ్యంతో ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. చెత్త సేకరణ, సేంద్రియ ఎరువు తయారీ ప్రక్రియను జిల్లా స్థాయిలో డీపీఓలు, మండల స్థాయిలో ఎంపీడీవోలు, గ్రామాల్లో కార్యదర్శులు పర్యవేక్షించేలా చర్యలు చేపట్టారు.

పంచాయతీలకు అదనపు ఆదాయం వచ్చేలా...

వర్మీ కంపోస్ట్ విధానంలో చెత్తను సేంద్రియ ఎరువుగా మారుస్తారు. ఇందుకు 40 నుంచి 60 రోజులు పట్టే అవకాశం ఉంది. అవసరమైతే ఈజీఎస్‌‌ నిధులతో వానపాములు కొనుగోలు చేసి డంప్‌‌ యార్డుల్లో వేసే ప్లాన్‌‌ చేస్తున్నారు. ఇందుకోసం ఒక్కో పంచాయతీకి రూ.4 వేల నుంచి రూ.5 వేలు ఖర్చు చేయనున్నారు. వెయ్యి కిలోల చెత్త నుంచి 200 నుంచి 400 కిలోల సేంద్రియ ఎరువు తయారవుతుందని అంచనా వేస్తున్నారు. దీనిని రైతులకు విక్రయించడం ద్వారా పంచాయతీలకు ఆదాయం సమకూర్చేందుకు ప్లాన్‌‌ చేస్తున్నారు.

చెత్తను కాల్చివేయకుండా చర్యలు

గ్రామాల్లో ఇంటింటా చెత్త సేకరణ ప్రక్రియ పకడ్బందీగా చేపడుతున్నాం. తడి, పొడి చెత్తను వేరుచేసేలా ప్రత్యేక కార్యాచరణ రూపొందించాం. పల్లెల్లో సేకరించిన చెత్తతో సేంద్రియ ఎరువు తయారు చేసి వ్యవసాయ అవసరాలకు వినియోగించాలన్నది లక్ష్యం. అయితే, పల్లెల్లో సెగ్రిగేషన్‌‌ షెడ్లు, డంపింగ్‌‌ యార్డులు ఉన్నా నిరుపయోగంగా మారుతున్నాయి. వీటిని వినియోగంలోకి తీసుకొచ్చేలా చర్యలు తీసుకుంటున్నాం. వీటి రిపేర్లు, అవసరమైనచోట డంప్‌‌ యార్డులు, సెగ్రిగేషన్‌‌ షెడ్ల ఏర్పాటు కోసం ప్రయత్నాలు చేస్తున్నాం.

క్షేత్రస్థాయిలో చెత్త సేకరణపై కార్యదర్శలు, ఎంపీడీవో, డీపీవోలు దృష్టి సారించాలి. పారిశుధ్య పనులను పకడ్బందీగా చేపట్టాలి. చాలా గ్రామాల్లో చెత్తను కాల్చి వేస్తున్నారని తెలిసింది. అలా కాకుండా చెత్తను రీసైకిల్‌‌ చేసి సేంద్రీయ ఎరువు తయారు చేస్తాం. – పీఆర్, ఆర్డీ డైరెక్టర్ సృజన