రాష్ట్రానికి రూపాయి కూడా ఇవ్వట్లేదు.. మంత్రి సీతక్క కామెంట్స్

రాష్ట్రానికి రూపాయి కూడా ఇవ్వట్లేదు.. మంత్రి సీతక్క కామెంట్స్
  • రోడ్లు, బ్రిడ్జిల నిర్మాణానికి ఫారెస్ట్ పర్మిషన్లపై కేంద్రం నిర్లక్ష్యం 
  • బీజేపీ రాష్ట్రాల్లో కులగణన ఎందుకు చేయట్లేదు ?
  • ఆసిఫాబాద్ జిల్లాలో మంత్రి ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం

కాగజ్ నగర్, వెలుగు: దేశంలోని అన్ని వర్గాల, మతాల గొంతుక రాహుల్ గాంధీ అని రాష్ట్ర పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క పేర్కొన్నారు. కేవలం మత రాజకీయాలు చేయడం బీజేపీ నైజమని విమర్శించారు. ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ టౌన్లో ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్ లో గురువారం ఎమ్మెల్సీ ఎన్నికల  సమావేశంలో ఆమె పాల్గొని మాట్లాడారు. పదేండ్లలో రాష్ట్రంలో బీఆర్ఎస్, కేంద్రంలో బీజేపీ  ఏం చేసిందనేది ప్రజలకు తెలుసన్నారు.

రాష్ట్రాభివృద్ధికి కేంద్రం రూపాయి కూడా ఇవ్వడం లేదన్నారు. స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు వెళ్లి కేంద్రాన్ని కలుస్తున్నా ఫలితం లేకుండా పోయిందన్నారు. రాష్ట్రంలో రోడ్లు, బ్రిడ్జిల నిర్మాణానికి ఫారెస్ట్ పర్మిషన్లు ఇవ్వకుండా కేంద్రం నిర్లక్ష్యం చేస్తుందని, అదే మహారాష్ట్ర, చత్తీస్ గడ్ లో మాత్రం ఇస్తుందని, ఇదేం ద్వంద వైఖరో చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు.

మిషన్ భగీరథ నిర్వహణకు రూ. 5 వేల కోట్లు ఇవ్వాలని రాజస్థాన్ వెళ్లి ప్రధానిని అడిగినా స్పందన లేదన్నారు. స్వాంతంత్ర్యం వచ్చిన తర్వాత కులగణన  చేసిన ఘనత తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వానిదేనన్నారు. మొన్నటిదాకా కులగణన తప్పని అన్న బీజేపీ ఇప్పుడు మాట మార్చిందని విమర్శించారు.  దేశంలో ఎన్నో కులాలు ఉన్నాయని, కులగణన సాధ్యం కాదని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. రాష్ట్రాల్లోని కులాల లెక్క తేల్చడంలో ఇబ్బంది ఏంటని ఆమె ప్రశ్నించారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కాంగ్రెస్ వూట్కూరి నరేందర్ రెడ్డికి తొలి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరారు.

జిల్లా ఎన్నికల ఇన్ చార్జి , కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేశ్, ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జూ పటేల్, అదిలాబాద్ ఎమ్మెల్సీ దండే విఠల్, ఎమ్మెల్సీ ఎన్నికల సమన్వయకర్త మాజీ కేంద్ర మంత్రి వేణుగోపాల చారి, పార్టీ జిల్లా అధ్యక్షుడు విశ్వప్రసాద్, జీసీసీ చైర్మన్ కొట్నక్ తిరుపతి పాల్గొన్నారు.