- మహిళల సంక్షేమం కోసం విభిన్న ఆలోచనలతో పథకాలు: మంత్రి సీతక్క
- డిసెంబర్ 9న శిల్పారామంలో మహిళా సంఘాల నైట్ బజార్ ఓపెన్
- ఐటీ ఉద్యోగుల కోసం రాత్రి 2 గంటల వరకు ఓపెన్ చేస్తామని వెల్లడి
హైదరాబాద్, వెలుగు: మహిళల సంక్షేమం కోసం సీఎం రేవంత్ రెడ్డి విభిన్న ఆలోచనలతో పథకాలు తీసుకువస్తున్నారని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సీతక్క అన్నారు. అందులో భాగంగా కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేసేందుకు, 64 లక్షల మంది మహిళలు సొంత కాళ్ల మీద నిలబడేలా 17 రకాల వ్యాపారాలతో సెర్ప్ఆధ్వర్యంలో మహిళా శక్తి కార్యక్రమం చేపట్టామన్నారు. శనివారం మాదాపూర్లోని శిల్పారామంలో మహిళా సంఘాల స్టాల్స్ ను అధికారులతో కలిసి మంత్రి పరిశీలించారు.
డిసెంబర్ 9న నైట్ బజార్ ను ఓపెన్ చేస్తామని మంత్రి ప్రకటించారు. మహిళలు వివిధ రకాల వ్యాపారాల్లో ఉత్సాహంగా రాణిస్తున్నారని, శిల్పారామంలో ఉన్న 106 షాపింగ్ కాంప్లెక్స్ లను అంతర్జాతీయ స్థాయిలో మార్కెటింగ్ చేసుకునేందుకు అందుబాటులోకి తీసుకువస్తున్నామని మంత్రి వెల్లడించారు. ఐటీ ఉద్యోగులు కూడా కొనుగోళ్లు జరిపేలా రాత్రి 2గంటల వరకు నైట్ బజార్ ఓపెన్ చేసి ఉంచుతామని మంత్రి తెలిపారు. గతంలో కొన్నాళ్లు ఈ స్టాల్స్ బాగానే నడిచాయని.. కానీ, గత ఎనిమిదేండ్లుగా ఇంత మంచి ప్రాంగణం మూతపడిందని మంత్రి పేర్కొన్నారు.
మహిళా సాధికారతతో పేదరిక నిర్మూలన
మహిళా సాధికారతతో పేదరిక నిర్మూలన జరుగుతోందని మంత్రి సీతక్క పేర్కొన్నారు. ఒక మహిళ తన కుటుంబ అన్నిరకాల అవసరాలను తీర్చుకోగల ఆర్థిక వ్యవస్థ ఆమె చేతిలో ఉండాలని సెర్ప్ను ఏర్పాటు చేశారని మంత్రి గుర్తుచేశారు. గత కొన్నాళ్లుగా మహిళా సంక్షేమ కార్యక్రమాలు మరుగున పడ్డాయని మంత్రి తెలిపారు. వైఎస్ తరహాలో రేవంత్ మహిళా సాధికారత కోసం పట్టుదలతో పనిచేస్తున్నారన్నారు. గ్రామీణ ప్రాంతాల మహిళలు తమ నైపుణ్యంతో ఉత్పత్తి చేసిన వస్తువులను నైట్బజార్లో అంతర్జాతీయ స్థాయిలో సేల్ చేసుకోవచ్చని మంత్రి సూచించారు.
షాపింగ్ కాంప్లెక్స్ ల మరమ్మతుల కోసం సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే రూ.7 కోట్ల నిధులు కేటాయించారని, మంత్రి తెలిపారు. దీంతో శిల్పారామానికి పూర్వవైభవం తీసుకువచ్చి.. మహిళలు చేసిన ఉత్పత్తులు సేల్ చేసుకునే విధంగా డిసెంబర్ 9న అందుబాటులోకి తీసుకువస్తున్నామన్నారు. అంబేద్కర్ చెప్పినట్టు ‘మహిళలు ఎక్కడ ఉన్నతంగా ఉంటారో.. అక్కడ అభ్యున్నతి ఉంటుంది’ అని, గతంలో మహిళలు ఇంట్లో వాళ్లవద్ద చేయి చాచే పరిస్థితి ఉండేదని.. ఇప్పుడు పరిస్థితి మారిందని మంత్రి పేర్కొన్నారు. మహిళా సంఘాలు మరిన్ని ఏర్పాటు చేసి.. వారి సాధికారత, ఆర్థిక బలోపేతం కోసం ఉద్యమంలా పనిస్తున్నామని మంత్రి సీతక్క స్పష్టం చేవారు. ఈ కార్యక్రమంలో సెర్ప్ సీఈఓ దివ్య దేవరాజన్ , ఇతర అధికారులు పాల్గొన్నారు.