- పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క
- ములుగు బాయ్స్ హాస్టల్‌లో స్టూడెంట్లతో కలిసి భోజనం చేసిన మంత్రి, కలెక్టర్
- హాస్టళ్లలో ఎలాంటి సమస్యలున్నా పరిష్కరించాలని ఆఫీసర్లకు ఆదేశం
ములుగు/ఏటూరునాగారం, వెలుగు : పేద విద్యార్థుల జీవితాల్లో వెలుగులు నింపడమే ప్రభుత్వ ధ్యేయమని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సీతక్క చెప్పారు. స్టూడెంట్లు అవకాశాలను అందిపుచ్చుకొని ఉన్నత కొలువులు సాధించాలని సూచించారు. హాస్టల్ నిద్రలో భాగంగా గురువారం ములుగులోని బీసీ బాయ్స్ హాస్టల్‌లో స్టూడెంట్లతో కలిసి మంత్రి సీతక్క, కలెక్టర్ దివాకర్ భోజనం చేశారు. ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ హాస్టళ్లలో ఎలాంటి సమస్యలు ఉన్నా వాటిని పరిష్కరించాలని ఆఫీసర్లను ఆదేశించారు.
డోర్లు, కిటికీలకు మెష్‌లు ఫిట్ చేయాలని, తాగునీటి వసతి కల్పించడంతో పాటు పౌష్టికాహారం అందించాలని, విద్యుత్ సమస్యలు లేకుండా చూడాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యపై ఎక్కువ దృష్టి పెట్టిందని, ములుగు జిల్లాను ఎడ్యుకేషనల్ హబ్‌గా తీర్చిదిద్దనున్నట్లు చెప్పారు. స్టూడెంట్లు చదువులో రాణిస్తూ కార్పొరేట్ స్థాయి స్కూళ్లు, కాలేజీలతో పోటీ పడాలని సూచించారు.
మంత్రి వెంట బీసీ సంక్షేమ శాఖ అధికారి రవీందర్ ఉన్నారు. అంతకుముందు ఏటూరునాగారం మండల కేంద్రంలోని జడ్పీ హైస్కూల్‌లో ఏర్పాటు చేసిన కంప్యూటర్ ల్యాబ్‌ను కలెక్టర్ దివాకర్, ఐటీడీఏ పీవో చిత్రామిశ్రాతో కలిసి ప్రారంభించారు. స్టూడెంట్ల భవిష్యత్‌కు కంప్యూటర్ విద్య ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు.