హాలియా, వెలుగు : ఆదివాసీ, గిరిజనుల అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యమని పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క చెప్పారు. నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ హిల్‌కాలనీలో జరుగుతున్న అఖిల భారత గిరిజన, ఆదివాసీ ప్రతినిధుల శిక్షణా తరగతులకు గురువారం ఆమె హాజరై మాట్లాడారు. శిక్షణ పొందిన నేతలు రాష్ట్ర, జిల్లా, మండల, గ్రామస్థాయిలో గిరిజన, ఆదివాసీలకు అవగాహన కల్పించాలని సూచించారు. గిరిజన, ఆదివాసీలు ఉన్నత విద్యనభ్యసించి మంచి ఉద్యోగాలు సాధించాలని ఆకాంక్షించారు. బౌద్ధమతానికి నిలయమైన సాగర్‌లో ఇలాంటి శిక్షణా తరగతులు నిర్వహించడం గొప్ప విషయమన్నారు.
తెలంగాణలో వీలైనంత త్వరలో లోకల్ బాడీ ఎలక్షన్లు నిర్వహించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. గ్రామాల్లో ప్రజాప్రతినిధులు ఉంటేనే అభివృద్ధి జరగడంతో పాటు, కేంద్రం నుంచ నిధులు వస్తాయన్నారు. కేంద్ర ప్రభుత్వం అటవీ హక్కులను కాపాడలేక పోగా ఆదివాసీ, గిరిజన హక్కులను కాలరాస్తూ అదానీ, అంబానీల కోసం అడవులను నాశనం చేస్తున్నారని ఆరోపించారు.
అక్రమ మైనింగ్ వ్యాపారం కోసం ఆదివాసీ, గిరిజనుల మూలాలు లేకుండా కుట్ర చేస్తున్నారన్నారు. కార్యక్రమంలో ట్రైకార్ చైర్మన్ తేజావత్ బెల్లయ్య నాయక్, డీసీసీ అధ్యక్షుడు శంకర్‌నాయక్, మునినాయక్, నాగేశ్వర్‌నాయక్, శంకర్‌నాయక్, హరినాయక్, నాగేందర్‌నాయక్ పాల్గొన్నారు.