ఇచ్చిన ప్రతి హామీని అమలుచేస్తాం : మంత్రి సీతక్క

  • రాజ్యాంగం ప్రతిఒక్కరికీ ప్రశ్నించే హక్కు ఇచ్చింది
  • జనవరి నుంచిసన్నబియ్యం పంపిణీ

ములుగు, వెలుగు : ఇచ్చిన ప్రతిహామీని కాంగ్రెస్‌‌‌‌ ప్రభుత్వం అమలు చేస్తుందని పంచాయతీ రాజ్‌‌‌‌ శాఖ మంత్రి సీతక్క చెప్పారు. త్వరలో రైతుబంధు, రైతుభరోసా, మహిళలకు రూ.2500 పింఛన్‌‌‌‌ పథకాలను సైతం అమలు చేస్తామన్నారు. మంగళవారం ములుగు, గోవిందరావుపేట మండలాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా ములుగులోని బస్టాండ్‌‌‌‌ వద్ద గల అంబేద్కర్‌‌‌‌ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం ఇంచర్లలో పరిధిలోని ఎర్రిగట్టమ్మ వద్ద ఎన్‌‌‌‌హెచ్‌‌‌‌ 163 నుంచి సీఆర్పీఎఫ్‌‌‌‌ బెటాలియన్‌‌‌‌ వరకు సీసీ రోడ్డు పనులు, రూ.50 లక్షలతో అంతర్గత సీసీ రోడ్లు, ఇంచర్ల గ్రామంలో గ్రామపంచాయతీ బిల్డింగ్‌‌‌‌కు కలెక్టర్‌‌‌‌ దివాకర, గ్రంథాలయ సంస్థ చైర్మన్‌‌‌‌ బానోతు రవిచందర్‌‌‌‌తో కలిసి శంకుస్థాపన చేశారు. 

అలాగే ములుగులో పీఏసీఎస్‌‌‌‌ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ భారత రాజ్యాంగం ప్రతిఒక్కరికీ ప్రశ్నించే, భావస్వేచ్ఛ హక్కులను కల్పించిందన్నారు. కొందరు వ్యక్తులు రాజ్యాంగ చట్టాలను తుంగలో తొక్కేందుకు ప్రయత్నిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళల ఆర్థికాభివృద్ధికి సీఎం రేవంత్‌‌‌‌రెడ్డి ప్రత్యేకంగా చొరవ చూపుతున్నారన్నారు.  

ఆర్టీసీ బస్సుల్లో మహిళలు ఉచితంగా ప్రయాణించడం కొందరికి నచ్చడం లేదని విమర్శించారు. జనవరి నుంచి సన్నబియ్యం పంచేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, సన్నవడ్లు పండించిన రైతులకు రూ.500 బోనస్‌‌‌‌ సైతం ఇస్తున్నామన్నారు. ఇప్పటికే రూ.18 వేల కోట్ల రుణమాఫీ చేశామని, రానున్న రోజుల్లో మరో రూ.10 వేల కోట్లు కేటాయించి రుణమాఫీ కానీ రైతులకు కూడా అందజేస్తామన్నారు.  

రైతులు దళారులను నమ్మి మోసపోవద్దు

రైతులు దళారులను నమ్మి మోసపోవద్దని, కొనుగోలు కేంద్రాల్లోనే వడ్లు అమ్ముకోవాలని మంత్రి సీతక్క సూచించారు. రైతులకు బోనస్ ఇస్తే ప్రతి పక్షాలకు మింగుడుపడడం లేదన్నారు.   పంచాయతీరాజ్ శాఖ ద్వారా రూ.2,700ల కోట్లతో పలు అభివృద్ధి పనులను చేపట్టామని, ఎన్‌‌‌‌ఆర్‌‌‌‌ఈజీఎస్‌‌‌‌ పథకం ద్వారా విడుదల అవుతున్న నిధులతో గ్రామాల్లో సీసీ రోడ్లు, డ్రైనేజీలు, భవన నిర్మాణ పనులు చేపట్టాలని సూచించారు. 

అనంతరం సీఎస్‌‌‌‌ఆర్‌‌‌‌ నిధులు, మౌరిటెక్‌‌‌‌ ఐటీ సంస్థ సౌజన్యంతో జడ్పీ హైస్కూల్‌‌‌‌లో 10 కంప్యూటర్లతో ఏర్పాటు చేసిన ల్యాబ్‌‌‌‌ను ప్రారంభించారు. ఆయా కార్యక్రమాల్లో అడిషనల్‌‌‌‌ కలెక్టర్లు మహేందర్‌‌‌‌, సంపత్‌‌‌‌రావు, డీడబ్ల్యూవో కె.శిరీష, పీఏసీఎస్‌‌‌‌ చైర్మన్‌‌‌‌ బొక్క సత్తిరెడ్డి, వైస్‌‌‌‌ చైర్మన్‌‌‌‌ మర్రి రాజు, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ సభ్యుడు జన్ను రవి, బెటాలియన్‌‌‌‌ డిప్యూటీ కమాండెంట్‌‌‌‌ ఎన్పీ. రజిత, అసిస్టెంట్ కమాండెంట్‌‌‌‌  నారాయణ, సుబేదార్‌‌‌‌ మేజర్‌‌‌‌ మణిబాబు, ఎంపీడీవో రామకృష్ణ పాల్గొన్నారు.