
హైదరాబాద్, వెలుగు: పంచాయతీ రాజ్ శాఖ 2025–-26 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ అంచనాలు రూపొందించింది. రూ.49.44 వేల కోట్లతో బడ్జెట్ తయారు చేసి రాష్ట్ర ప్రభుత్వానికి అందజేసింది. గతేడాది కన్నా ఈసారి రూ.వెయ్యి కోట్లు అదనంగా బడ్జెట్ అంచనాలు పెట్టింది. ఈసారి బడ్జెట్ అంచనాల్లో అత్యధికంగా ఆపరేషన్, పథకాల నిర్వహణకు రూ.8,963.63 కోట్లు అవసరమవుతాయని అధికారులు ప్రభుత్వానికి ఇచ్చిన నివేదికలో తెలిపారు.
ఇందులో వేతనాలు, రిపేర్లు, మౌలిక వసతులు, గ్రిడ్ కు రూ.1,841.7 కోట్లు, విద్యుత్ వినియోగ చార్జీలకు రూ.5,876.95 కోట్లు, హెచ్ఎండబ్ల్యూఎస్ఎస్బీకి చెల్లించాల్సిన వాటర్ చార్జీలు రూ.986.59 కోట్లు, మురుగునీటి శుద్ధి చార్జీలు రూ.1,98.81కోట్లు, రవాణా కోసం రూ.9.47 కోట్లు, వేసవిలో అమలు చేయాల్సిన పనుల కోసం రూ.50.7 కోట్లు కేటాయించాలని ప్రతిపాదనలు చేశారు.
అలాగే.. రాష్ట్ర ప్రణాళిక కింద పథకాలకు రూ.1,504.36 కోట్లు, నాబార్డు- ఆర్ఐడీఎఫ్కు రూ.124.36 కోట్లు, మిషన్ భగీరథ పథకానికి రూ.979.07 కోట్లు, -టీడీడబ్ల్యూ ఎస్సీఎల్ చెల్లింపులకు రూ.4,048.29 కోట్లు, వేతనాల జీతాల కోసం రూ.319.26 కోట్లను బడ్జెట్ అంచనాల్లో పొందుపర్చారు.
ఈసారి పెరిగిన అంచనాలు
ఈ బడ్జెట్లో ఎంపీపీ, జిల్లా పరిషత్ భవనాలకు నిధులు పెంచాలని ప్రభుత్వాన్ని పంచాయతీ రాజ్ శాఖ కోరింది. 2024-25 సంవత్సరంలో రూ.11.08 కోట్లు బడ్జెట్ పెడితే 2025–26 సంవత్సరానికి రూ.728 కోట్లు కేటాయించాలని బడ్జెట్లో పొందుపర్చారు. అలాగే, వర్షాలకు కొట్టుకుపోయిన రోడ్ల మరమ్మతులకు అంచనాలు పెంచారు.
నిరుడు వీటి కోసం రూ.200 కోట్ల కోసం ప్రపోజల్స్ పంపగా.. ప్రస్తుతం రూ.500 కోట్లకు పంపారు. మహిళా స్వయం సహాయక గ్రూపు సభ్యులకు బీమా కోసం గతేడాది రూ.55.41 కోట్లు కేటాయించగా.. ఈ బడ్జెట్లో 68.75 కోట్లు కావాలని ప్రభుత్వానికి అందజేసిన నివేదికలో పేర్కొన్నారు. ఈసారి పంచాయతీ ఎన్నికలు ఉండడంతో ప్రత్యేకంగా రూ.3.25 కోట్లు అవుతాయని అంచనాలు
రూపొందించారు.