![పంచాయతీలను గ్రేడ్లుగా విభజించండి .. మంత్రి సీతక్కకు పంచాయతీ సెక్రటరీల వినతి](https://static.v6velugu.com/uploads/2025/02/panchayat-secretaries-association-asks-minister-seethakka-to-divide-village-panchayats-into-four-grades_MFn1N6ILYm.jpg)
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని గ్రామ పంచాయతీలను నాలుగు గ్రేడ్లుగా డివైడ్ చేయాలని, కేడర్ స్ర్టెంత్ మంజూరు చేయాలని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సీతక్కను పంచాయతీ సెక్రటరీస్ అసోసియేషన్ కోరింది. గత ప్రభుత్వంలో నియమితులైన సెక్రటరీల ప్రొబెషన్ టైమ్ ను 4 ఏండ్ల నుంచి రెండేండ్లకు తగ్గించాలని విజ్ఞప్తి చేసింది. గురువారం బేగంపేట ప్రజా భవన్లో పంచాయతీ సెక్రటరీస్ అసోసియేషన్ డైరీని మంత్రి సీతక్క రిలీజ్ చేశారు. ఈ సందర్బంగా అసోసియేషన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మధుసూదన్ రెడ్డి, శ్రీనివాస్, వాణి పంచాయతీ సెక్రటరీల సమస్యలను మంత్రి దృష్టికి తీసుకెళ్లారు.
ఔట్ సోర్సింగ్ పద్ధతిలో సెక్రటరీలను నియమిస్తున్నారని, ఈ పద్ధతిని ఆపాలన్నారు. ఇప్పటికే అలా రిక్రూటైన సెక్రటరీలను రెగ్యులర్ చేయాలని మంత్రిని కోరారు. 317 జీవోతో నష్టపోయిన స్పౌజ్, మెడికల్ సెక్రటరీలను బదిలీ చేయాలని నేతలు కోరారు. త్వరలో ఈ సమస్యలను ఉన్నతాధికారులతో చర్చించి, చర్చలకు పిలుస్తానని మంత్రి తమకు హామీ ఇచ్చినట్లు అసోసియేషన్ నేతలు పేర్కొన్నారు.
కాంగ్రెస్లో చేరిన ఆదిలాబాద్ జిల్లా నేతలు
ఆదిలాబాద్ జిల్లాకు చెందిన పలు పార్టీల నేతలు గురువారం కాంగ్రెస్ లో చేరారు. గాంధీభవన్ లో మంత్రి సీతక్క వారికి కాంగ్రెస్ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా సీతక్క మాట్లాడారు. కుల గణన, ఎస్సీ వర్గీకరణ వంటి సాహసోపేతమైన నిర్ణయాలు, ఉచిత బస్ పాస్ వంటి పథకాలు నచ్చి ఇతర పార్టీల వారు కాంగ్రెస్ లోకి వస్తున్నారని తెలిపారు. దేశంలోని ఏ రాష్ట్రంలో చేయని కులగణనను కేవలం తెలంగాణలో చేసి చూపించామని చెప్పారు. బీఆర్ఎస్ ప్రభుత్వం చేయలేని పనిని తమ సర్కారు చేయడంతోనే ఓర్వలేని ఆ పార్టీ నేతలు తమ సర్వేపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు.