ఎన్ఓసీ ఇచ్చేందుకు లంచమడిగిన పంచాయితీ సెక్రటరీ

ఎన్ఓసీ ఇచ్చేందుకు లంచమడిగిన పంచాయితీ సెక్రటరీ

రేకుల తయారీ పరిశ్రమ పెట్టుకునేందుకు నో అబ్జక్షన్ సర్టిఫికెట్ (ఎన్ఓసీ) ఇచ్చేందుకు సైతం ఓ ప్రభుత్వ అధికారి లంచం అడిగాడు. అలా కక్కుర్తి పడ్డ ఓ పంచాయితీ సెక్రటరీ ఏసీబీ అధికారులకు చిక్కాడు. ఈ ఘటన కరీంనగర్ జిల్లా కేంద్రంలోని కొత్తపల్లి మండలంలో జరిగింది. తిరుపతి అనే రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగి వద్ద నుంచి బావుపేట విలేజ్ సెక్రటరీ ఊట్కూరి శ్రీధర్ 90 వేల రూపాయలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఆర్మీ నుంచి రిటైరైన తిరుపతి.. బావుపేటలో ఓ రేకుల తయారీ పరిశ్రమ పెట్టుకునేందుకు కావాల్సిన అన్ని అనుమతులు తీసుకున్నాడు. జిల్లా పరిశ్రమల కేంద్రంతో పాటు, సుడా నుంచి కూడా పర్మీషన్ వచ్చింది. చివరగా పంచాయతీ సెక్రటరీ శ్రీధర్ నుంచి నో ఆబ్జన్ తీసుకోవాల్సి ఉంటుంది. 

ఇందుకోసం శ్రీధర్ ను సంప్రదించగా.. లక్ష రూపాయలు ఇస్తేనే నో-ఆబ్జక్షన్ ఇస్తానంటూ మెలికపెట్టాడు. చివరకు 90 వేల రూపాయలకు ఒప్పుకున్నాడు. అయితే లంచం ఇవ్వడం ఇష్టంలేని తిరుపతి ఏసీబీని ఆశ్రయించాడు. దీంతో ఏసీబీ పన్నిన ట్రాప్ లో శ్రీధర్ ఇరుక్కుపోయాడు. కరీంనగర్ ఆర్టీసీ వర్క్ షాపు సమీపంలో ఉంటున్న తిరుపతి నుంచి 90 వేల రూపాయలు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రైడ్ చేసి పట్టుకున్నారు. పట్టుబడిన శ్రీధర్ నుంచి నగదు స్వాధీనం చేసుకుని.. అతన్ని కరీంనగర్ ఏసీబీ కోర్టులో హాజరుపర్చనున్నట్లు ఏసీబీ డీఎస్పీ తెలిపారు.