తెలంగాణ పల్లెల్లోని మనుషులను, వారి మధ్య ఆత్మీయతను కళ్లకు అద్దినట్టు చూపించిన సినిమా 'బలగం'. టిల్లు వేణు డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమా ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లు వసూలు చేస్తోంది. ప్రాంతంతో తేడా లేకుండా ప్రతి ఒక్కరూ ఈ సినిమాలోని పాత్రలకు కనెక్ట్ అవుతుండడంతో.. విడుదలైన రోజు నుంచే ఈ మూవీకి పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. ఇక పల్లెల్లో నివసించే వారికైతే ఈ సినిమాగా బాగా నచ్చేసింది. పల్లె ప్రజలకు ఈ మూవీ బాగా నచ్చడంతో థియేటర్లు లేని మారుమూల గ్రామాల్లో, థియేటర్లు లేని ఊర్లల్లో ఈ సినిమాను గ్రామ పంచాయితీల వద్ద ప్రదర్శనగా వేస్తున్నారు. దీంతో థియేటర్లకు వెళ్లలేని ప్రజలకు ఈ సినిమా చూసే అవకాశం ఏర్పడుతోంది. ఈ సందర్భంగా గ్రామాల్లో 'బలగం' సినిమా ప్రదర్శన వేయిస్తున్నామంటూ స్వయంగా పంచాయితీ అధికారులే దండోరా వేసి ప్రచారం చేస్తున్నారు.
తాజాగా జగిత్యాల జిల్లాలోనూ ఇదే తరహా ఘటన చోటుచేసుకుంది. నాచుపల్లి గ్రామంలో ఏప్రిల్ 8న సాయంత్రం 'బలగం' సినిమా ప్రదర్శన ఉంటుందని గ్రామ పంచాయితీ సిబ్బంది దండోరా వేయించారు. గ్రామ ప్రజలందరూ వచ్చి మూవీని చూడాలంటూ ప్రచారం చేయించారు. ఇలా ఈ ఒక్క ఊర్లోనే కాదు.. ఇప్పటివరకు చాలా గ్రామాల్లో ఇలాగే చేస్తున్నారు. ఇటీవల ఓ గ్రామంలో 'బలగం' సినిమా చూసి విడిపోయిన అన్నాదమ్ములు ఒకటైన ఘటన సోషల్ మీడియాలోనూ వైరల్ గా మారింది.