పెద్దవాగు నుంచి భారీగా ఇసుక తరలింపు
ట్రిప్పుకు రూ.4 వేల చొప్పున అమ్మకాలు
మొగుళ్లపల్లి మండలంలో కొందరు సర్పంచ్‌ల ఇష్టారాజ్యం
జయశంకర్ భూపాలపల్లి, వెలుగు: గ్రామాలలో చెత్త సేకరణకు ప్రభుత్వం అందించిన ట్రాక్టర్లను కొందరు సర్పంచ్‌లు దుర్వినియోగం చేస్తున్నారు. ఇసుక అక్రమ రవాణాకు ఉపయోగించి సొమ్ము చేసుకుంటున్నారు. ట్రాక్టర్ ట్రిప్పుకు రూ.4 వేలకు పైగా వసూలు చేస్తూ ప్రైవేట్‌గా అమ్మి, జేబులు నింపుకుంటున్నారు. పర్మిషన్లు లేకుండా వాగుల్లో ఇసుక తోడవద్దని ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చినా పట్టించుకోవడం లేదు. జయశంకర్భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలంలో కొందరు సర్పంచ్‌ల ఇష్టారాజ్యంపై ఆఫీసర్లు, ప్రజల్లో చర్చ నడుస్తోంది.
గుట్టుచప్పుడు కాకుండా..
గ్రామాలలో చెత్త సేకరణకు ప్రభుత్వం ఒక్కో ట్రాక్టర్‌కు రూ.10లక్షలకు పైగా వెచ్చించి, గ్రామ పంచాయతీలకు అందజేసింది. గ్రామాల్లో ప్రజల అవసరాల మేరకే వీటిని వినియోగించాల్సి ఉండగా.. మొగుళ్లపల్లి మండలంలోని పలు గ్రామాల సర్పంచ్‌లు ఇసుక అక్రమ రవాణాకు ఉపయోగిస్తున్నారు. మొగుళ్లపల్లి‒ కొరికిశాల గ్రామాల మధ్య ఉన్న పెద్ద వాగు నుంచి ఐదు గ్రామాలకు చెందిన ప్రభుత్వ ట్రాక్టర్లతో ఈ దందా నడిపిస్తున్నారు. ప్రభుత్వం నుంచి ఎలాంటి పర్మిషన్తీసుకోకుండానే వాగుల నుంచి యథేచ్ఛగా ఇసుక తోడేస్తున్నారు. రెండో శనివారం, ఆదివారం వరసగా రెండు రోజులు ప్రభుత్వ ఆఫీసులకు సెలవు రావడంతో ఇసుక అక్రమ రవాణాకు తెరలేపారు. శనివారం పెద్దవాగులో ఇసుక తోడి పలు గ్రామాలకు చెందిన ప్రభుత్వ ట్రాక్టర్లలో నింపుకొని తీసుకెళ్తున్న ఫొటోలను ‘వెలుగు’ కెమెరాకు చిక్కాయి.
వాగులో అప్రోచ్ రోడ్డు..
వాగులలో అనుమతులు లేకుండా ఇసుక తోడడం చట్ట విరుద్ధం. వివిధ అవసరాల కోసం ఇసుక కావాలనుకుంటే తహసీల్దార్నుంచి పర్మిషన్ తీసుకోవాలి. ఇందుకోసం ప్రభుత్వానికి పైసలు కట్టాలి. అలాంటిది మొగుళ్లపల్లి మండలానికి చెందిన పలువురు సర్పంచ్‌లు వాగులో అప్రోచ్ రోడ్డు వేసి మరీ ఇసుక రవాణా చేస్తున్నారు. ట్రాక్టర్లు వెళ్లడానికి వీలుగా పెద్ద వాగులో మొరంతో తాత్కాలికంగా అప్రోచ్ రోడ్డు వేశారు. పగలు, రాత్రి అనే తేడా లేకుండా ఇసుక తరలించడానికి ఏర్పాట్లు చేసుకున్నారు. ఇదేంటని కొందరు ప్రశ్నిస్తే అభివృద్ధి పనుల కోసం అని చెప్పి తప్పించుకుంటున్నారు. గ్రామాల్లో ఇండ్లకు అని చెప్పి ప్రైవేటు వ్యక్తులకు ట్రిప్పుకు రూ.4వేలకు పైగా అమ్ముతున్నారు.
జనరల్ బాడీలో చర్చ..
మొగుళ్లపల్లి మండలంలోని పెద్దవాగులో జరుగుతున్న ఇసుక అక్రమ రవాణా విషయంపై ఇటీవల జరిగిన మండల జనరల్ బాడీ సమావేశంలోనూ చర్చ జరిగింది. ఇసుక అక్రమ రవాణాపై భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డికి కూడా కొందరు ఫిర్యాదు చేశారు. ఈ దందాపై ఎమ్మెల్యే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కొందరు ప్రజాప్రతినిధులు ప్రభుత్వ పనుల కోసం అంటూ పర్మిషన్ తీసుకొని బయట అమ్ముకొని సొమ్ము చేసుకుంటున్న విషయం తెలియడంతో ఇక నుంచి పర్మిషన్లు రద్దు చేయాలని రెవెన్యూ ఆఫీసర్లను ఆదేశించారు.
మేం పర్మిషన్ ఇవ్వలేదు
పెద్దవాగులో ఇసుక తోడటానికి ఎవరికీ పర్మిషన్లు ఇవ్వలేదు. ప్రభుత్వ ట్రాక్టర్లలో ఇసుక తరలించడానికి కూడా మేం అనుమతి ఇవ్వలేదు. పర్మిషన్ లేకుండా వాగులలో ఇసుక తోడటం చట్టవిరుద్దం. రెండో శనివారం, ఆదివారం వరసగా సెలవు రోజులు వచ్చాయి. ఇదే అదునుగా కొందరు ఇసుక అక్రమ రవాణా జరుపుతున్నారనుకుంటా. దీనిపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటాం.
‒ జగన్, ఇన్చార్జీ తహసీల్దార్, మొగుళ్లపల్లి