తెలంగాణ పల్లెలో ఓటర్లు 1,67,33,584 పంచాయతీ ఓటర్ల తుది జాబితా విడుదల : మహిళా ఓటర్లే అధికం 

  • మహిళా ఓటర్లే అధికం.. రాష్ట్ర ఎన్నికల సంఘం వెబ్ సైట్​లో వివరాలు

హైదరాబాద్, వెలుగు: పంచాయతీ ఓటర్ల లెక్కతేలింది. సవరణల అనంతరం గ్రామ పంచాయతీల ఓటర్ల తుది జాబితాను రాష్ట్ర ఎన్నికల సంఘం గురువారం వెబ్ సైట్ లో పెట్టింది. జిల్లాలు, మండలాలు, గ్రామాలు, వార్డుల వారీగా జాబితాను విడుదల చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా మహిళా ఓటర్లే అధికంగా ఉన్నారు. రాష్ట్రంలో 32 జిల్లాలు.. 538 మండలాలు.. 12,867 గ్రామాలుండగా.. 1,13,722 వార్డులు ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 1,67,33,584 మంది ఓటర్లు ఉన్నారు.

ఇందులో పురుషులు 82,04,518 మంది, మహిళలు 85,28,573, ఇతరులు 493 మంది ఉన్నారు. అత్యధికంగా నల్గొండ జిల్లాలో 31 మండలాలు, 856 గ్రామాలు, 7,392 వార్డులు ఉన్నాయి. వీటి పరిధిలో మొత్తం 10,42,545 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో పురుషులు 5,16,713 మంది, మహిళలు 5,25,780, ఇతరులు 52 మంది ఉన్నారు. ఈ జిల్లాలో కూడా మహిళా ఓటర్లే అధికంగా ఉన్నారు. అత్యల్పంగా మేడ్చల్- మల్కాజిగిరి జిల్లాలో 3 మండలాలు, 34 గ్రామ పంచాయతీలుండగా 320 వార్డులు ఉన్నాయి. వీటి పరిధిలో మొత్తం ఓటర్లు 64,397 మంది ఉండగా.. పురుషులు 32,402, మహిళలు 31,992, ఇతరు ముగ్గురు ఉన్నారు. అయితే, ఈ జిల్లా సింహభాగం హైదరాబాద్ నగరంలో ఉండడంతో ఇక్కడ గ్రామపంచాయతీలు తక్కువగా ఉన్నాయి.

గెలుపోటములపై మహిళా ఓటర్ల ప్రభావం..

గడిచిన ఎన్నికల్లో గెలుపోటములపై మహిళా ఓటర్లు ప్రభావితం చూపారు. ఈ సారి జరగబోయే పంచాయతీ ఎన్నికల్లో కూడా అతివలదే పై చేయి కానున్నది. సర్పంచులు, వార్డు సభ్యుల గెలుపోటములను  నిర్ణయించేది మహిళా ఓటర్లేనని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. మరోవైపు పంచాయతీ ఎన్నికల తుది జాబితా విడుదల కావడంతో ఆశావహులు తమ గ్రామాల్లో బరిలో దిగేందుకు సన్నద్ధమవుతున్నారు.

ALSO READ | ట్రిపుల్ఆర్ అలైన్​మెంట్ మార్చాలి

కులగణన తర్వాతే ప్రభుత్వం పల్లె పోరు నిర్వహించనుండడంతో రిజర్వేషన్లపై ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఈ లోగా గ్రామంలో పోటీకి కావాల్సిన ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఒకవేళ తమ సామాజిక వర్గానికి రిజర్వేషన్ అయితే బరిలో నిలిచేలా వ్యూహాత్మకంగా ముందుకు సాగుతున్నారు.