- ఎడపల్లిలో పంచాయతీ కార్మికుల ధర్నా
ఎడపల్లి, వెలుగు: తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ జేఏసీ జిల్లా నాయకుడు జంగం గంగాధర్ ఆధ్వర్యంలో శనివారం ఎడపల్లి మండలంలోని గ్రామపంచాయతీ కార్మికులు ఎంపీపీ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. అనంతరం ఎంపీఓ శాస్త్రికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా జంగం గంగాధర్ మాట్లాడుతూ.. నాలుగు నెలలుగా కార్మికులకు జీతాలు ఇవ్వకపోవడంతో వారికి కుటుంబ పోషణ భారంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని, గ్రామపంచాయతీ కార్మికులందరినీ పర్మినెంట్ చేయాలని డిమాండ్ చేశారు.
జీతాలు చెల్లించాలి
కోటగిరి, వెలుగు: మూడు నెలలుగా తమకు జీతాలు రావటం లేదని ఆవేదన వ్యక్తం చేస్తూ కోటగిరి మండల ఎంపీడీవో కార్యాలయం ఎదుట గ్రామపంచాయతీ కార్మికులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐటీయూ నాయకుడు నన్నే సాబ్ మాట్లాడుతూ.. పంచాయతీ కార్మికులు, ఉద్యోగుల జేఏసీ పిలుపుమేరకు నిరసన కార్యక్రమం చేపట్టామన్నారు. ప్రభుత్వం వెంటనే జీతాలను చెల్లించాలన్నరు. గ్రామపంచాయతీలో మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. డిసెంబర్ 31 లోగా పెండింగ్ బకాయిలను విడుదల చేయాలని లేకుంటే నిరవధిక సమ్మెకు వెనకాడబోమని హెచ్చరించారు.