పంచాయతీరాజ్‍ శాఖ మళ్లీ ఓరుగల్లుకే .. ఇద్దరు మంత్రులకు శాఖలు ఖరారు

  • సీతక్కకు పంచాయతీరాజ్‍, మహిళా, శిశు సంక్షేమ శాఖ
  • కొండా సురేఖకు ఫారెస్ట్‌‌, ఎండోమెంట్‌‌

వరంగల్‍, వెలుగు : కాంగ్రెస్‌‌ ప్రభుత్వంలో ఉమ్మడి వరంగల్‌‌ జిల్లాకు చెందిన ఇద్దరు మహిళా మంత్రులకు కీలక శాఖలు దక్కాయి. బీఆర్‌‌ఎస్‌‌ ప్రభుత్వంలో అత్యంత కీలకంగా భావించిన పంచాయతీరాజ్‍, గ్రామీణాభివృద్ధి శాఖా మంత్రిగా ఉమ్మడి జిల్లాకు చెందిన ఎర్రబెల్లి దయాకర్‍రావు వ్యవహరించగా, ప్రస్తుతం సీఎం రేవంత్‍రెడ్డి టీంలోనూ జిల్లాకు చెందిన సీతక్కకు అవే శాఖలతో పాటు మహిళా శిశు సంక్షేమ శాఖను సైతం అప్పగించారు. అలాగే మరో మంత్రి కొండా సురేఖకు పర్యావరణం, అటవీ, దేవాదాయ శాఖలు కేటాయించారు. ఇద్దరికి కేటాయించిన శాఖలతో ఉమ్మడి జిల్లాలోని గ్రామీణ ప్రాంతాలు, మహిళల అభివృద్ధితో పాటు, జిల్లాలో ఉన్న ఆలయాలు, పర్యాటక కేంద్రాలు, జాతరలకు కొత్త కళ రానుందని ప్రజలు అభిప్రాయపడుతున్నారు.

అనుకున్న శాఖలు రాకపోవడంతో కొంత డిసప్పాయింట్‍ 

ఈ నెల 7న రేవంత్‍రెడ్డితో పాటు 11 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ క్రమంలో శాఖల కేటాయింపుపై జోరుగా ప్రచారం జరిగింది. కానీ సీఎం రేవంత్‌‌రెడ్డి ఢిల్లీ పర్యటన తర్వాతే శాఖలపై క్లారిటీ వచ్చింది. శనివారం ఉదయం అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేయాల్సి ఉండడంతో మంత్రుల శాఖలను ప్రకటించారు. సీతక్కకు ట్రైబల్‌‌ వెల్ఫేర్‌‌, సురేఖకు ఉమెన్‍, చైల్డ్‌‌ వెల్ఫేర్‌‌ అని ప్రచారం జరుగగా అవేవీ నిజం కాలేదు. సీతక్కకు పంచాయతీరాజ్‍తో శాఖతో పాటు మహిళా, శిశు సంక్షేమం, కొండా సురేఖకు పర్యావరణం, ఫారెస్ట్‌‌, ఎండోమెంట్‌‌ శాఖలు దక్కాయి. అయితే కేటాయించిన శాఖలతో సంతృప్తిగానే ఉందని చెబుతూనే ట్రైబర్‌‌ వెల్ఫేర్‌‌ కూడా ఇస్తే బాగుండేదని సీతక్క, మహిళా శిశు సంక్షేమ శాఖ కూడా తనకు ఇస్తారని భావించానని సురేఖ మీడియాకు చెప్పారు.