స్థానిక సంస్థలపై రాష్ట్రాల పెత్తనం పోవాలె

దేశంలోని మూడంచల ప్రభుత్వ వ్యవస్థలో కింది స్థాయిలో కీలకంగా పాలన సాగించే పంచాయతీరాజ్​ స్థానిక సంస్థలను రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేస్తున్నాయి. స్థానిక పాలనను వారి కనుసన్నల్లో, చెప్పుచేతల్లో ఉంచుకునే ప్రయత్నం చేస్తున్నాయి. స్థానిక సంస్థల ఆర్థిక స్థితిపై, లావాదేవీలపై లేని పెత్తనం చెలాయిస్తున్నాయి. ఈ చర్యల కారణంగా స్థానిక సంస్థలు ఆర్థిక, పాలనా స్వేచ్ఛను కోల్పోతున్నాయి. గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యం రూపుదిద్దుకోవాలన్నా, ప్రజాస్వామ్యం విజయవంతం కావాలన్నా 73, 74 రాజ్యాంగ సవరణల ప్రకారం స్థానిక సంస్థలు స్వయం పాలన దిశగా ముందుకు సాగాలి. 

బల్వంతరాయ్ మెహతా కమిటీ 1957లో చేసిన సిఫార్సుల మేరకు1959లో అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా మొట్టమొదటి సారిగా దేశంలో మూడంచల పంచాయతీ రాజ్ వ్యవస్థకు అంకురార్పణ జరిగింది. మొదట రాజస్థాన్, ఆ తర్వాత  ఆంధ్రప్రదేశ్ లో ఈ వ్యవస్థను ప్రారంభించారు. 1959 నవంబర్1న షాద్ నగర్ లో ప్రారంభించారు. గ్రామ పంచాయతీ, బ్లాక్/ సమితి, జిల్లా పరిషత్​లుగా మూడంచల వ్యవస్థ ఏర్పాటైంది. 1986లో సమితుల స్థానంలో అప్పటి ముఖ్యమంత్రి ఎన్.టి. రామారావు మండల వ్యవస్థను ఏర్పాటు చేసి, మండల అధ్యక్ష పదవికి, జిల్లా పరిషత్ అధ్యక్ష పదవికి నేరుగా ప్రత్యక్ష ఎన్నికలు నిర్వహించే సాహసోపేత నిర్ణయం తీసుకున్నారు. ఆ తర్వాతి పాలకులు దానికి తిలోదకాలిచ్చారు.1992లో 73, 74 రాజ్యాంగ సవరణల ద్వారా కేంద్ర ప్రభుత్వం పంచాయతీరాజ్ వ్యవస్థను బలోపేతం చేసేందుకు పలు నిర్ణయాలు తీసుకుంది. వాటిలో ప్రతి ఐదేండ్లకు స్థానిక సంస్థలకు ఎన్నికలు తప్పనిసరిగా నిర్వహించాలని, రాష్ట్ర స్థాయి ఎన్నికల సంఘం ఏర్పాటు చేయాలని, విద్య, వైద్యం, సాగునీరు, తాగునీరు, రోడ్లు లాంటి 29 అంశాల్లో గ్రామస్థాయిలో పంచాయతీలకు, మండల స్థాయిలో మండల పరిషత్ లకు, జిల్లా స్థాయిలో జిల్లా పరిషత్ లకు, మున్సిపల్, నగరపాలక సంస్థలకు బాధ్యతలు వచ్చాయి. కానీ ఆ సవరణలు తాలూకు ఫలితాలు ఆచరణలో నేటికీ అమలు కావడం లేదు. రాష్ట్రాలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయి. దశాబ్దాలుగా ప్రభుత్వాలు పంచాయతీరాజ్ వ్యవస్థను, స్థానిక సంస్థలను నిర్లక్ష్యంతో నిర్వీర్యం చేస్తున్నాయనడానికి ఇదే ఉదాహరణ.

ఎమ్మెల్యేల పెత్తనం..

1994లో ఏర్పడిన పంచాయతీరాజ్ చట్టం ద్వారా 2014లో రాష్ట్ర విభజన వరకు పంచాయతీరాజ్ పాలన కొనసాగింది. ఎంపీటీసీలు, జడ్పీటీసీలు కొంత కాలంగా అధికారాలు, నిధులు లేక ఉత్సవ విగ్రహాలుగా మిగిలారు. ఉమ్మడి రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో నూతన పంచాయతీరాజ్ చట్టం 2018 ఏర్పాటు అత్యంత నాటకీయంగా జరిగింది. ఆంధ్రప్రదేశ్ లో కూడా 2020లో ఆర్డినెన్స్ ద్వారా తమకు అనుకూలంగా ప్రభుత్వం చట్ట సవరణ చేసుకుంది. రాష్ట్ర ప్రభుత్వాలు స్థానిక సంస్థలను వారి కనుసన్నల్లో, చెప్పుచేతుల్లో ఉంచుకునేందుకు అతిగా చేస్తున్న ప్రయత్నాలుగా ఈ చట్ట సవరణలు కనిపిస్తున్నాయి. స్థానిక సంస్థల ఆర్థిక స్థితిపై, లావాదేవీలపై ప్రభుత్వం తనకు లేని పెత్తనం చేస్తోంది. ఈ చర్యల కారణంగా స్థానిక సంస్థలు ఆర్థిక స్వేచ్ఛతోపాటు, పాలనా సౌలభ్యాన్ని కోల్పోతున్నాయి. ప్రజాస్వామ్యంలో పరిపాలనా వికేంద్రీకరణకు నమూనాలుగా, ప్రజలకు చేరువగా ఉండే, ప్రజా ప్రతినిధుల వ్యవస్థకు జీవం పోసే స్థానిక సంస్థలను రాజ్యాంగంలో చెప్పినట్లుగా స్థానిక ప్రభుత్వాలుగా గుర్తించాలి. కేంద్ర ప్రభుత్వం ద్వారా రాష్ట్ర ప్రభుత్వాలు పొందుతున్న అన్ని ప్రాధాన్యతలు, నిధుల వాటా లాగే, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా తన బడ్జెట్ లో స్థానిక సంస్థలకు వాటా నిధులు కేటాయించాలన్న స్థానిక సంస్థల డిమాండ్ దశాబ్దాలు గడిచినా నెరవేరడం లేదు. ప్రస్తుతం స్థానిక సంస్థలు ఆయా నియోజకవర్గ ఎమ్మెల్యేల పెత్తనంలో నలిగిపోతున్నాయి. దీన్ని ప్రభుత్వం, అధికారులు నిరంతరం ప్రోత్సహిస్తున్నారు.

దేశవ్యాప్తంగా ఒకే చట్టం ఉండాలె..

73, 74 రాజ్యాంగ సవరణలు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో తప్పనిసరిగా అమలు జరగాలన్న విధి విధానాలు రావాలి. ఇందుకోసం అవసరమైతే మరో రాజ్యాంగ సవరణ జరగాల్సిన అవసరం ఉంది. తద్వారా జాతీయ పంచాయతీరాజ్ చట్టం ఏర్పాటు జరిగి దేశవ్యాప్తంగా ఒకే పంచాయతీ రాజ్ చట్టం అమలుకు కేంద్రం చర్యలు తీసుకోవాలి. అప్పుడే రాష్ట్రాల స్వార్థపూరిత నిర్ణయాల ద్వారా స్థానిక సంస్థల సాధికారతకు జరుగుతున్న నష్టం పూడుతుంది. అప్పుడే గ్రామాల పురోభివృద్ధికి మార్గం ఏడ్పడుతుంది. రాజ్యాంగ సవరణలు అమలుకు నోచుకోకపోయినా కేంద్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం దురదృష్టకరం. స్థానిక సంస్థలకు కనీసం ఐదేండ్లకు ఒకసారి ఎన్నికలు నిర్వహించడానికి కూడా రాష్ట్ర ప్రభుత్వాలు ఇష్టపడటం లేదు. ఆఖరికి న్యాయస్థానాల్లో కేసుల వేసి ఎన్నికలు జరుపుకోవాల్సిన దుస్థితి కొనసాగుతోంది. 

సర్పంచుల వ్యవస్థ అస్తవ్యస్తం..

తెలుగు రాష్ట్రాల్లో స్థానిక సంస్థలు అత్యంత దయనీయ స్థితిలో, రాష్ట్ర ప్రభుత్వాల దయా దాక్షిణ్యాలతో మాత్రమే మనుగడ సాగిస్తున్నాయి. ప్రభుత్వాలు తమ బడ్జెట్ లో ఒక్క రూపాయి కూడా కేటాయించడం లేదు. కేంద్ర ప్రభుత్వం విడుదల చేస్తున్న ఆర్థిక సంఘ నిధులను నిలువునా దోపిడీ చేస్తున్నాయి. తెలంగాణ పంచాయితీరాజ్ చట్టం 2018 ప్రకారం ఆయా ప్రజాప్రతినిధులు పూర్తిగా కలెక్టర్ ఆధీనంలోకి వెళ్లారు. స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులను కలెక్టర్ తన కింది ఉద్యోగులుగా పరిగణించే పరిస్థితి నెలకొంది. వారిని సస్పెండ్, రిమూవ్ చేసే అధికారాన్ని ఈ చట్టం కలెక్టర్లకు కట్టబెట్టింది. అంతేకాకుండా నిరంతర రాజకీయాలతో సతమతమయ్యే గ్రామాల్లో నేరుగా ప్రజల ద్వారా ఎన్నికైన  సర్పంచ్ అధికారాలకు కత్తెర వేస్తూ, ఉపసర్పంచ్ కు చెక్ పవర్ లో జాయింట్ సంతకం కల్పించి, రాజకీయ వివాదాలను సృష్టించి ప్రభుత్వం వినోదం చూస్తోంది. పారదర్శకత పేరుతో ప్రభుత్వం చేస్తున్న ఈ ప్రయత్నం ప్రజామోదంతో నేరుగా గెలిచిన సర్పంచ్ వ్యవస్థను అనుమానిస్తూ, అవమానిస్తూ, కించపరుస్తున్న తీరు అత్యంత దుర్మార్గకరం. సకాలంలో పనులు నిర్వహించాలని అధికారుల ఒత్తిడి, గ్రామంలో ఒక్క మొక్క చనిపోయినా సర్పంచ్ దే బాధ్యత అని ప్రభుత్వం.. ఇలా ప్రజాప్రతినిధులపై వేధింపులు కొనసాగిస్తోంది. దీనికి రాజకీయం తోడై అనేక మంది సర్పంచులు నేడు తెలంగాణ రాష్ట్రంలో సస్పెన్షన్‌‌‌‌‌‌‌‌కు గురై మానసిక వేదన అనుభవిస్తున్నారు. పనులు చేసిన సర్పంచులకు నిధులు సకాలంలో చెల్లింపులు జరగడం లేదు. అధికారులు బిల్లులు చేయక, చేసిన అప్పులు తలకు మోపెడై రాష్ట్రంలో కొందరు సర్పంచులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. సొంత ఆస్తులను అమ్మి, అభివృద్ధి పనులు నిర్వహించి, పరువు కోసం వాటి అప్పులను తీర్చేందుకు నేడు సర్పంచులు ప్రయత్నం చేస్తున్న తీరును ప్రభుత్వాలు ఇకనైనా గుర్తించాలి. నూతన చట్టం అమలులో, ఆచరణలో ఉన్న లోపాలను సవరించడానికి సర్పంచ్ సంఘాలు ఎన్ని ప్రయత్నాలు చేసినా అవి ప్రభుత్వాలకు చేరడం లేదు.

పాలకులు చిత్తశుద్ధితో పనిచేస్తేనే..

నిధుల నిర్వహణలో పంచాయతీలకు చెందిన సాధారణ నిధులను కూడా ప్రభుత్వాలు సి.ఎఫ్.ఎమ్.ఎస్ పేరుతో తన చేతుల్లోనే ఉంచుకుంటోంది. గ్రామాల్లో అనేక అత్యవసర పనులు చేయడానికి కూడా నేడు సర్పంచులు.. పాలకవర్గం, అధికారులపై ఆధారపడాల్సి వస్తోంది. స్థానిక సంస్థలకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన అనేక వాటా నిధులు ఆగిపోయాయి. గతంలో ఉన్న రాష్ట్ర ఆర్థిక సంఘం నిధులు ఇయ్యాల కనుమరుగైపోయాయి. ఇలా స్థానిక సంస్థల ద్వారా గ్రామాలకు జరగాల్సిన అభివృద్ధిని ప్రభుత్వాలు అడ్డుకుంటున్నాయి. అనేక రాజకీయ, ఆర్థిక ఒడిదుడుకులతో ప్రజా సేవ చేద్దామన్న కాంక్షతో స్థానిక సంస్థల ఎన్నికల్లో పాల్గొన్న విద్యార్హత కలిగిన అనేక మంది యువత నేడు నిరుత్సాహంగా, నిస్తేజంగా మారడానికి ప్రభుత్వ నియంతృత్వ, అధికార కేంద్రీకరణ చర్యలే కారణమవుతున్నాయి. దీన్ని వ్యతిరేకిస్తూ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు విడివిడిగా, సంఘాలుగా ఏర్పడి ఎన్ని రకాల ఉద్యమాలు చేసినా ప్రభుత్వానికి చీమకుట్టినట్లుగా కూడా లేదు. ఇటీవల ఏపీలో అన్ని గ్రామ పంచాయతీలకు చెందిన14, 15 ఆర్థిక సంఘ నిధులను సర్పంచ్ ప్రమేయం లేకుండానే వారి ఖాతాల నుంచి ప్రభుత్వం తన ఖాతాకు మళ్ళించుకున్న తీరు మార్గదర్శకాలకు విరుద్ధంగా ఉంది. తెలంగాణాలో అధికారులది స్థానిక సంస్థలకు సమాంతర పాలన ఉంటే, ఏపీలో గతంలో జన్మభూమి కమిటీలు, నేడు సచివాలయ, వలంటీర్ వ్యవస్థలు సమాంతర పాలనను కొనసాగిస్తూ పంచాయితీరాజ్ వ్యవస్థను నిర్వీర్యం దశ నుంచి నిర్జీవంగా మారుస్తున్నాయి. స్థానిక సంస్థలను బలోపేతం చేయడం ద్వారా మాత్రమే గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యం రూపుదిద్దుకుంటుంది. 
- జీ.వీరభద్రాచారి, 
జాతీయ ప్రధాన కార్యదర్శి, 
స్థానిక సంస్థల చాంబర్