వరంగల్: పల్లె ప్రగతితో రాష్ట్రంలో పల్లెల రూపురేఖలు మారాయని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. శుక్రవారం జిల్లాలోని పర్వతగిరి మండలకేంద్రంలో పల్లెప్రగతి కార్యక్రమంలో పాల్గొన్న పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు... రూ.10 కోట్లతో నిర్మించిన ప్రభుత్వ పాఠశాల భవనం, రైతు వేదిక, అంతర్గత సీసీ రోడ్లను ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... రైతు బంధు, రైతు భీమా, కాళేశ్వరం ప్రాజెక్టు, 24 గంటల కరెంట్ తో వ్యవసాయం పండగలా మారిందన్నారు. 70 ఏళ్లలో సాధ్యం కాని అభివృద్ధి కేసీఆర్ హయాంలో 7 ఏళ్లలోనే సాధ్యమైందన్నారు. అందుకు రాష్ట్రానికి వచ్చిన అవార్డులే నిదర్శనమని చెప్పారు. మన ఊరు మన బడితో సర్కారు బడులను బలోపేతం చేస్తున్నామని, కొద్దిరోజుల్లోనే కొత్త పింఛన్లు ఇస్తామని స్పష్టం చేశారు. కడియం శ్రీహరి మాట్లాడుతూ... తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ పథకాలు బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో అమలవుతున్నాయా? అని ప్రశ్నించారు. తెలంగాణ ప్రభుత్వ పాలనపై చౌకబారు విమర్శలు చేసే ప్రతిపక్ష పార్టీ నాయకులు ఆత్మవిమర్శ చేసుకోవాలని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే అరూరి రమేష్, కలెక్టర్ గోపి,స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజలు, డ్వాక్రా మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.