మన మూడంచెల రాజ్యాంగ వ్యవస్థలో గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలు ప్రజలకు దగ్గరగా పనిచేస్తున్న సంస్థలు. భారతదేశం పల్లెల్లో నివసిస్తుందని, పల్లెలు బాగుపడ్డప్పుడే దేశం బాగుపడుతుందని గాంధీజీ అనేవారు. స్వాతంత్ర్యం వచ్చిన తరువాత రాష్ట్రాలు పంచాయతీలకు రూపకల్పన చేసినా వాటికి కావలసిన నిధులు, విధానాలు, సిబ్బందిని సమకూర్చక పోవడంతో అవి కేవలం దిష్టిబొమ్మల్లాగా ఉండిపోయాయి.
రాష్ట్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీలను ఏర్పాటుచేసి, వాటిని స్వతంత్ర ప్రతిపత్తిగల సంస్థల్లా పనిచేసే విధంగా చర్యలు తీసుకోవాలని భారత రాజ్యాంగం అధికరణ 40 చెపుతున్నది. అయితే కొన్ని రాష్ట్రాలు తప్ప, చాలా రాష్ట్రాలు పంచాయతీలను బలోపేతం చేసే చర్యలు తీసుకోలేదు. రాజ్యాంగం అధికరణ 243- జి - పంచాయతీలను బలోపేతం చేయాలని ఆదేశాలు ఇచ్చింది. 11వ షెడ్యూలులో చెప్పిన విధంగా రాష్ట్ర ప్రభుత్వాలు 29 శాఖలకు సంబంధించిన పనులు గ్రామ పంచాయతీలకు బదలాయింపు చేయాలని చెప్పడం జరిగింది.
గ్రామ పంచాయతీలను బలోపేతం చేయడానికి కేంద్రం 1992లో రాజ్యాంగ సవరణ చేసి గ్రామపంచాయతీలు, మున్సిపాలిటీలకు రాజ్యాంగభద్రత కల్పించింది.
అంటే, ఏవిధంగా పార్లమెంట్, రాష్ట్ర శాసనసభకు క్రమం తప్పకుండా ఎన్నికలు జరుగుతాయో అలాగే పంచాయతీలకు, మున్సిపాలిటీలకు కూడా వాటి పదవీ కాలం ముగిసే ముందే ఎన్నికలు జరపాలి. కొత్తపాలక వర్గం పాత వారి పదవీకాలం ముగిసేనాటికి సిద్ధంగా ఉండాలి.
పంచాయతీలకు నిధుల కొరత
తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు రాష్ట్రంలో సుమారు ఎనిమిదివేల గ్రామపంచాయతీలు ఉండేవి. చాలా పంచాయతీలు నిధుల లేమితో అధికారాలు బదిలీ కాక నామమాత్రంగా ఉండేవి. కేంద్రం నుంచి పంచాయతీలకు ఆర్థిక సంఘం నిధులు అలాగే ఉపాధి హామీ పథకం కింద వచ్చే నిధులతో కొన్ని పనులు జరిగేవి. అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నవాటిని బలోపేతం చేయడం మరచి ఇంకా నాలుగువేల గ్రామ పంచాయతీలను ఏర్పాటు చేసింది. రెండు వందల జనాభాలేని గ్రామాలను కూడా పంచాయతీలుగా చేసి రాజకీయ నాయకులకు ఉద్యోగాలు కల్పించడం తప్ప పంచాయతీలకు ఎటువంటి లాభం కలుగలేదు.
ఇది ఎలా ఉందంటే ఆకలవుతుంది అన్నం పెట్టు ప్రభు అంటే.. అన్నం లేదు కానీ ఆకలి కాకుండా మందు ఇస్తానన్న చందంగా ఉంది. రాజ్యాంగం అధికరణ 243–1 ప్రకారం రాష్ట్ర ఆర్థికసంఘం పంచాయతీల అవసరాలను గుర్తించి వాటికి కావలసిన నిధులను రాష్ట్ర బడ్జెట్ నుంచి విడుదల చేయడానికి ప్రభుత్వానికి నివేదిక ఇస్తుంది. ఈ నివేదికను రాష్ట్ర అసెంబ్లీ ముందుంచి చర్చించాలి. దానితో విషయాలు ప్రజలకు తెలుస్తాయి. కానీ, గత పది సంవత్సరాలలో ఒక్కటంటే ఒక్క రాష్ట్ర ఆర్థికసంఘం నివేదికను అసెంబ్లీ ముందు ఉంచడంగాని, ఆర్థిక సంఘం సూచించిన ప్రకారంగా గ్రామపంచాయతీలకు నిధులు విడుదల చేయడంకాని జరుగలేదు.
పంచాయతీ ఎన్నికలు జరిపించాలి
ప్రస్తుత గ్రామపంచాయతీల కాలపరిమితి జనవరి 2024 నాటికి ముగుస్తుంది. అంటే కాలపరిమితి ముగిసేనాటికి మూడు నెలల ముందు నుంచే రాష్ట్ర ఎన్నికల సంఘం చర్యలు చేపట్టాలి. గత ప్రభుత్వం 2018లో ప్రభుత్వ అనుమతి తీసుకొని మాత్రమే రాష్ట్ర ఎన్నికల సంఘం పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని ఒక రాజ్యాంగ విరుద్ధమైన ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అంటే ప్రభుత్వం తనకు అనుకూలమైనప్పుడు మాత్రమే పంచాయతీ ఎన్నికలు జరిపే వెసులుబాటు ఏర్పడింది.
ఈ ఆదేశాలతో రాష్ట్ర ఎన్నికల సంఘం తన స్వతంత్ర ప్రతిపత్తిని కొల్పోయి, ప్రభుత్వంలో ఒక శాఖగా మారిపోయింది. కొత్తగా ఏర్పడ్డ రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీ ఎన్నికలు వీలైనంత తొందరగా జరిపించాలి. సర్పంచ్‌లకు బాకీ పడ్డ రూ.1200 కోట్ల నిధులు మంజూరు చేయాలి. అలాగే రాజ్యాంగం చెప్పినట్టు 29 శాఖల పనులను వారికి బదిలీ చేయాలని, కలెక్టర్లు సర్పంచ్‌లను తొలగించే అధికారాలు చాలా జాగ్రత్తగా వాడేవిధంగా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కోరుతున్నాను.
పక్షపాత ధోరణి
ఒక పద్ధతి అంటూ లేకుండా గత ప్రభుత్వ పెద్దలు తమకు తోచినంత, తమకు కావలసిన పంచాయతీలకు నిధులు విడుదల చేయడం జరిగింది. పంచాయతీలకే కాక శాసనసభ నియోజకవర్గాలకు కూడా పక్షపాత ధోరణితో గత ముఖ్యమంత్రి వద్ద పదివేల కోట్లు పెట్టుకొని కొన్ని నియోజకవర్గాలకు వందల కోట్లు మంజూరు చేయడం, కొన్నింటికి మొండిచేయి చూపించడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో గ్రామపంచాయతీలు ఎప్పుడూ స్వయం ప్రతిపత్తితో పాలన చేయలేదు. చాలా సందర్భాలలో స్థానిక శాసనసభ్యుడి కనుసన్నలలో నడచినాయి.
2018వ సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వం కొత్త పంచాయతీ చట్టం తీసుకువచ్చింది. ఈ చట్టం సెక్షన్ 37 ప్రకారం జిల్లా కలెక్టర్లకు సర్పంచ్‌లపై విస్తృత అధికారాలు ఇవ్వడం జరిగింది. కలెక్టర్ ఆదేశాలు సర్పంచ్ అమలు చేయకున్నా, అధికార దుర్వినియోగం వంటి సందర్భాలలో సర్పంచ్‌ను పదవి నుంచి తొలగించవచ్చు. కొన్ని సందర్భాలలో సర్పంచ్‌లు స్థానిక శాసనసభ్యునికి అనుకూలురు కానప్పుడు శాసనసభ్యుడు కలెక్టర్‌కు ఫిర్యాదు చేయడం, దానిపై కలెక్టర్ సర్పంచ్‌ను పదవి నుంచి తొలగించడం వంటివి జరగడంతో సర్పంచ్‌లలో ఒక భయానక వాతావరణం నెలకొంది.
గ్రామపంచాయతీలపై పెనుభారం
తమ గ్రామానికి ఏమి అవసరమన్నది గ్రామసభలో అలాగే పంచాయతీలో నిర్ణయించాలి. కానీ, హైదరాబాద్ నుంచి నిర్ణయం తీసుకోవడం వంటివి జరిగినాయి. ప్రతి గ్రామంలో ఒక ట్రాక్టర్, ట్యాంకర్ వంటివి కొనాలని హైదరాబాదు నుంచి ఆదేశాలు రావడంతో అవసరమున్నా లేకున్నా కొనడంతో గ్రామపంచాయతీలకు పెనుభారమైంది. అలాగే ఇతర పనులు, తగినంత నిధులు లేకున్నా పనులు చేయాలని చెప్పడంతో విధి లేక సర్పంచులు అప్పు, సప్పు చేసి పనులు చేయించారు. నిధుల విడుదల లేక అప్పులు పెరిగిపోవడంతో చాలా మంది సర్పంచ్‌లు ఇబ్బంది పాలవుతున్నారు.
రాష్ట్రం మొత్తంపై గ్రామపంచాయతీలకు 2023 నాటికి ఇవ్వవలసిన పెండింగ్ బిల్లులు రూ.1200 కోట్లకు పైబడి ఉన్నాయి. ఉన్నత ఆశయాలతో పంచాయతీలలో 50% సీట్లు మహిళలకు రిజర్వు అయ్యాయి. దానితో 50% సర్పంచ్‌లు మహిళలే కాని అమలులో మాత్రం అందుకు భిన్నంగా ఉంది. మహిళా సర్పంచ్‌ను పక్కన పెట్టి ఆమె భర్త లేదా కొడుకు సర్పంచ్‌గా చెలామణి అవుతున్నారు. మండలస్థాయి అధికారులు స్థానిక శాసనసభ్యుడు కూడా వారిని మీటింగులకు అనుమతిస్తున్నారు. మహిళా సాధికారత ఆశయం సిద్ధించడం లేదు.
- ఎం.పద్మనాభరెడ్డి,
ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్