బాలీవుడ్​కి వెబ్​సిరీస్​ల దెబ్బ?

బాలీవుడ్​కి వెబ్​సిరీస్​ల దెబ్బ?

పంచాయత్​, కోటా ఫ్యాక్టరీ, గుల్లక్​, ఆస్పిరెంట్స్​... ఈ వెబ్​సిరీస్​ల నయాసీజన్​ ఎప్పుడెప్పుడు మొదలవుతుందా అని ఎదురుచూస్తారు ఆడియెన్స్​. హై బడ్జెట్​తో తీసే బాలీవుడ్​ సినిమాలకంటే కూడా అతి తక్కువ బడ్జెట్​తో తయారవుతున్న టీవీఎఫ్​ వెబ్​ సిరీస్​ల మీద ఆడియెన్స్​కి అంత ఆసక్తి ఎందుకు?
 బాలీవుడ్​ సినిమాలని కాదని ఈ సిరీస్​లను ఇష్టపడడానికి కారణం ఏంటి? ఈ మార్పు ఎప్పుడు? ఎలా? మొదలైంది? అది తెలియాలంటే టీవీఎఫ్​(ది వైరల్​ ఫీవర్​) యూట్యూబ్​ ఛానెల్​ గురించి, దాని ఫౌండర్​ అరుణభ్​ కుమార్​ గురించి తెలుసుకోవాలి. 

అరుణభ్​ యుఎస్​ ఎయిర్​ఫోర్స్​లో రీసెర్చ్​ కన్సల్టెంట్​గా పనిచేసేవాడు. ఆ ఉద్యోగం వదిలేసి యూట్యూబ్​ ఛానెల్​ మొదలుపెట్టాడు. అదేంటది మంచి ఉద్యోగం వదిలేసి యూట్యూబ్​ఛానెల్​ పెట్టడం ఏంటి? పిచ్చి కానీ పట్టలేదు కదా? అంటున్నారా. అతను ఆ పని చేసినప్పుడు చుట్టుపక్కల వాళ్లంతా కూడా అచ్చం అలానే అనుకున్నారు. కానీ​ రీసెర్చ్​ కన్సల్టెంట్​గా పనిచేస్తున్న అరుణభ్​కి ఆ పని ఆనందాన్ని ఇవ్వలేదు. అందుకే మనసుకి తృప్తినివ్వని ఉద్యోగానికి రిజైన్​ చేశాడు. ‘ది వైరల్​ ఫీవర్​ (టీవీఎఫ్)​ పేరుతో యూట్యూబ్​ ఛానెల్​ మొదలుపెట్టాడు. అతను తీసుకున్న ఆ నిర్ణయం చూసి బంధువులు, చుట్టుపక్కల వాళ్లంతా నవ్వుకున్నారు. హేళనగా మాట్లాడారు. కానీ ఇప్పుడు వాళ్లే అరుణభ్​ను మెచ్చుకుంటున్నారు. ఎందుకంటే టీవీఎఫ్​ అనేది ఇండియాలో సక్సెస్​ఫుల్​ యూట్యూబ్​ ఛానెల్​, ఓటీటీ ప్లాట్​ఫామ్. సక్సెస్​ ఒక్కటేకాదు ఇండియన్​ కంటెంట్​ క్రియేషన్​లో ఒక విప్లవాన్ని తీసుకొచ్చింది టీవీఎఫ్​. 

అరుణభ్​ 2001లో ఐఐటి ఖరగ్​పూర్​లో ఇంజినీరింగ్ చదివాడు. అప్పట్లోనే థియేటర్​ గురించి ఆలోచించేవాడు. చదువుకంటే కూడా థియేటర్​, స్టోరీ టెల్లింగ్ మీద ఆసక్తిగా ఉండేది. ఈ రంగంలోనే ఏదైనా చేయాలి అనుకున్నాడు. కానీ అందరు తల్లిదండ్రులకు మల్లేనే అరుణభ్​ పేరెంట్స్​ కూడా కొడుకు ఇంజినీరింగ్​ చదువు పూర్తయ్యాక మంచి ఉద్యోగంలో చేరి స్థిరపడాలి అనుకున్నారు. దాంతో అమ్మానాన్నల కలని తీర్చే పనిలోపడ్డాడు అరుణభ్​. అమెరికాలో ఉద్యోగంలో చేరాడు. ఉద్యోగంలో అయితే చేరాడు కానీ అతని ధ్యాస మాత్రం చేస్తున్న పని మీద లేదని బాగా అర్థమైంది. ఉద్యోగాన్ని వదిలి, అమెరికాను వదిలేసి ముంబయికి వచ్చేశాడు. ఎన్నో కలలతో ముంబయిలో అడుగుపెట్టాడు. కానీ పోరాటం లేకుండా కలలు నిజం కావడం అంటే అంత సులువు కాదు కదా! తను ఎంచుకున్న రంగంలో అడుగుపెట్టేందుకు మొదట్లో బాగానే కష్టపడ్డాడు అరుణభ్​. ప్రొడక్షన్​ హౌస్​లకు ఉత్తరాలు రాశాడు. ఒక్కొక్కళ్ల దగ్గరకు వెళ్లి కలిశాడు. కానీ ఎక్కడా పని దొరకలేదు. అలా ట్రై చేయగా చేయగా చివరికి షారుక్ ఖాన్​ ‘రెడ్​ చిల్లీస్​ ఎంటర్​టైన్​మెంట్​ ప్రొడక్షన్​ హౌస్​’లో పని దొరికింది. ‘ఓం శాంతి ఓం’ సినిమాకు ఫరా ఖాన్​ దగ్గర అసిస్టెంట్​ డైరెక్టర్​గా పనిచేసే అవకాశం వచ్చింది. ఈ ప్రొడక్షన్​ కంపెనీలో అరుణభ్​ చాలా నేర్చుకున్నాడు. అందుకనే దాన్ని తన కెరీర్​ స్కూల్ అంటాడు. అక్కడ కొంతకాలం పనిచేశాక బయటకు వచ్చి చిన్నా చితకా పనులు చేశాడు. కానీ సరైన పని లేక ఆర్ధిక ఇబ్బందులు ఎదురయ్యాయి. దాంతో యుఎస్​ ఎయిర్​ఫోర్స్​లో పనిచేసిన అరుణభ్​ రోజువారీ ఖర్చుల కోసం గోవాలో ఒక క్లబ్​లో వెయిటర్​గా పనిచేశాడు. అలా సమస్యల మీద సమస్యలు పెరుగుతూనే పోయాయే తప్ప తన కల నెరవేర్చుకునేందుకు దారి కనిపించలేదు. అలా ఏం అర్థంకాని పరిస్థితుల్లో ఉన్నప్పుడు 2010లో ‘టీవీఎఫ్​ మీడియా ల్యాబ్’​ పేరుతో యూట్యూబ్​ ఛానెల్​, ఓటీటీ మీడియా సర్వీస్​ మొదలుపెట్టాడు. అలా ‘ది వైరల్ ఫీవర్​’కి నాందిపడింది. 2012, ఫిబ్రవరిలో కొందరు పార్టనర్స్​తో కలిసి మొదటి వీడియో ‘రౌడీస్’​ తీశాడు. ఇది పాపులర్​ టీవీ రియాలిటీషో ‘రోడీస్​’ మీద చేశారు. ఆ వీడియో బాగా వైరల్​ అయ్యింది. అలా టీవీఎఫ్​ సక్సెస్​కు దారులు ఏర్పడ్డాయి. అలా వైరల్​ వీడియోలు కొన్ని చేశాక అక్టోబర్​ 31, 2014లో ఇండియాలో మొదటి వెబ్​సిరీస్​ ‘పర్మనెంట్​ రూమ్​మేట్స్​’ తీశాడు. అలా భారతదేశంలో మొదటి వెబ్​సిరీస్​ కాన్పెప్ట్​ని పరిచయం చేసింది టీవీఎఫ్​. దాన్ని 50 మిలియన్ల కంటే ఎక్కువమంది చూశారు. మరెందరో మనసులు దోచేసింది. 2015లో ‘పిచర్స్’ అనే​ వెబ్​ సిరీస్​ తీశారు​. ఇదయితే ఐఎండిబీ టాప్​ 250 షో లిస్ట్​లో చోటుచేసుకున్న మొట్టమొదటి ఇండియన్​ వెబ్​ సిరీస్​.

ఇప్పుడు చూస్తే...

టీవీఎఫ్​ అనేది అందరికీ ఎంతో పరిచయమైపోయిన పేరు ఇప్పుడు. ఇండియాలో ప్రతి ఇంట్లో టీవీఎఫ్​ షోస్​ చూస్తున్నారు. ఈ కంపెనీ తీసే వెబ్​సిరీస్​ల్లో భారీ సెట్స్​ ఉండవు. సూపర్​స్టార్​ యాక్టర్స్​ ఉండరు. ఖర్చుతో కూడిన వీఎఫ్​ఎక్స్​ ఎఫెక్ట్స్​ ఉండవు. ఫ్యాన్సీ స్టోరీలు ఉండవు. ఇవేవీ లేకపోయినా టీవీఎఫ్​ వెబ్​సిరీస్​లన్నీ సూపర్​ హిట్​ అవుతున్నాయి. ఆ సిరీస్​ల్లో డైలాగ్స్​ ప్రేక్షకుల నోట్లో నానుతుంటాయి. వాటికి అంత క్రేజ్​ రావడానికి కారణం ఏంటి? బాలీవుడ్​కి చెందిన హై బడ్జెట్​ సినిమాలన్నీ పక్కన పెట్టి మరీ ప్రేక్షకులు వీటిని ఎందుకు ఇష్టపడుతున్నారు అంటే ప్రధానంగా కొన్ని కారణాలు ఉన్నాయి. అవి... 

ప్రేక్షకులు పోల్చుకుంటారు 

టీవీఎఫ్​ షోస్​ చాలావరకు మన జీవితాలకు అన్వయించుకునేలా ఉంటాయి. సిరీస్​ల్లో ఉండే సీన్స్​ చూస్తే ‘అరే ఈ పని నేను కూడా చేస్తున్నా కదా’ అనుకోకుండా ఉండరు ఆడియెన్స్​. ఉదయాన్నే అమ్మ తిట్లతో నిద్ర లేవడం, తోబుట్టువులతో గట్టి, చిలిపి తగాదాల వంటివి చూసిన ప్రేక్షకుడికి ఇదంతా మన కథలానే ఉందే అనిపిస్తుంది. ‘యాస్పిరెంట్స్’​ సిరీస్​ చూసి ఉంటే కనుక క్యారెక్టర్​ను ఎంత డీప్​గా ఎక్స్​ప్రెస్​ చేస్తారనేది అర్థమవుతుంది. అలాగే సిటీలో ఉన్నవాళ్లు సెలవులు వచ్చినప్పుడు సొంతూరికి వెళ్లాలనుకున్నప్పుడు  ‘పంచాయత్​’లో సచివ్​, అభిషేక్​ త్రిపాఠి జీవితలతో రిలేట్​ చేసుకుంటారు. గ్రామంలో ఉండే మనుషులతో అడ్జస్ట్​ అయ్యేందుకు ఎలాంటి తిప్పలు పడాలో చూస్తుంటే ఆడియెన్స్​ కనెక్ట్​ కావడం ఖాయం. వేసవికాలంలో రాత్రి కరెంట్ పోతే దోమల్ని కొట్టుకుంటూ నిద్ర లేకుండా జాగారం చేయడం వంటివి పల్లెజీవితాలతో సంబంధం ఉన్న వాళ్లకు బాగా అర్థమవుతుంది. పంచాయత్​ సిరీస్​ చూశాక చాలామంది ‘ఇది మా గ్రామపంచాయతి కథలా ఉందే’ అనుకున్నారు అంటే అతిశయోక్తి కాదు. అంటే ఆడియెన్స్​ని టీవీఎఫ్​ వెబ్​సిరీస్​లు ఎంతలా కనెక్ట్​ చేస్తున్నాయో అర్థమవుతుంది. ప్రతి రోజు మనుషుల జీవితాల్లో ఎదురయ్యే పరిస్థితులను ఒడిసి పట్టి రీల్​కి ఎక్కిస్తున్నారు. రియల్​ ఎమోషన్స్​ను కథలో కలిపి చూపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. 

మరి ఇలాంటి అంశాలు బాలీవుడ్​ సినిమాల్లో ఎందుకు మిస్​ అవుతున్నాయి? బాలీవుడ్​ సినిమాల్లో ఎక్కువ శాతం వాస్తవానికి దూరంగా ఉండే సన్నివేశాలు, కథలు, వస్త్రధారణ, స్టోరీ ఉంటున్నాయి. అంటే నిజజీవితాలకు దూరంగా ఉండే సినిమాలను ప్రేక్షకులు ఓన్​ చేసుకోలేకపోతున్నారు. ఉదాహరణకి పరీక్షలు పాసయితే దోస్తులతో కలిసి పూల్​​పార్టీ చేసుకుంటారా సామాన్యులు ఎవరైనా? అలాగే చదువు ఒత్తిడిలో ఉన్న స్టూడెంట్స్​కి సిక్స్​ప్యాక్​ యాబ్స్​ గురించి ఆలోచించే టైం ఉంటుందా? లగ్జరీ కార్లో కాలేజీ క్యాంపస్​కి వెళ్లే స్టూడెంట్స్​ ఎంతమంది? అమ్మాయిలు స్టయిల్​ బట్టలు వేసుకుని ఇలాంటి వాళ్ల వెంట వెళ్తారా?  ఇలా ఒకటేంటి ఎన్నో అంశాలు వాస్తవ జీవితాలకు దూరంగా చూపిస్తున్నారు. నిజానికి పరీక్షల్లో మంచి మార్కులు వస్తే ఫ్రెండ్స్​తో కలిసి పానీపూరీ, సమోసా తింటారు. అంతకంటే ఎక్కువ ఇంకేదైనా సాధిస్తే ఇంటి చుట్టుపక్కల వాళ్లకు స్వీట్లు పంచుతారు. బాలీవుడ్​ మిస్​ అయ్యే అలాంటి అంశాలన్నింటినీ టీవీఎఫ్​ వెబ్​సిరీస్​లు పట్టుకుని సక్సెస్​ అవుతున్నాయి. భారతీయ సమాజంలో రకరకాల మనుషులు, సంస్కృతులను రిప్రజెంట్​ చేస్తున్నాయి టీవీఎఫ్​ సిరీస్​లు. డైలాగ్స్​ ఎంతో ఈజీగా ఉండి ఒక్కసారి వింటే చాలు ఆడియెన్స్​కి గుర్తుండిపోతున్నాయి. అంతేనా ఆ డైలాగ్స్​తో తయారయ్యే మీమ్స్​ కూడా ఏళ్ల తరబడి సోషల్​ మీడియాలో తిరుగుతూనే ఉంటున్నాయి. 

ఫ్రెష్​ టాలెంట్​

టీవీఎఫ్​ ఏ వెబ్​ సిరీస్​ చూసినా స్టార్​ కాస్టింగ్​ కనిపించదు. ముక్కుమొఖం తెలియని ఆర్టిస్ట్​ ఆ రోల్​ ప్లే చేస్తారు. నటులే కాదు​ రైటర్​, డైరెక్టర్లు కూడా కొత్త వాళ్లకే అవకాశం ఇస్తారు. ఈ ప్రొడక్షన్​ హౌస్​తో కలిసి పనిచేశాక వాళ్లు పేరు సంపాదించుకుంటారు. ఉదాహరణకు ‘పంచాయత్​’లో ప్రహ్లాద్​ చాచా గుర్తున్నాడా? ఇతని అసలు పేరు ఫైజల్​ మలిక్​. ఇతని జీవితంలో సినిమా కథ కంటే ఎక్కువ కష్టాలే ఉన్నాయి. జేబులో పైసలు లేవు. కిడ్నీలు ఫైయిలై సోదరుడు చనిపోయాడు. దాన్నుంచి బయట పడకముందే పరీక్షల్లో ఫెయిలైన సోదరి ఆత్మహత్య చేసుకుంది. ఆ విషాదం నుంచి బయటకు వచ్చి సాధారణ జీవితం గడిపేందుకు ఫైసల్​కు చాలానే టైం పట్టింది. ఆ పోరాటంలో సినిమా ఇండస్ట్రీ వైపుకు వచ్చాడు. ఈ రంగంలో పని దొరకడం అంత ఈజీ కాదు. వెతకగా వెతకగా కొన్నాళ్ల తరువాత ప్రముఖ మ్యూజిక్ కంపోజర్​, సింగర్​ కైలాష్​ ఖేర్​తో పరిచయం అయ్యింది. ఆయన ‘సహారా’ ఛానెల్​లో ఎడిటర్​ ఉద్యోగం ఇప్పించాడు ఫైసల్​కి. కానీ ‘గ్యాంగ్స్​ ఆఫ్​ వాసేపూర్​’లో  ఫైసల్​కి పోలీస్​ పాత్ర రావడంతో అతని తలరాత మారింది. పాత్ర నిడివి తక్కువే అయినా తన నటనతో అందరి దృష్టినీ ఆకర్షించాడు  ఫైసల్. ఆ తరువాత ‘పంచాయత్​’ సిరీస్​లో ప్రహ్లాద్​ పాత్ర వేశాడు. 

అలాగే ఇంకో నటుడు వినోద్​ ఒకే ఒక్క సీన్​తో ఫేమస్​ అయ్యాడు. వినోద్​ మీమ్స్​ ఇంటర్నెట్​లో చాలానే చూసి ఉంటారు. వినోద్​ జీవితంలో రియల్​ స్ట్రగుల్​ ఉంది. వినోద్​ అసలు పేరు అశోక్​ పాఠక్​. చదువుకోమని12వ తరగతిలో అమ్మానాన్న చేర్చారు. కానీ థియేటర్​ వైపు అతని అడుగులు పడ్డాయి. అతని నటన చాలా బాగుంటుంది. అందుకని కొందరు ‘నువ్వు ముంబయి పోయి యాక్టింగ్ చెయ్యి’ అని సలహా ఇచ్చారు. అలా అందరి ప్రోత్సాహంతో 40 వేల రూపాయలు పోగుచేసుకుని ముంబయిలో అడుగుపెట్టాడు. మొదటిసారి ‘హైవే’ సినిమాలో ఒక చిన్న పాత్ర దొరికింది. అలా ఆ తరువాత కూరగాయలు అమ్మే వ్యక్తి, సెక్యూరిటీ గార్డు, డ్రైవర్​ వంటి రోల్స్​ చేస్తూ ఉన్నాడు. అతని మీద టీవీఎఫ్​ దృష్టి పడేవరకు చిన్న పాత్రలే చేశాడు. టీవీఎఫ్​లో చేరి ‘పంచాయత్​’లో రోల్​కి ఎంపికయ్యాడు. మొదటి సీజన్​లో వినోద్​ఎంత ఫేమస్​ అయ్యాడో తెలిసిందే. దాంతో ఆ తరువాత 2, 3 సీజన్లలో వినోద్ స్క్రీన్​టైం పెంచేశారు. ఆ తరువాత మంచి అవకాశాలు మొదలయ్యాయి. ‘సిస్టర్​ మిడ్​నైట్’ స్క్రీనింగ్​ కోసం 2024లో ఫ్రాన్స్​కి కాన్​ సిటీకి వెళ్లాడు. ఇందులో రాధికా ఆప్టే కూడా చేసింది. ఆ మూవీ అక్కడి ప్రేక్షకులకు విపరీతంగా నచ్చేసింది. అది ఎంతగా అంటే స్క్రీనింగ్ పూర్తయిన పది నిమిషాలు స్టాండింగ్ ఒవేషన్​ అందుకున్నాడు వినోద్​.


దుర్గేష్​ కుమార్​ ‘పంచాయత్’​లో భూషణ్​ రోల్​ చేశాడు. ‘సుల్తాన్​, హైవే, ఫ్రీకీ’ వంటి సినిమాల్లో చిన్నాచితకా పాత్రలు వేసినా అతనికి గుర్తింపు రాలేదు. కొన్నిసార్లు అయితే రోల్​ కోసం కాస్టింగ్ డైరెక్టర్​ కాళ్లమీద పడి ప్రాధేయపడిన రోజులు కూడా ఉన్నాయి. అది చూసి ఆయన దోస్త్​లు కూడా భయపడ్డారు. కానీ జీవితం గడవాలంటే పైసలు అవసరం. ఆ డబ్బు సంపాదించడం కోసం మనుషులు ఎంత దూరం అయినా వెళ్తారు. రైటర్స్​, యాక్టర్స్​ కొన్ని వందల రిజెక్షన్స్​ చూసి ఉంటారు. కానీ అప్పటికీ ఇండస్ట్రీలో అవకాశాల కోసం ట్రై చేస్తూనే ఉంటారు. అలాంటి ఎందరిలోని టాలెంట్​ను టీవీఎఫ్​ బయటకు తీసింది. ఇండస్ట్రీలో వీళ్లు ఉన్నారని తెలియని ఎందరో టీవీఎఫ్​ ద్వారా పాపులారిటీ సంపాదించుకోగలిగారు. 

సక్సెస్​ వెనక హ్యూమర్​

బాగా రాసిన సీన్​కి హ్యూమర్​ కలిస్తే ఆడియెన్స్​ ఎంజాయ్​ చేస్తారు. ఆ సీన్స్​లో వల్గారిటీ ఉండదు. పిచ్చి జోక్స్​ ఉండవు. నేచురల్​ డైలాగ్స్, చిన్న చిన్న ఎక్స్​ప్రెషన్స్​ ఉంటాయి. అవన్నీ కలిసి ఆడియెన్స్​ను నవ్వుల్లో ముంచెత్తుతాయి. టీవీఎఫ్ నుంచి​ వెబ్​సిరీస్​లు బయటకొచ్చాక వాటి షార్ట్​ వీడియో క్లిప్స్​ సోషల్​ మీడియాలో తెగ వైరల్​ అవుతాయి. 

ఆ ప్రేక్షకులే టార్గెట్​

18 నుంచి 35 సంవత్సరాల ఏజ్​గ్రూప్​ ఆడియెన్స్​ను దృష్టిలో పెట్టుకుని సిరీస్​ చేస్తుంది టీవీఎఫ్​ ప్రొడక్షన్​. ఎందుకంటే.. ఈ ఏజ్​గ్రూప్​ వాళ్లు రోజుకి సరాసరి మూడు గంటలు.. ఆ పైన వీడియో కంటెంట్​ చూస్తుంటారు. వాళ్ల​ను ఎలా ఆకట్టుకోవాలో టీవీఎఫ్​కి బాగా తెలుసు. అందుకనే సిరీస్​ ఎపిసోడ్స్​ను యూట్యూబ్​లో ఫ్రీగా అప్​లోడ్​ చేస్తారు. ఫైనల్​ ఎపిసోడ్స్​ మాత్రం ‘టీవీఎఫ్​ ప్లే’ యాప్​లో అప్​లోడ్​ చేస్తారు. నెక్స్ట్ ఏం జరుగుతుందనే క్యూరియాసిటీ కొద్ది జనాలు ఆ యాప్​ డౌన్​లోడ్​ 
చేసుకుంటారు. భలే మార్కెట్​ టెక్నిక్​ కదా! టీవీఎఫ్​ టీంలో మల్టీటాలెంటెడ్​ వ్యక్తులు ఉంటారు. ‘పంచాయత్’​ డైరెక్టర్​ దీపక్​ కుమార్​ మిశ్రానే చూస్తే.. అతను రైటర్​. అవసరం పడితే యాక్టింగ్​ కూడా చేస్తాడు. 

బాలీవుడ్​లో పెద్ద ప్రొడక్షన్​ కంపెనీలు​ తీసే సినిమాల్లో చూపించినట్టు స్టూడెంట్స్​ లగ్జరీ కాలేజీల్లో చదువుకోరు. మామూలు​ కాలేజీల్లో చదువుకుంటారు. ఆ కాలేజీల్లో ఫ్యాన్సీ స్విమ్మింగ్ పూల్స్​ ఉండవు. కాలేజీలకు లగ్జరీ కార్లలో రారు. సగటు భారతీయుల కాలేజీ లైఫ్​ అంతా స్కూటీ మీద నడుస్తుంది. ఈ విషయం టీవీఎఫ్​ బాగా అర్థం చేసుకుంది. అందుకే ఆడియెన్స్​ టీవీఎఫ్​ కథలతో కనెక్ట్​​ అవుతున్నారు. టీవీఎఫ్​ వెబ్​సిరీస్​లు ప్రేక్షకుల హృదయాల్లో గట్టి పీఠం వేసుకుని కూర్చుంటున్నాయి. బాలీవుడ్​ సినిమాలు నిజ జీవితాలకి దూరంగా ఉండడంతో సగటు ప్రేక్షకులు కూడా వాటికి దూరంగానే ఉంటున్నారు. 

 ప్యాండెమిక్ ఎఫెక్ట్ ఎంత?

ప్యాండెమిక్ ఎఫెక్ట్ వల్ల థియేటర్​కి రావడం తగ్గిపోయింది. ఇంట్లోనే టీవీల్లో చూడొచ్చు అనుకుంటున్నారు. అది ఫైనాన్షియల్​గా ప్రభావం చూపించింది. 2019లో థియేటర్ రెవెన్యూ గ్లోబల్​గా చూసుకుంటే 42.3 బిలియన్ డాలర్లు ఉంటే, అది 2020 నాటికి 12 బిలియన్ డాలర్లకు పడిపోయింది. సింగిల్ స్క్రీన్ సినిమాలు ప​దివేల నుంచి ఏడు వేలకు పడిపోయాయి. అంతేకాదు.. 2018లో 28 శాతం మంది ఫస్ట్​ టైం మూవీని థియేటర్​లో చూసేవాళ్లు ఉన్నారు. అది14 శాతానికి పడిపోయింది 2020లో. అలాగే 36 శాతం మంది మాత్రమే కచ్చితంగా థియేటర్​లోనే సినిమా చూడాలి అనుకుంటున్నారు. దీనికి కారణం థియేటర్ టికెట్లు పెరిగాయి. థియేటర్​కి వెళ్లడానికి ట్రావెల్ ఖర్చులు. అక్కడ ఏవైనా తినడానికి కొనుక్కోవడం.

అరుణభ్​ యూట్యూబ్​ ఛానెల్​ మొదలుపెట్టకముందు ముంబయికి వెళ్లేందుకు టికెట్​ డబ్బుల కోసం గోవాలోని ఒక క్లబ్​లో వెయిటర్​గా పనిచేశాడు. టీవీఎఫ్​ అనేది రాత్రికి రాత్రి సక్సెస్​ సాధించలేదు. టీవీఎఫ్​ వెబ్​ సిరీస్​ల్లో కనిపించిన ప్రహ్లాద్​ చాచా, వినోద్​, భూషణ్​ వంటి నటులు రియల్​ లైఫ్​ స్ట్రగుల్​ తెలుసుకుంటే... ‘జీవితంలో అన్నీ సాధ్యమే’ అంటారు.