భారతీయ సాంస్కృతిక వైభవం వెనుక మన మహర్షులు, చింతనాపరుల కృషి ఉన్నది. వారు తమ త్యాగాలతో జ్ఞానాన్ని మానవాళికి అందజేసి భౌతిక,ఆధ్యాత్మిక విలువలను ధర్మం పునాదిగా అభివృద్ధి పరిచారు. ఈ మహానుభావుల తాత్వికచింతనల సమాహారమే ఇండియన్ ఫిలాసఫీ. అదే బాటలో పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ప్రచారక్, భారతీయ జనసంఘ్ జాతీయ ప్రధాన కార్యదర్శి, జాతీయ అధ్యక్షుడిగా ఈ భారతీయ దర్శనాన్ని ఇంటిగ్రల్ హ్యూమనిజం సిద్ధాంతం ద్వారా మరింత సుసంపన్నం చేశారు.
దీన్‌దయాళ్ ఉపాధ్యాయ అతి సామాన్య కుటుంబంలో 1916 సెప్టెంబర్ 25న జన్మించి అసమాన్య వ్యక్తిగా ఎదిగారు. పాశ్చాత్య తత్వవేత్తల్లా(మానవుడే అన్నింటికీ కొలమానం) కాకుండా వ్యక్తి, సమాజంల సంబంధాన్ని సమగ్రంగా విశ్లేషించారు. వ్యక్తిగత జీవితం విషయంలోనే కాదు సాంఘిక జీవితం విషయంలోనూ పాశ్చాత్యులు కుటుంబం, సమాజం, మానవజాతి ఇలా అన్నిటినీ విభిన్న అంశాలుగానే చూశారు. ఒక్కో అంశం గురించీ లోతుగా అధ్యయనం చేశారు. కానీ వాటన్నింటి మధ్య ఉన్న బలమైన అనుబంధాలను పరిగణించలేదు. మనిషిని అధ్యయనం చేసేటప్పుడు కూడా శరీరం, మనసు, బుద్ధి, ఆత్మ వీటన్నింటి గురించీ విడివిడిగా లోతుగా పరిశీలించారు. కానీ మనిషి అనే వాడు ఏకకాలంలో కుటుంబంలో, సమాజంలో, సకల మానవజాతిలో, ప్రకృతిలో అన్నింటిలోనూ ఒక విడదీయలేని భాగంగా ఉంటాడన్న విషయాన్ని అర్థం చేసుకోలేదు. ఈ అవగాహనా రాహిత్యం వల్లనే మనిషికీ మనిషికీ మధ్య, దేశానికీ దేశానికీ మధ్య, మనిషికీ దేశానికీ మధ్య, మనిషికీ ప్రకృతికీ మధ్య ఇన్ని సంఘర్షణలు సంభవిస్తున్నాయి.
సబ్కా సాత్ వికాస్.. సబ్ కా విశ్వాస్
భారత ప్రభుత్వం దీన్‌దయాళ్ ఉపాధ్యాయ ఏకాత్మ మానవ దర్శనం తాత్విక సిద్ధాంతం ఆధారంగా అంత్యోదయ విధానం కింద నిరుపేదలకు ఎన్నో కార్యక్రమాలు అమలు చేస్తున్నది. ఉజ్వల యోజన ద్వారా పేదవారికి గ్యాస్, జన్ ధన్ ఖాతాలు, ప్రధాని ఆవాస్ యోజన ద్వారా పేదలకు ఇండ్లు, స్వచ్ఛ భారత్ మిషన్ ద్వారా టాయిలెట్ల నిర్మాణం, దీన్‌దయాళ్ గ్రామ జ్యోతి యోజన ద్వారా ప్రతి గ్రామానికి కరెంట్ సరఫరా, దీన్ దయాళ్ కౌశల్ యోజన ద్వారా స్కిల్ డెవలప్మెంట్ పథకాలను ప్రవేశపెట్టి, విజయవంతంగా అమలు చేస్తున్నది.
సబ్ కా సాత్, సబ్ కా వికాస్, సబ్ కా విశ్వాస్ అనే నినాదంతో అందరికీ తను నిర్దేశించిన లక్ష్యాల ఫలాలు అందించాలని భారత ప్రభుత్వం దృఢ సంకల్పంతో ముందుకు సాగుతున్నది. ఆత్మనిర్భర్ భారత్ పేరుతో రూ. 20 లక్షల కోట్ల ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించి స్వయం ఆధారిత భారత్ ప్రపంచంలో మేటిగా ఎవరిపై ఆధారపడకుండా ఆర్థిక వ్యవస్థ, మౌలిక సదుపాయాలు, సాంకేతికత తదితర అన్ని రంగాల్లో స్వశక్తిగా ఎదగడం కోసం భారత ప్రభుత్వం కృషి చేస్తున్నది. ప్రధాన మంత్రి సడక్ యోజన ద్వారా పట్టణాల రహదారుల(ఆవాసాలు) నుంచి అన్ని గ్రామీణ ప్రాంతాలను అనుసంధానించడంతో అన్ని రంగాల్లో మెరుగైన పంపిణీ, సేవలు, సౌకర్యాలు, ఉపాధి అవకాశాలు మెరుగయ్యాయి.
ఐదో ఆర్థిక శక్తిగా..
సమాజంలో ఆడ పిల్లలకు సమాన అవకాశాలు, ఉద్యోగాలు, ఉన్నతమైన విద్య అందించాలని, భ్రూణ హత్యల నిర్మూలన, స్త్రీ సాధికారత కోసం ‘బేటీ బచావో బేటీ పడావో’ నినాదంతో పథకం తెచ్చి, బాలికల కోసం ‘సుకన్య సమృద్ధి యోజన’ పథకాన్ని ప్రారంభించి.. అంగన్వాడీలను విజయవంతంగా నడుపుతూ.. పేద గర్భిణులు, బాలింతలు, పిల్లలకు పౌష్టికాహారం అందజేస్తున్నది కేంద్ర ప్రభుత్వం. ఆత్మ నిర్భర్ భారత్ లక్ష్యంతో అనేక సంక్షేమ పథకాలను అమలుపరుస్తున్నది. గరీబ్ కళ్యాణ్ పథకం కింద నిరుపేద కుటుంబాలకు ఆహారం, వంటగ్యాస్ మొదలైన ప్రాథమిక అవసరాలు తీర్చుతున్నది.
విశ్వకర్మల నైపుణ్యాలకు గౌరవం కల్పిస్తూ దేశవ్యాప్తంగా చేతివృత్తులు, సంప్రదాయ కళలతో జీవనం సాగిస్తున్న వారికి ఆర్థికసాయం అందించేందుకు కేంద్ర ప్రభుత్వం ‘పీఎం విశ్వకర్మ’ అనే సరికొత్త పథకానికి శ్రీకారం చుట్టింది. పండిట్ దీన్దయాళ్తాత్విక సిద్ధాంతాల పునాదుల మీద ఈరోజు భారత్ స్వశక్తి, స్వాభిమానం, ఆత్మనిర్బర్ భారత్ గా ప్రపంచంలోనే ఐదవ ఆర్థిక శక్తిగా ఎదిగింది.