ఇంటిగ్రల్‌ హ్యూమనిజం సిద్ధాంత కర్త..పండిట్‌ దీన్‌దయాళ్‌

అతి సామాన్య కుటుంబంలో 1916 సెప్టెంబర్‌ 25న జన్మించారు పండిట్‌ దీనదయాళ్ ఉపాధ్యాయ. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్‌లో ప్రచారక్ జీవితాన్ని ప్రారంభించి, 1951లో భారతీయ జనసంఘ్ ఏర్పడుతున్న టైంలో డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ కోరిక మేరకు ఆర్.ఎస్.ఎస్ నుండి రాజకీయ క్షేత్రం జన సంఘ్ ప్రచారకులుగా నియమితులయ్యారు. అఖిలభారత అధ్యక్షులుగా పాట్నాకు రైలులో ప్రయాణిస్తున్న దీన్ దయాళ్​ఉపాధ్యాయ 1968 ఫిబ్రవరి 11 న మొఘల్ సరాయ్ రైల్వే స్టేషన్ ప్లాట్ ఫారం వద్ద చనిపోయి ఉన్నారు. అయితే వారి మరణం గురించి ఇప్పటికీ అసలు నిజాలు తెలియలేదు.

దీనదయాల్ ఉపాధ్యాయ ఏకాత్మ మానవ దర్శనం (ఇంటిగ్రల్ హ్యూమనిజం) సిద్ధాంతాన్ని 60వ దశకంలో రూపొందించారు. ఇది వ్యక్తి నిర్మాణం, అభివృద్ధితోపాటు సమాజం నిర్మాణం, అభివృద్ధిని ధర్మ మార్గంలో నడిపిస్తుంది. ఈ సిద్ధాంతం ఆధారంగా వ్యక్తి శరీరం, మనస్సు, బుద్ధి, ఆత్మల కలయిక, సమాజం కూడా ప్రజలు అనే శరీరం, సంకల్పం అనే మనస్సు, ధర్మం అనే బుద్ధి, ఆదర్శాలు అనే ఆత్మను కలిగి ఉంటుంది. వ్యక్తితో పాటు సమాజం కూడా చతుర్విధ పురుషార్దాలను (ధర్మ, అర్థ, కామ, మోక్షం) ఆచరించినప్పుడు వ్యక్తి, సమాజం పరస్పర సహకారపూరకాలుగా ఉండి, పరస్పరం అభివృద్ధి చెంది, మానవత్వం పునాదిగా దేశం సమగ్రాభివృద్ధి చెందుతుంది. 

ధర్మమే అన్నిటికీ పునాది

భారతీయ చింతనలో ప్రధాన భాగమైన ‘ధర్మం’ చాలా విస్తృతమైన విషయం. దీనిలో అన్ని రకాల సమస్యలకు పరిష్కారం ఉంది. ‘అర్థం’ సాధించడానికి తప్పకుండా ధర్మ మార్గాన్ని అనుసరించాలి. ఈ విధంగా ధర్మం ఆచరణపైన దృష్టి కేంద్రీకరించి చతుర్విధ పురుషార్థములను సాధించి సమాజానికి సేవ చేయమని సందేశం ఇచ్చారు మన భారతీయ తత్వవేత్తలు. దీన్నే వారు ఆచరణ గురించి వివరించారు. ‘అతి సర్వత్ర వర్జయేత్’ అంటూ మహర్షులు ధర్మాన్ని స్థల, కాల, పరిస్థితుల దృష్ట్యా మార్పును ఆహ్వానిస్తూ, దీనిని ఆచరించే పద్ధతిని, సాధ్యమయ్యే రీతిలో బోధించారు. ఒక నీతిని పాశ్చాత్యులు నియంతృత్వ ధోరణి లేదా అతివాద పోకడలో బోధించారు. కాలక్రమేణ ఇది విఫలం కావడం జరిగింది. ప్రపంచ చరిత్రను పరిశీలించినప్పుడు ఈ విషయం మనకు అర్థమవుతుంది. సమాజంలో సమస్యలకు మన మహర్షులు పరిష్కారాలు చూపించి, మానవుడు మరియు సమాజాభివృద్ధిని సమపాళ్లల్లో మేళవించి అద్భుతమైన ప్రగతికి మార్గాలు చూపించారు. ఒకవైపు మానవాభివృద్ధి, మరోవైపు సమాజాభివృద్ధి ఉండేటట్లు ‘ధర్మం’ అనే విషయాన్ని విశదీకరించారు. పరస్పరం సహకారంతో మానవ జీవితాన్ని ఒక స్వర్గంగా మలుచుకోగలమని భారతీయ చింతన బోధిస్తుంది. కనుక భారతీయ విధానమే అన్ని సమస్యలకు పరిష్కారమని దీన్ దయాళ్‌ ఉపాధ్యాయ సెలవిచ్చారు. 

కుల వృత్తుల వారి జీవితాల్లో వెలుగులు..

రాబోవు 25 ఏండ్ల అమృతకాలం లక్ష్యంగా మొదటి బడ్జెట్ అన్ని వర్గాల ప్రజల ఆకాంక్షలు, కలలను నెరవేర్చే విధంగా, పీఎం విశ్వకర్మ కౌశల్ సమ్మాన్ (పీఎం వికాస్) యోజన ద్వారా కులవృత్తుల వారి జీవితాల్లో వెలుగులు నింపేందుకు ప్రస్తుత బడ్జెట్ దోహదపడుతుంది. దీనదయాళ్‌ అంత్యోదయ యోజన జాతీయ గ్రామీణ ఉపాధి మిషన్ కింద మహిళా సాధికారత కోసం 81లక్షల సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ లను క్రియేట్ చేశారు. మహిళ, శిశు సంక్షేమ శాఖకు బడ్జెట్ లో 25,448.75 కోట్లు కేటాయించారు. మహిళల రక్తహీనత సమస్యను పూర్తిగా నివారించేందుకు నిర్మూలన మిషన్ ప్రకటన, ప్రధాన మంత్రి పీవీటీజీ అభ్యున్నతి మిషన్ ప్రకటన, యువత అంతర్జాతీయ అవకాశాలు అందిపుచ్చుకునేందుకు 30 స్కిల్ ఇండియా అంతర్జాతీయ కేంద్రాలను అభివృద్ధి పరుస్తోంది. రైతులకు అగ్రికల్చర్ రుణాల టార్గెట్ 20లక్షల కోట్లకు పెంచారు. టూరిజం అభివృద్ధితో పాటు దేశ వారసత్వ సంపద, సంస్కృతి గురించి ప్రజలు తెలుసుకొనే విధంగా ‘దేఖో అప్నా దేశ్’ అనే కొత్త పథకం తెచ్చారు. భారతదేశం 2047 నాటికి ఆత్మ నిర్భర్, స్వదేశీ, స్వశక్తి, స్వాభిమానం, స్వావలంబనలతో సమృద్ధ భారత్, సమర్ధ భారత్, సంపన్న భారత్ నిర్మాణానికి కృషి చేయడమే దీనదయాల్ ఉపాధ్యాయకు ఘన నివాళి.

ఆత్మనిర్భర్‌‌ భారత్‌..

భారత ప్రభుత్వం ఇంటిగ్రల్ హ్యూమనిజం తాత్విక సిద్ధాంతం ఆధారంగా ఆత్మనిర్బర్, అంత్యోదయ భావాలతో అనేక పథకాల రూపకల్పన చేసి పేదవారికి ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందాలని, వారు ఆర్థిక స్వావలంబన సాధించాలని కృషి చేస్తోంది. ఇందులో భాగంగానే దీన్ దయాళ్‌ ఉపాధ్యాయ అంత్యోదయ విధానాన్ని అమలు చేయడంలో ఉజ్వల యోజన, జన్ ధన్ ఖాతాలు, ప్రధాని ఆవాస్, సడక్ యోజన, స్వచ్ఛ భారత్ మిషన్, దీన్ దయాళ్‌ గ్రామ జ్యోతి, కౌశల్, సుకన్య సమృద్ధి యోజన, బేటీ బచావో బేటి పడావో ఇలాంటి పథకాలతో సబ్ కా సాత్, సబ్ కా వికాస్, సబ్ కా విశ్వాస్ అనే నినాదంతో అందరికీ లక్ష్యాల ఫలాలు అందించాలన్న దృఢ సంకల్పంతో ముందుకు సాగుతూ, ఆత్మనిర్బర్ భారత్ పేరుతో 20 లక్షల కోట్ల ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించి స్వయం ఆధారిత భారత్ ప్రపంచంలో మేటిగా ఎవరిపై ఆధారపడకుండా ఆర్థిక వ్యవస్థ, మౌలిక సదుపాయాలు సాంకేతికత, జనాభా, గిరాకి ఇలా అన్ని రంగాల్లో స్వశక్తిగా ఎదగడం కోసం కృషి చేస్తోంది. 

 శ్రీశైలం వీరమల్ల,  ఉస్మానియా యూనివర్సిటీ