ఎకరం భూమి కోసం అన్న .. కొడుకును నరికి చంపిండు

  • గొడ్డలి, కత్తులతో వెంటాడి వేటాడి హత్య చేసిన చిన్నాన్న, ఆయన కొడుకు 
  • అందరూ చూస్తుండగా ఘటన  
  • ఆదిలాబాద్​జిల్లా ఇచ్చోడలో దారుణం

ఇచ్చోడ, వెలుగు : ఎకరం భూమి కోసం ఆదిలాబాద్​ జిల్లా ఇచ్చోడ మండలంలో  ఓ చిన్నాన్న, కొడుకుతో కలిసి తన సొంత అన్న కొడుకును దారుణంగా చంపాడు. సీఐ చంద్రశేఖర్, ఎస్సై శ్రీకాంత్​ కథనం ప్రకారం..ఇచ్చోడ మండలంలోని గుండివాగు గ్రామానికి చెందిన వానోల్ల లక్ష్మీబాయికి.. బిడ్డతో పాటు కెదోబా, పాండురంగ్​అనే కొడుకులున్నారు. కెదోబాను చిన్నప్పుడే గ్రామానికి చెందిన ఓ జంట దత్తత తీసుకుంది. 

కెదోబా కొడుకు ఈశ్వర్​రావు (36). ఇతడు ఇచ్చోడలోని టీచర్స్​కాలనీలో ఉంటూ వ్యవసాయం చేసుకుంటున్నాడు.  లక్ష్మీబాయికి నాలుగున్నర ఎకరాల భూమి ఉంది. ఈమెను ఎవరూ చూసుకోకపోవడంతో ఇచ్చోడలోని మనవడైన ఈశ్వర్​రావు దగ్గర ఉంటోంది. ఆమెకున్న నాలుగు ఎకరాల్లో ఏడాది కింద కూతురికి అరెకరం, చిన్న కొడుకు పాండురంగ్​కు మూడెకరాలు, మరో ఎకరం భూమిని తనను పోషిస్తున్నందున మనవడు ఈశ్వర్​కు రాసిచ్చింది. 

అప్పటి నుంచి పాండురంగ్ కోపంతో ఉన్నాడు. భూమి విషయంలో ఆయనకు, ఈశ్వర్​రావు ​కుటుంబానికి గొడవలు జరుగుతున్నాయి. పలుమార్లు ఇచ్చోడ పోలీస్​స్టేషన్​లో ఫిర్యాదులు కూడా చేసుకున్నారు. గ్రామ పెద్దలు పంచాయితీ పెట్టి ఇంతకుముందు లక్ష్మీబాయి పంచిన పద్ధతే కరెక్టని చెప్పారు. అయితే, పాండురంగ్ ​మాత్రం తన అన్న కేదోబా దత్తత వెళ్లాడని, ఆయన కొడుక్కు వాటా ఎలా ఉంటుందని ప్రశ్నించాడు. 

ఎవరూ పట్టించుకోకపోవడంతో ఈశ్వర్​ను చంపాలని నిర్ణయించుకున్నాడు.  కొడుకు సూర్యకాంత్ తో కలిసి మంగళవారం ఇచ్చోడలోని సిరిచెల్మ చౌరస్తాలో కాపు కాశాడు. ఉదయం 9 గంటల ప్రాంతంలో పాన్​షాప్​కు వచ్చిన ఈశ్వర్​పై అందరూ చూస్తుండగానే గొడ్డలి, కత్తులతో దాడి చేశారు. ఈశ్వర్​ తనను కాపాడాలంటూ కేకలు వేస్తూ పరుగులు పెట్టినా వదల్లేదు. వెంటపడి గొడ్డలితో నరికి,  కత్తితో పొడిచి చంపారు. తర్వాత పోలీస్​స్టేషన్​కు వెళ్లి లొంగిపోయారు. సీఐ చంద్రశేఖర్, ఎస్సై శ్రీకాంత్ ఘటనా ప్రాంతాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసి నిందితులను రిమాండ్​కు తరలించినట్లు​తెలిపారు.