ఉమ్మడి వరంగల్ జిల్లా సంక్షిప్త వార్తలు

ఉమ్మడి వరంగల్ జిల్లా సంక్షిప్త వార్తలు

పాలకుర్తి, వెలుగు: రాబోయే రోజుల్లో పాలకుర్తి నియోజకవర్గం మంచి టూరిజం స్పాట్​గా మారుతుందని టూరిజం మేనేజింగ్ డైరెక్టర్ మనోహర్, కాకతీయ హెరిటేజ్​ట్రస్ట్ మెంబర్ ప్రొ.పాండురంగారావు  ఆశాభావం వ్యక్తం చేశారు. మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు చారిత్రక కట్టడాలకు పూర్వ వైభవం తీసుకొస్తున్నారని కొనియాడారు. శనివారం మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుతో కలిసి పాలకుర్తిలోని సుప్రసిద్ధ క్షేత్రాలను సందర్శించారు. పాలకుర్తిలోని స్వయంభూ సోమేశ్వరాలయం, పోతన స్వస్థలం బమ్మెర, వాల్మీకి రామాయం రచించిన వల్మిడి క్షేత్రాలను దర్శించుకున్నారు. ఆయా ఆలయాల అభివృద్ధికి రూ.50కోట్లతో పనులు చేపట్టగా.. వాటిని పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ.. పాలకుర్తికి వేల సంవత్సరాల చరిత్ర ఉందన్నారు. ఇక్కడ 22 అడుగుల ఎత్తైన పోతన కాంస్య విగ్రహాన్ని రూ.15కోట్లతో ఏర్పాటు చేశామన్నారు. వల్మిడి ఆలయాన్ని భద్రాద్రికి దీటుగా అభివృద్ధి చేస్తున్నామన్నారు. బమ్మెర పోతన ఆలయాన్ని బాసరలా తీర్చిదిద్దుతామన్నారు. టూరిజం ఎండీ మనోహర్ రావు మాట్లాడుతూ.. పాలకుర్తి సోమనాథ ఆలయ ప్రాంగణంలో రూ.25కోట్లతో హరిత హోటల్​ను నిర్మిస్తామన్నారు. అనంతరం తన క్యాంపు ఆఫీసులో వివిధ అభివృద్ధి పనులపై ఆఫీసర్లతో మంత్రి రివ్యూ నిర్వహించారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ శివలింగయ్య, అడిషనల్ ​కలెక్టర్ ప్రపుల్ దేశాయ్, ఎంపీపీ నల్లా నాగిరెడ్డి, బస్వ సావిత్రి, జడ్పీటీసీలు పల్లా భార్గవి, శ్రీనివాసరావు, ఎండీ మధార్, సర్పంచ్​ యాకాంతారావు ఉన్నారు.


పర్మినెంట్ ఉద్యోగులుగా గుర్తించండి

  వాటర్​ ట్యాంక్​ ఎక్కిన 
ఆశ్రమ పాఠశాలల  డైలీ వేజ్​ వర్కర్లు​

ఏటూరునాగారం, వెలుగు: ఏండ్ల తరబడి గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో చాలీ చాలని వేతనాలతో పనిచేస్తున్నామని, తమను పర్మినెంట్​ ఉద్యోగులుగా గుర్తించాలని  డైలీ వేజ్ వర్కర్లు డిమాండ్ చేశారు. ఈమేరకు శనివారం ఐటీడీఏ పరిధిలో పనిచేసే వర్కర్లు ములుగు జిల్లా ఏటూరునాగారంలో వాటర్ ట్యాంకర్ ఎక్కి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. తమను పర్మినెంట్ చేయాలని ఎన్ని వినతిపత్రాలు ఇచ్చినా ఆఫీసర్లు పట్టించుకోవడం లేదన్నారు. తాడ్వాయిలో 70 రోజులు పాటు రిలే నిరాహార దీక్షలు  కూడా చేశామన్నారు. పెండింగ్ బకాయిలు సైతం సర్కారు విడుదల చేయడం లేదు. అందుకే ట్యాంక్ ఎక్కాల్సి వచ్చిందన్నారు. కాగా, విషయం తెలుసుకున్న ఎస్సై రమేశ్​ వారితో మాట్లాడి, కిందికి దింపారు. సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామన్నారు. ఈ ఘటనపై ఐటీడీఏ పీవో అంకిత్​  స్పందింస్తూ.. సమస్యను డీడీ, డీటీడీవోలతో మాట్లాడి పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. డైలీ వేజ్ వర్కర్లు ఆందోళన చెందవద్దని భరోసా కల్పించారు.


కొత్త మండలంగా గోరికొత్తపల్లి

రేగొండ, వెలుగు: జయశంకర్ భూపాల పల్లి జిల్లా రేగొండ మండలంలోని గోరి కొత్తపల్లి  గ్రామాన్ని ప్రత్యేక మండలంగా ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం గెజిట్ విడుదల చేసింది. దమ్మన్నపేట, చెన్నాపూర్, చిన్నకొడెపాక, జగ్గయ్యపేట, సుల్తాన్ పూర్, జమ్ షెడ్ బేగ్​పేట, కోనరావుపేట గ్రామాలను కలిపి గోరికొత్తపల్లిని మండలం చేసింది. దీంతో గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు.


రామప్పను సందర్శించే తీరిక లేదా?

  కేసీఆర్ పై ఎంపీ సోయం మండిపాటు

వెంకటాపూర్(రామప్ప), వెలుగు: యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప ఆలయాన్ని సందర్శించే తీరక కూడా కేసీఆర్ కు లేకుండా పోయిందని ఆదిలాబాద్ ఎంపీ, ములుగు నియోజకవర్గ పాలక్ సోయం బాపూరావు విమర్శించారు. శనివారం ఉదయం రామప్పను దర్శించుకున్నారు. రామలింగేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు చేసి, ఆలయ విశిష్టత తెలుసుకున్నారు. కేంద్ర ప్రభుత్వ నిధులతోనే రామప్ప అభివృద్ధి జరుగుతోందన్నారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు చింతలపూడి భాస్కర్ రెడ్డి, మండలాధ్యక్షుడు భూక్యా జవహర్​లాల్, జిల్లా ఇన్ చార్జి బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి తదితరులున్నారు.


బీసీలకు మంత్రి పదవి ఇవ్వాలి

హనుమకొండ సిటీ, వెలుగు: వైద్యారోగ్యశాఖను తిరిగి కేసీఆర్ కుటుంబానికే అప్పగించడం సిగ్గుచేటని, ఆ శాఖను బీసీ అభ్యర్థికి కేటాయించాలని బీసీ రాజ్యాధికార సమితి కన్వీనర్ దాసు సురేశ్ డిమాండ్ చేశారు. శనివారం ఆయన బీసీ రాజ్యాధికార సమితి నాయకత్వ శిక్షణ ప్రోగ్రాంకు హాజరై మాట్లాడారు. బీసీ నేత ఈటల రాజీనామా చేసి తర్వాత ఆ శాఖను మరో బీసీ అభ్యర్థికి కేటాయించకపోవడాన్ని తీవ్రంగా  ఖండిస్తున్నామన్నారు. త్వరలో భర్తీ కావాల్సిన 7 ఎమ్మెల్సీ స్థానాల్లో 5 స్థానాలు బీసీలకు కేటాయించాలన్నారు. రాజకీయంగా బీసీలను ఎదగనివ్వకుండా కేసీఆర్ కుట్ర చేస్తున్నారని ఆరోపించారు.

ప్రభుత్వ భూమిలో ఎర్ర జెండాలు

కమలాపూర్, వెలుగు: ఇండ్ల జాగలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ సీపీఐ లీడర్లు, పేదలు ప్రభుత్వ జాగలో ఎర్రజెండాలు పాతారు. ఈ సంఘటన శనివారం హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలం గూడూరు శివారులో జరిగింది. ఈ సందర్భంగా సీపీఐ మండల కార్యదర్శి నకీర్త ఓదెలు మాట్లాడుతూ...  రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందు డబుల్ బెడ్ రూం ఇండ్లు ఇస్తామని మోసం చేసిందన్నారు. ఇప్పుడేమో జాగ ఉన్నోళ్లకే రూ.3లక్షలు ఇస్తామని చెబుతోందన్నారు. పేదలకు జాగ లేక, అటు డబ్బులు లేక ఇబ్బంది పడుతున్నారన్నారు. బేషరతుగా ప్రభుత్వం ఇండ్ల పట్టా
లు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు.


డబుల్ బెడ్ రూం ఇండ్లు ఇంకెప్పుడిస్తరు?

 మందుబాబులకు అడ్డగా మారుతున్నయ్: ఆకునూరి మురళి

హనుమకొండ సిటీ, వెలుగు: పేదలకు దక్కాల్సిన డబుల్ బెడ్​ రూం ఇండ్లను వారంలోగా లబ్ధిదారులకు పంపిణీ చేయాలని మాజీ ఐఏఎస్​ అధికారి ఆకునూరి మురళి డిమాండ్​ చేశారు. లేనిపక్షంలో  ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు. హనుమకొండ​ అంబేడ్కర్​ నగర్​లో నిర్మించిన డబుల్ బెడ్​ రూం ఇండ్లను డెమోక్రటిక్​ ఫోరం సభ్యులతో కలిసి శనివారం పరిశీలించారు. హనుమకొండలో డబుల్​ బెడ్​ రూం ఇండ్లను నిర్మించి పడావు పెట్టారని మండిపడ్డారు. ఇండ్లు మందుబాబులకు అడ్డాగా మారాయని ఆవేదన వ్యక్తం చేశారు. రూ.కోట్లు పెట్టి, కట్టిన ఇండ్లు పేదలకు ఎందుకు పంచడం లేదో ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. డెమోక్రటిక్​ ఫోరం సభ్యులు పృథ్విరాజ్​ తదితరులు పాల్గొన్నారు. 


ప్రభుత్వ భూమిలో ఎర్ర జెండాలు

కమలాపూర్, వెలుగు: ఇండ్ల జాగలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ సీపీఐ లీడర్లు, పేదలు ప్రభుత్వ జాగలో ఎర్రజెండాలు పాతారు. ఈ సంఘటన శనివారం హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలం గూడూరు శివారులో జరిగింది. ఈ సందర్భంగా సీపీఐ మండల కార్యదర్శి నకీర్త ఓదెలు మాట్లాడుతూ...  రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందు డబుల్ బెడ్ రూం ఇండ్లు ఇస్తామని మోసం చేసిందన్నారు. ఇప్పుడేమో జాగ ఉన్నోళ్లకే రూ.3లక్షలు ఇస్తామని చెబుతోందన్నారు. పేదలకు జాగ లేక, అటు డబ్బులు లేక ఇబ్బంది పడుతున్నారన్నారు. బేషరతుగా ప్రభుత్వం ఇండ్ల పట్టాలు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు.