Hardik Pandya: ఇద్దరికీ ఒకే ర్యాంకు.. ఐసీసీ ర్యాంకింగ్స్‌లో హార్దిక్ జోరు

Hardik Pandya: ఇద్దరికీ ఒకే ర్యాంకు.. ఐసీసీ ర్యాంకింగ్స్‌లో హార్దిక్ జోరు

ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో భారత వైస్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా నెం.1 ఆల్ రౌండర్‌గా నిలిచాడు. శ్రీలంక టీ20 కెప్టెన్, ఆల్ రౌండర్‌ వనిందు హసరంగాతో అగ్రస్థానాన్ని పంచుకున్నాడు. ప్రస్తుతం 222 రేటింగ్ పాయింట్లతో వీరిద్దరూ సమంగా ఉన్నారు.

ఈ ఏడాది ఐపీఎల్‌లో విఫలమైన పాండ్యా.. టీ20 ప్రపంచకప్ 2024లో మాత్రం అద్భుతంగా రాణించాడు. భారత జట్టుకు ఆరో బౌలర్ కొరత తీర్చడమే కాకుండా.. ప్రతి మ్యాచ్‌లోనూ రాణించాడు. లోయర్ ఆర్డర్‌లో విలువైన భాగస్వామ్యాలు నెలకొల్పుతూ జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. 6 ఇన్నింగ్స్‌లలో 48 సగటు, 151.57 స్ట్రైక్ రేట్‌తో 144 పరుగులు చేశాడు. 11 వికెట్లు తీశాడు. ఇక, దక్షిణాఫ్రికాతో జరిగిన టీ20 ప్రపంచకప్ ఫైనల్‌లో చేజారిన మ్యాచ్‌ను భారత్ వశం చేశాడు. కీలక సమయంలో హెన్రిచ్ క్లాసెన్ వికెట్‌ను తీయడమే కాకుండా విజయవంతంగా 16 పరుగులు డిఫెండింగ్ చేశాడు. ఫైనల్‌లో కేవలం 20 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. ఈ ప్రదర్శనలే అతనికి అగ్రస్థానాన్ని కట్టబెట్టాయి.

వీరిద్దరూ నెంబర్.1స్థానానికి పరిమితమవ్వడంతో.. ఆస్ట్రేలియా ఆల్ రౌండర్‌ మార్కస్ స్టోయినిస్ మూడో స్థానం దక్కింది. ఇక, జింబాబ్వే ఆల్‌రౌండర్‌ సికందర్ రజా, బంగ్లాదేశ్ ఆల్ రౌండర్‌ షకీబ్ అల్ హసన్ వరుసగా నాలుగు, ఐదు స్థానాల్లో ఉన్నారు. తాజా ఐసీసీ ర్యాంకింగ్స్‌లో ఆసక్తికర విషయమేమిటంటే, టీ20 ప్రపంచకప్ సమయంలో ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో ఉన్న ఆఫ్ఘనిస్తాన్ వెటరన్ మహ్మద్ నబీ ఆరో స్థానానికి పడిపోయాడు.

ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్ ఆల్ రౌండర్లు

  • 1. హార్దిక్ పాండ్యా: 222 రేటింగ్ పాయింట్లు   
  •     వనిందు హసరంగా: 222 రేటింగ్ పాయింట్లు
  • 3. మార్కస్ స్టోయినిస్: 211 రేటింగ్ పాయింట్లు
  • 4. సికందర్ రజా: 210 రేటింగ్ పాయింట్లు
  • 5. షకీబ్ అల్ హసన్: 206 రేటింగ్ పాయింట్లు