రాయలసీమ లిఫ్ట్​పై ఏపీకి చుక్కెదురు.. పనులన్నీ ఆపేయాలని ఈఏసీ ఆదేశం

రాయలసీమ లిఫ్ట్​పై ఏపీకి చుక్కెదురు.. పనులన్నీ ఆపేయాలని ఈఏసీ ఆదేశం
  • పర్యావరణ అనుమతులు లేకుండా ప్రాజెక్టు చేపట్టడంపై ఈఏసీ అభ్యంతరం
  • డీపీఆర్​ మాటున చేసిన పనులన్నింటినీ ఆపి.. ఆ ప్రాంతాన్ని పూర్వ స్థితికి తేవాలి
  • తవ్విన ప్రాంతాన్ని మొత్తం పూడ్చేయాలి.. తాత్కాలిక నిర్మాణాలు తొలగించాలి
  • రీస్టోరేషన్​ కోసం తీసుకున్న చర్యలపై ఏపీ అఫిడవిట్​ను సమర్పించాలి
  • అఫిడవిట్​లోని అంశాలకు.. సైట్​ ఇన్​స్పెక్షన్​కు 
  • పొంతన లేకుంటే చర్యలు తప్పవని హెచ్చరిక
  • మంత్రి ఉత్తమ్, సెక్రటరీ రాహుల్​ బొజ్జా లేఖలకు స్పందన


హైదరాబాద్, వెలుగు: రాయలసీమ లిఫ్ట్​ ఇరిగేషన్​ స్కీమ్(ఆర్​ఎల్​ఐఎస్​) ప్రాజెక్ట్​పై ఏపీకి చుక్కెదురైంది. పర్యావరణ అనుమతుల (ఈసీ– ఎన్విరాన్మెంటల్​ క్లియరెన్స్​)పై ఎక్స్​పర్ట్స్ అప్రైజల్​కమిటీ(ఈఏసీ) అభ్యంతరాలు వ్యక్తం చేసింది. అక్రమంగా చేపట్టిన ఆ ప్రాజెక్టుకు ఇప్పుడప్పుడే ఈసీ అనుమతులు ఇవ్వబోమని చెప్పకనే చెప్పింది. ప్రాజెక్టును ఆపాలంటూ కాంగ్రెస్​ సర్కారు చేస్తున్న పోరాటం, మంత్రి ఉత్తమ్​ కుమార్​ రెడ్డి, ఇరిగేషన్​ సెక్రటరీ రాహుల్​ బొజ్జా రాసిన లేఖల ఫలితంగా.. ఏపీకి ఈఏసీ వార్నింగ్​ఇచ్చింది.  ఈ ఏడాది జనవరి 10న ఢిల్లీలో జరిగిన ఈఏసీ మీటింగ్​లో.. ఆ ప్రాజెక్టుకు సంబంధించిన అనుమతుల టర్మ్స్​ ఆఫ్​ రిఫరెన్స్​ను మార్చాలని ఈఏసీ నిర్ణయించింది. ఆ మీటింగ్​కు సంబంధించిన మినిట్స్​ను ఫిబ్రవరి 27న ఈఏసీ విడుదల చేసింది. ఎలాంటి పర్యావరణ అనుమతులు లేకుండానే ఏపీ రాయలసీమ లిఫ్ట్​ ప్రాజెక్టును చేపట్టిందని పర్యావరణ మంత్రిత్వ శాఖతో పాటు ఈఏసీ మెంబర్​ సెక్రటరీ కమిటీ దృష్టికి తీసుకొచ్చారు. ఇప్పటికే దీనిపై రైతు గవినోళ్ల శ్రీనివాస్​ పిటిషన్​ మేరకు నేషనల్​ గ్రీన్​ ట్రిబ్యునల్​లో వాదనలు జరుగుతున్నాయని కమిటీకి వివరించారు. ఆ వాదనలను పరిగణనలోకి తీసుకున్న ఈఏసీ.. ఈసీ కావాలంటే ముందు ప్రాజెక్టు సైట్​ను పూర్వ స్థితికి తీసుకురావాలని తేల్చి చెప్పింది. 

తప్పుడు వివరాలిస్తే చర్యలు తప్పవ్​..

ప్రాజెక్టుకు సంబంధించి డిటెయిల్డ్​ ప్రాజెక్ట్  రిపోర్ట్​ (డీపీఆర్​) కోసం చేపట్టిన పనులు.. డీపీఆర్​కు అవసరమైన దానికన్నా ఎక్కువగా ఉంటే చర్యలు తప్పవని ఈఏసీ హెచ్చరించింది. రాయలసీమ లిఫ్ట్​ పనులు చేపడుతున్న ప్రాంతాన్ని పూర్వ స్థితికి తీసుకురావాలని ఆదేశించింది. అందుకు అనుగుణంగా ఈసీ అప్లికేషన్​ సమయంలో అఫిడవిట్​ రూపంలో ఏపీ అండర్​ టేకింగ్​ను సమర్పించాలని తేల్చి చెప్పింది. డీపీఆర్​ అవసరాలకు మించి పనులు జరగలేదంటూ ఉన్నత స్థాయి అధికారి సంతకంతో అఫిడవిట్​ను ఇవ్వాలని, దానికి పూర్వస్థితికి తీసుకొచ్చిన పనులకు సంబంధించిన ఫొటోలు, తీసుకున్న చర్యలు, రీస్టోరేషన్​ కోసం ఎంచుకున్న పద్ధతులు, ఆ పనులు ఎప్పుడు పూర్తి చేశారు వంటి పూర్తి వివరాలను అఫిడవిట్​కు జత చేయాలని స్పష్టం చేసింది. అఫిడవిట్​లో ఉన్న దానికి భిన్నంగా ప్రాజెక్ట్​ సైట్​లో పనులు జరిగినట్టు తేలినా.. తప్పుడు సమాచారం ఇచ్చినా.. కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది. వాటర్​(కాలుష్య నివారణ, నియంత్రణ) చట్టం 1974, ఎయిర్ (కాలుష్య నివారణ, నియంత్రణ) చట్టం 1981, పర్యావరణ (పరిరక్షణ) చట్టం 1986 ప్రకారం చర్యలు తీసుకుంటామని ఈఏసీ వార్నింగ్​ ఇచ్చింది. ఈ అంశాలన్నింటి ఆధారంగా జనవరి 10న నిర్వహించిన మీటింగ్​లో నిర్ణయించినట్టుగా ప్రాజెక్ట్ టర్మ్స్​ ఆఫ్​ రిఫరెన్స్​ను పూర్తిగా మార్చాలని కమిటీ ఏకగ్రీవంగా తీర్మానించింది. 

తాత్కాలికమైనవి తొలగించాల్సిందే..

ఈసీకి అప్లై చేసుకోవడానికి ముందు ఏపీ.. ప్రాజెక్ట్​ సైట్​లో చేపట్టిన తాత్కాలిక నిర్మాణాలన్నింటినీ తొలగించాల్సిందేనని ఈఏసీ స్పష్టం చేసింది. డీపీఆర్​ ప్రిపరేషన్​ కోసమే చేశారని చెబుతున్న పనుల వల్ల పర్యావరణానికి ఎలాంటి హాని జరగకుండా ఉండాలని తేల్చి చెప్పింది. తవ్విన ప్రాంతాలను పూడ్చేయాలని, డీపీఆర్​ కోసం ఆ ప్రాంతంలో ఇంకా ఏమేం పనులు చేశారో వాటన్నింటినీ పూర్వస్థితికి తీసుకురావాలని స్పష్టం చేసింది. ఈసీ కోసం అప్లికేషన్​ పెట్టుకునే సమయంలో అన్ని నిబంధనలను పాటించాలని తేల్చి చెప్పింది.

 ‘‘ఎన్విరాన్మెంటల్​ ఇంపాక్ట్​ అసెస్​మెంట్ 2006 నిబంధనలకు లోబడి డీపీఆర్​ కోసం సైట్​లో పనులు చేసినట్టుగా నో అబ్జెక్షన్​ సర్టిఫికెట్​ను తీసుకురావాలి. ఆ సైట్​లో కేంద్ర పర్యావరణ శాఖ, సీడబ్ల్యూసీ, జియోలాజికల్​ సర్వే ఆఫ్​ ఇండియా, సెంట్రల్​ సాయిల్​ అండ్​ మెటీరియల్​ రీసెర్చ్​ స్టేషన్​ జాయింట్​ ఇన్​స్పెక్షన్​ తర్వాత.. అందుకు అనుగుణంగానే ఎన్​వోసీని తీసుకోవాలి. కేంద్ర పర్యావరణ శాఖ రీజనల్​ ఆఫీసర్​ దానికి నోడల్​ ఆఫీసర్​గా ఉండాలి. ప్రాజెక్ట్  చేపడుతున్న ప్రాంతంలో పర్యావరణ నష్టం జరగలేదని జాయింట్​ ఇన్​స్పెక్షన్​ టీమ్​ నిర్ధారించాలి. ఒకవేళ ఏదైనా నష్టం జరిగినట్టు తేలితే.. అందుకు అనుగుణంగా దానిపై వివరాలను రిపోర్టు రూపంలో సమర్పించాలి. లీగల్, రెగ్యులేటరీ నిబంధనలకు అనుగుణంగా నివేదికను తయారు చేయాలి. సైట్​ రీస్టోరేషన్​ కోసం ఏపీ తీసుకున్న చర్యలు, ఫొటో ఎవిడెన్సులు, రీస్టోరేషన్​ పద్ధతులపై సమగ్రమైన రిపోర్టును కేంద్రానికి (పర్యావరణ మంత్రిత్వ శాఖకు) సమర్పించాలి. దాంతోపాటు ఈఏసీ సూచించిన టర్మ్స్​ ఆఫ్​ రిఫరెన్స్​ను పర్యావరణ శాఖ సమీక్షించి సైట్​ ఇన్​స్పెక్షన్​కు అనుగుణంగా సర్టిఫికెట్​ను తీసుకోవాలి. దానికి మరికొంత టైం పట్టే అవకాశం ఉంటుంది కాబట్టి.. టెక్నాలజీ సాయాన్ని తీసుకునేలా సక్టోరల్​ ఈఏసీతో సంప్రదింపులు జరిపి ముందుకెళ్లాలి’’ అని ఈఏసీ స్పష్టం చేసింది.   

నిబంధనలను ఏపీ ఉల్లంఘించింది: మంత్రి ఉత్తమ్​ కుమార్​ రెడ్డి

ఏపీ నిర్మించతలపెట్టిన రాయలసీమ లిఫ్ట్​ స్కీమ్​ ప్రాజెక్టుకు కేంద్రం పర్యావరణ అనుమతులను నిరాకరించడం కాంగ్రెస్ ​సర్కార్ ​విజయమని ఇరిగేషన్​ శాఖ మంత్రి ఉత్తమ్​ కుమార్​ రెడ్డి చెప్పారు. అంతర్రాష్ట్ర నిబంధనలను ఉల్లంఘించి ఏపీ ప్రాజెక్టును చేపట్టిందని పలుమార్లు కేంద్రానికి తాను ఫిర్యాదు చేశానని, దాంతో పాటు ఇరిగేషన్​ సెక్రటరీ రాహుల్​ బొజ్జా కేంద్రానికి లేఖ కూడా రాశారని గుర్తుచేశారు. కృష్ణా రివర్​ మేనేజ్​మెంట్​ బోర్డు (కేఆర్ఎంబీ), అపెక్స్​ కౌన్సిల్​ అనుమతులు లేకుండానే ఏపీ ఈ ప్రాజెక్టును చేపట్టాలని లక్ష్యంగా పెట్టుకున్నదని శనివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. 

పర్యావరణ చట్టాలనూ ఏపీ ఉల్లంఘించిందన్నారు. ఇలాంటి కీలక సమయంలో కాంగ్రెస్​ సర్కారు.. కృష్ణా జలాల్లో తెలంగాణ హక్కును కాపాడేందుకు చర్యలకు ఉపక్రమించిందన్నారు. ఎన్​జీటీ, పర్యావరణ శాఖ, కృష్ణా బోర్డు, కృష్ణా ట్రిబ్యునల్​ ముందు తెలంగాణ బలమైన వాదనలు వినిపించడంతోనే ఏపీ విషయంలో ఈఏసీ ఈ కీలక నిర్ణయం తీసుకున్నదని పేర్కొన్నారు. ఎన్​జీటీ ఉత్తర్వులను సమీక్షించిన ఈఏసీ.. ఏపీ నిబంధనలను ఉల్లంఘించి ప్రాజెక్టును చేపట్టిందన్న నిర్ణయానికి వచ్చిందని మంత్రి ఉత్తమ్​ చెప్పారు. రాయలసీమ ప్రాజెక్టు నిర్మాణాన్ని తాము అడ్డుకోకుంటే రాష్ట్రంలోని కృష్ణా నది పరీవాహక ప్రాంతంలో సాగు, తాగునీటికి ఎన్నో ఇబ్బందులు ఏర్పడేవని పేర్కొన్నారు.