వరంగల్/హసన్‍పర్తి, వెలుగు : కాకతీయ యూనివర్సిటీలో జరుగుతున్న 82వ ఇండియన్ హిస్టరీ కాంగ్రెస్ సదస్సులో భాగంగా రెండో రోజైన శుక్రవారం ‘దళిత్ హిస్టరీ’ అంశంపై ప్యానెల్ సెషన్ నిర్వహించారు. ప్రొఫెసర్ బి.రామచందర్ రెడ్డి అధ్యక్షుడిగా ‘రూట్స్ఆఫ్ ఇండియన్ సబల్ట్రన్ లేబర్ : ట్రాజెక్టరీస్ ఆఫ్ కాస్ట్ ఆక్యూపెషనల్ ప్యాటర్స్న్ అండ్ ది మార్జినలైజ్డ్’ అంశంపై 22 మంది పరిశోధకులు సామాజిక, వర్తమాన, పూర్వ అంశాలపై పేపర్ సబ్మిషన్ చేశారు. న్యూఢిల్లీ జేఎన్ యూనివర్సిటీ హిస్టరీ ప్రొఫెసర్ చిన్నారావు, చిట్టిబాబు ప్యానలిస్టులుగా వ్యవహరించారు.
దళిత్ హిస్టరీ గతంలో నిర్లక్ష్యానికి గురైందని, 2016 నుంచి చరిత్రకారులు దళితులపై పరిశోధనలు చేయడం ప్రారంభించారని ప్రొఫెసర్లు తెలిపారు. అనంతరం ‘రీస్ట్రక్చరింగ్ ఇండియన్ ఎకానమీ థియరీ’, ‘డెక్కన్ పాస్ట్ అండ్ ప్రజెంట్’ అంశాలపై పేపర్ సబ్మిషన్స్, డిస్కషన్స్ జరిగాయి. కాగా, ఇండియన్ హిస్టరీ కాంగ్రెస్ సదస్సు శనివారం ముగియనుంది. ఈ సందర్భంగా ముగింపు వేడుకలు నిర్వహించనున్నారు. సాయంత్రం 4 గంటలకు నిర్వహించే ఈ వేడుకల్లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు కొండా సురేఖ, సీతక్క తదితరులు పాల్గొంటారని హిస్టరీ ప్రొఫెసర్ టి.మనోహర్ తెలిపారు.